ప్రజాస్వామ్యం ఆందోళనకరం!

  • ధరలు దాడి చేస్తున్నాయి… జిఎస్టీ పేరుతో బాదేస్తున్నారు…
  • పెట్రో ధరల దాడితో సామాన్యులు అతలాకుతలం
  • సమస్యల సుడిగుండంలో రైతాంగం
  • సహకారరంగం పూర్తిగా కట్టుతప్పింది

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం ఆందోళనకరంగా మారుతోంది.  ధరలు దాడి చేస్తున్నాయి… జిఎస్టీ పేరుతో బాదేస్తున్నారు. సమస్యల సుడిగుండంలో   రైతులు విలవిల్లాడుతున్నారు.  పెట్రో ధరల దాడితో సామాన్యులు అతలాకుతలం అవుతున్నారు.   రైతుల్లో  నైరాశ్యం నెలకొంటోంది.. ధాన్య సేకరణ అన్నది ఇప్పటికీ ఓ మిధ్యగానే  మారింది.  మిర్చి, పత్తి, వరి తదితర పంటలకు సేకరణ విధానం లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.  పంటలు మార్కెట్‌కు తరలిస్తున్నా..గిట్టుబాటు ధరలు రావడం లేదు.  సమస్యల సుడిగుండంలో   రైతులు  లబోదిబోమంటున్నారు.  పెట్రో ధరల దాడితో సామాన్యులు అతలాకుతలం అవుతున్నారు. ఇలా ఒకటా..రెండా ఏ రంగంలో  ఆయా రంగాల్లో అన్నీ సమస్యలే. ఈ సమస్యలపై గత పదేళ్లుగా ఏ అంశాన్ని కూడా చర్చించడానికి  ప్రభుత్వం ముందుకు రావడం లేదు. ఈ క్రమంలో  పార్లమెంట్ సభ్యులను  ప్రజలు నిలదీయాలి.  విూరు సమస్యలు చర్చించే స్వేచ్ఛను విూకు పార్టీ ఇస్తుందా అని అడగాలి. నియోజకవర్గ సమస్యలను చర్చించే అవకాశం ఏ ఒక్క  ఎంపికి కూడా రావడం లేదు. పార్లమెంట్‌ సమావేశాలు ఎన్నిసార్లు జరిగినా మొక్కుబడిగా ముగించేస్తున్నారు.

ఏటా రెండుమూడు సార్లు సమావేశాలు జరుగుతున్నా ప్రధాన సమస్యలపై చర్చించేందుకు అధికార పార్టీలు సైతం  ముందుకు రావడం లేదు. గొప్పలు చెప్పుకుంటున్న  నేతలు కూడా ప్రజల సమస్యలపై చర్చించాలన్న ఇంగితాన్ని ప్రదర్శించడం లేదు. పార్లమెంట్‌ ఉన్నదే ప్రజల సమస్యలపై చర్చించడానికి అన్న స్పృహ లేకుండా కాలాన్ని గడిపేస్తున్నారు.  పార్లమెంట్‌ సమావేశాలు మొక్కుబడిగా జరుగుతున్న వేళ..ఎంపిలను ఎన్నుకుని ఏం లాభం అన్న అనుమానం కలుగుతోంది. ఈ తరహా ప్రజాస్వామ్యం ఆందోళనకరం కాక మరోటికాదు. ప్రజలు అనేకానేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. పెట్రో ధరల దాడితో సామాన్యులు అతలాకుతలం అవుతున్నారు. ధరలు దాడి చేస్తున్నాయి. జిఎస్టీ పేరుతో బాదేస్తున్నారు. ఇవన్నీ ఎవరికి చెప్పుకోవాలి. ఎవరు వీటిని చర్చించి నిర్ణయిస్తారు. కేవలం పార్లమెంటుకు మాత్రమే చర్చించే అవకాశం ఉంది. కాబట్టి ఎంపిలు ఇప్పటినుంచి ఈ  సమస్యలపై సిద్దంగా ఉండాలి. పార్లమెంటులో తమకు మెజార్టీ ఉందికదా అని అధికారపార్టీ సమస్యలపై ఇంతకాలం పెద్దగా చర్చకు పూనుకోలేదు. ఇంతకన్నా దారుణం ఉండదు.

నిజానికి దేశంలో నేటికీ పంటల కొనుగోళ్లకు సంబంధించి స్పష్టమైన  విధానాలు లేవు. మద్దతు ధరలకు సంబంధించి స్పష్టమైన విధానాలు లేవు. రైతులు ఆరుగాలం కష్టించి పండించిన  పంటలను ఎలాగైనా కొనుగోలు చేసి… వాటిని ప్రజలకు చేర్చాలన్న విధానాలూ లేవు. పంటల కొనుగోళ్లకు సంబంధించి జాతీయ విధానం, ఆహార పంటల ఎగుమతుల విధానాలను అమలు చేయడం లేదని వ్యవసాయ నిపుణులు ఎప్పటినుంచో మొత్తుకుంటున్నారు. కందుల కొనుగోళ్లకు సంబంధించి ఇప్పటివరకు స్పష్టత లేదు. మార్క్‌ఫెడ్‌ రంగంలోకి దిగలేదు. ఇప్పటికే రైతులు పంటను అమ్మడానికి సిద్దం చేశారు. ఓవైపు కందిపప్పు ధరలు అమాంతంగా పెరుగు తున్నా.. కందులకు మాత్రం ధరలు మాత్రం రైతులకు దక్కడం లేదు. మార్కెట్‌లో సామాన్యులకు పప్పుల ధరలు అందనంతగా పెరిగాయి. సాగుచట్టాలను బలవంతగా రుద్దేందుకు యత్నించిన కేంద్రం ..పంటల కొనుగోళ్లకు సంబంధించి జాతీయ విధానాలను నేటికీ రూపొందించడంలేదు. నిజానికి సాగుచట్టాల్లో ఇవన్నీ పొందుపర్చి ఉంటే ఆందోళనలు జరిగి వుండేవి కాదు. ఏ రాష్ట్రంలో ఏ పంట పండుతుందో లెక్కలు వేయాలి. ఏపంట పండించాలో  కూడా లెక్కలు వేయాలి.

దేశానికి ఏ పంటలు అవసరమో ప్రణాళిక సిద్దం చేయాలి. కానీ అలా జరగగడం లేదు. పార్లమెంటులో ఈ సమస్యలపై సమగ్రంగా చర్చించడం లేదు. రాజ్యాంగం  మేరకు అవసరమైనన్ని రోజులు సమావేశాలు నిర్వహించడం, తమకు అనుకూలమైన బిల్లులు రూపొందించడం..ముగించడం అన్న ప్రక్రియను ప్రభుత్వం ఎంచుకుంది. ఇది ఎవరికి లాభమో ప్రజలు ఆలోచన చేయాలి. ఇకపోతే ఎన్నికల ముందు గ్యాస్‌, పెట్రో ధరలను తగ్గించడం, తరవాత పెంచుతూ పోతే ప్రజలు ఏం కావాలన్న కనీస జ్ఞానం కూడా పాలకులకు ఉండడం లేదు. ఈ దేశంలో అనుత్పాదక రంగాలను పెంచి పోషిస్తున్నారు. దుబారా ఖర్చులు చేస్తున్నారు. వీటి గురించి ఎవరు కూడా నిలదీయడం లేదు. బ్యాంకులను ముంచినోళ్లను.. కంపెనీలు పెట్టి రుణాలు ఎగ్గొట్టినోళ్లను వెనకేసుకుని వస్తున్న ప్రభుత్వం రైతులకు సంబంధించి ఆమోదయోగ్య విధానాలను మాత్రం రూపొందించడం లేదు. పంటల కొనుగోళ్లను రాష్ట్రాలకు  వదిలేయడం వల్ల ధాన్య సేకరణ అన్నది ఇప్పటికీ ఓ మిధ్యగా మారింది. మిర్చి,పత్తి, వరి తదితర పంటలకు సేకరణ విధానం లేక పోవడంతో రైతులు నష్టపోతున్నారు.

పంటలు మార్కెట్‌కు తరలిస్తున్నా..గిట్టుబాటు ధరలు రావడం లేదు. ఈ దశలో వారివద్దనుంచి పంటలను కనీస మద్దతు ధరలకు కొనుగోళ్లు చేసేలా చర్యలు తీసుకోవాలి. వారిని ఆదుకునేందుకు ఎంత సాయం చేసినా దేశ అభివృద్దికి పునాది పడినట్లే. రైతుల్లో  నైరాశ్యం నెలకొంటే దేశానికే ప్రమాదం.  ఇది గమనించని పాలకులు తాము అనుసరిస్తున్న విధానాల వల్ల వ్యవసాయం భారంగా మారుతోంది. పంటలు పండించిన రైతులను ఆదుకునేందుకు కేవలం పంటలను మద్దతు ధరలు ఇచ్చి కొనుగోలు చేయాలని ఏటా ఆందోళన లు చేస్తున్నా, రోడ్డెక్కుతున్నా ప్రభుత్వాలకు చీమకుట్టినట్లు కూడాలేదు. తమ పంటను కొనుగోలు చేయాలంటూ ఆందోళనలకు దిగడం పరిపాటే అన్న ధోరణిలో ప్రభుత్వాలకు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంది. ధరలు పెరుగుతున్నా పండిన పంటను ప్రజలకు చేరువ చేయడంలో ప్రభుత్వం విఫలం అవుతోంది. ఇలాంటి ఆందోళనలు లేకుండా ముందస్తు చర్యలకు ఉపక్రమించడం లేదు. సహకార సంఘాలు, మార్కెట్‌ కమిటీలు ఉన్నా లాభం లేదన్న పరిస్థితి ఏర్పడింది సిసిఐ, మార్క్‌ఫెడ్‌ లాంటి సంస్థలు ఉన్నా న్యాయం జరగడం లేదు.

ఇలా ఎంతకాలం రైతులు ఆందోళనలకు దిగాలో పాలకులు చెప్పాలి. ఇవన్నీ చెప్పుకోవడానికి వేదిక లేదు. చర్చిద్దామంటే పార్లమెంటులో అవకాశం ఇవ్వడం లేదు. అందువల్ల   ప్రజలు పార్లమెంట్‌ చర్చలపై నిలదీయాలి. అప్పుడే పాలకులుగా ఉన్నవారు  తప్పులు గుర్తిస్తారు. పాలకులంటే దేవలోకం నుంచి దిగివచ్చినట్లుగా చూసే రోజులు పోవాలి. ప్రజాస్వామ్యంలో కూడా రాచరిక పోకడలను అనుసరిస్తున్న వారికి  బుద్ది చెప్పాలి. ప్రజలు కూడా తాయిలాలకు లొంగి వోటేసినంత కాలం ఇలాంటి దౌర్భాగ్యపు పాలన తప్పదు. అందువల్ల తాయిలాలకు లొంగకుండా సమస్యలపై నిలదీసే ధైర్యం తెచ్చుకోవాలి. ఇక  సహకార వ్యవస్థలో దగుల్బాజీలు చేరడం వల్ల అది నిర్వీర్యం అవుతోంది. రైతులను ఆదుకుని వారికి అండగా నిలవాల్సిన సహకారరంగం పూర్తిగా కట్టుతప్పింది.  సహకార బ్యాంకులు తమ విధానాలను పూర్తిగా తుంగలో తొక్కాయి.

నిజానికి గ్రామస్థాయిలో సహకార రంగం బలంగా ఉంటే.. రైతులు బలపడతారు. సహకారరంగంతో పాటు మార్కెట్‌ వ్యవస్థ కూడా బలంగా ఉండాలి. తెలంగాణలో రైతు సమన్వయ సమితులు  ఏర్పాటు చేసినా అవి కేవలం ఓ రాజకీయ కమిటీలుగా పనిచేసాయి. పదవుల కోసం సృష్టించిన కమిటీలుగా దిష్టిబొమ్మలులగా నిలిచాయి. దీనిని ప్రకటించినప్పుడు ఆనాటి సిఎం సిఎం కెసిఆర్‌ ఎన్నో ఆదర్శాలు ప్రకటించారు. రైతు సమన్వయ సమితులు ఎక్కడా ఒక్క రైతు సమస్యను పరిష్కరించిన దాఖలాలు లేవు. మార్కెట్లో రైతులు పడిగాపలు కాసినా, ధరలు రాక అవస్థలు పడ్డా  ధాన్యం తడిసి నెత్తీనోరు మొత్తుకున్నా ఫలితం లేకపోయింది.  నిజానికి రైతులకు అండగా ఉండాల్సిన సమన్వయ సమితులు ఉత్సవ విగ్రహాల్లా మారాయి కనుకనే రైతులపై కేంద్రంతో పోరాడుతున్నారు. తెలంగాణకు సంబంధించి రైతువిధానాలు రూపొందించడంలో ఈ సమితి పూర్తిగా విఫలం అయ్యింది. రైతులు తమ బాధులు పడలేక అందరి లాగే తానూ ఏదో పట్నం వెళ్లి పనిచేసుకుంటూ పొట్ట పోసుకుంటానని నిర్ణయించు కుంటే..ప్రజల గతేం కానుందో ఊహించుకోవాలి.

వ్యవసాయం పడావు పడితే ప్రజలకు అన్నపానీయాలు దొరకవు…ఆధునిక యువతకు వ్యవసాయంపై బొత్తిగా అవగాహన లేకపోవడం కూడా మనకు ప్రమాదమే… అందుకే వ్యవసాయాన్ని ప్రాథమిక స్థాయి నుంచి విద్యలో పాఠ్యాంశంగా చేర్చాలి. అప్పుడే ప్రజలకు అవగాహన పెరుగుతుంది. రైతులకు కావాల్సింది సకాలంలో నీరు రావడం.. నిరంతరాయంగా విద్యుత్‌ అందుబాటులో ఉండడం.. పెట్టుబడి కోసం బ్యాంకులు విరివిగా రుణాలు ఇవ్వడం..ఇవన్నీ సక్రమంగా జరిగిన తరవాత పంటలను ఎలాంటి పేచీలు లేకుండా కొనుగోలు చేయడం.. ఇలా చేస్తే మన పొలాల్లో వారు బంగారాన్నే పండిస్తారు. అందుకు అవసరమైన వాతావరణం సృష్టించాలి. రైతులకు అలక రాకుండా.. వారు నైరాశ్యం చెందకుండా వెన్నుతట్టి ప్రోత్సహించాలి. రైతు బంధు పేరుతో దుబారాగ చేయడం కూడా సరికాదు. వ్యవసాయాన్ని పండగ చేయాలన్న ఆలోచనతో కార్యాచరణకు దిగాలి.

వ్యవసాయం దండుగ అన్న నానుడి నుంచి వ్యవసాయం పండుగ అనేలా చేయాలి. రైతులు నిశ్చింతంగా వ్యవసాయం చేయొచ్చు అన్న భావన కలిగించాలి. గత పదేళ్లలో  తీసుకున్న చర్యలు మేలుచేసేవిగా లేవనే చెప్పాలి. పంటల కొనుగోళ్ల సమయంలో రైతులకు ఆందోళన లేకుండా పంటలను అమ్ముకోవడం లేదు. నిశ్చింతంగా మార్కెట్‌కు వచ్చి పంటలను చక్కగా అమ్ముకోగలిగేలా మార్కెట్‌ విధానాలు అవలంబించాలి. అప్పుడే సంపూర్ణ ప్రోత్సాహం దక్క గలదు. అయితే మార్కెటింగ్‌ వ్యవస్థ ఒక్కటే సక్రమంగా లేకపోవడంతో ఏటా రైతులు పండించిన  పంటలను మద్దతు ధరలకు అమ్ము కోలేక పోతున్నారు. ఆర్థికంగా అండగా నిలవాలన్న విధంగా కార్యక్రమాలు చేయాలి. అప్పుడే దేశం కూడా ఆర్థికంగా పుంజుకుంటుంది. ప్రజలకు తక్కువ ధరలో ఆహారధాన్యాలు అందుతాయి. ఎగుమతుల ద్వారా విదేశీమారకం సంపాదించుకోగలుగుతాం.

అలా చేయనంత కాలం భారత అన్నదాతల తలరాత మారదు.  కేవలం రైతుబంధు, ఉచిత విద్యుత్‌ సరఫరాతో సత్ఫలితాలు రావని గుర్తించడం లేదు. రైతుబంధులోనూ వ్యవసాయం చేయని వారి ఖాతాల్లో నగదు పడిపోతోంది. దీనిని సవిూక్షించాల్సిన అవసరం ఉంది. పొరంబోకు భూములున్న వారికి రైతుబంధు పేరుతో లక్షల్లో జమ చేసారు. దీనిపై సవిూక్షించాలి. ఇలా డబ్బు వృధాను అరికట్టాలి. వ్యవసాయం చేస్తున్నారా లేదా.. ఆ భూముల్లో ఏ పంటలు పండుతున్నాయో గుర్తించాలి. ఇలాంటి భూములకు ఉచిత విద్యుత్‌ ఇస్తూ గృహవినియోగదారులపై ఛార్జీల భారం మోపడం సరికాదు. నీటిసౌకర్యం పెరగడంతో తెలంగాణలో ధాన్యం దిగుబడులు కూడా పెరిగాయి. అయితే ఈ మేరకు కొనుగోళ్లు మాత్రం సాగడం లేదు. చివరి గింజవరకు ధాన్యం కొంటామన్న ప్రకటనకు కట్టుబడి విస్తృత ఏర్పాట్లు చేయాలి. తెలంగాణలో చేపట్టిన రైతుబంధు పథకం ఎంతగా దుర్వినియోగం అయ్యిందో చూశాం. దీనిని గొప్పగా చెప్పుకోవడం సిగ్గుచేటు. వారికి అందించిన పెట్టుబడి ప్రోత్సాహకం అన్నది వారిలో భరోసా కల్పించేదిగా మాత్రమే  ఉండాలి. రైతును రాజు చేసేందుకు, వ్యవసాయాన్ని పండగ చేసేందుకు తీసుకొచ్చిన రైతుబంధు పథకం కేవలం ఓట్ల పథకంలా మారింది . చెరువుల పునురుద్దరణ కార్యక్రమాలు డొల్ల అని తేలాయి.

-ఎం.శ్రీనివాస్, 
సీనియర్ జర్నలిస్ట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *