దేశానికి ఆదర్శంగా గొప్పగా విలసిల్లాల్సిన మొదళ్ళు ఇప్పుడు నిస్తేజంగా నిస్సత్తువగా అప్రజాస్వామిక అశాస్త్రీయ మూఢ అంధ విశ్వాసాలకు కేంద్రంగా మారాయా? అన్న సందేహం కలుగుతున్నది.దేశ భవిష్యత్తును రూపొందించేవి పార్లమెంటులు కావు.. పాఠశాలలే అన్న జవహర్‌లాల్ నెహ్రూ మహాశయుడి ఆశయం కానీ., తరగతి గదిలో దేశ భవిష్యత్తు రూపొందించ బడుతుందన్న డా.డిస్ కొదారి మాటలన్నీ తిరగబడుతున్నట్లు కనబడుతున్నవి.1888 సెప్టెంబర్ 5న మద్రాస్ ఉమ్మడి రాష్ట్రంలోని తిరువళ్లూర్ జిల్లా తిరుత్తణిలో జన్మించిన సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినంగా జరపుకుంటున్న దేశంలో విద్యాతత్వవేత్తగా రాష్ట్ర ఉపరాష్ట్రపతుల హోదాల్లో ప్రొఫెసర్‌గా విద్యారంగం సమాజ అభ్యున్నతి కోసం కృషి సల్పిన సర్వేపల్లి రాధాకృష్ణన్ బహుశా తన జయంతిని భారతదేశ ఉపాధ్యాయ వర్గ ఔన్నత్యాన్ని చాటే ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపమనడం అంటే బహుశా టీచర్ల ఆత్మాభిమానాన్ని తరగతి గదుల్లో దేశ భవిష్యత్తు రూపొందించే విద్యాతత్వాలను, టీచర్ల కర్తవ్యాలను నిర్ధేశించుకోవడమే.
అధికారికంగా ప్రతీ ఏటా దేశవ్యాప్తంగా నిర్వహించ బడుతున్న ఉపాధ్యాయ దినోత్సవం కొంతమంది టీచర్లకు ఉత్తములుగా గుర్త్తించమని దరఖాస్తు చేసుకుంటే గుర్తించి శాలువాలు సన్మానాలతో ఆ ఒక్కరోజు గురువే దైవం అన్న గురుబ్రహ్మ, గురువిష్ణు, గురుదేవో భవ అన్న సూక్తులు వల్లించడం మిగతా అధ్యాపక వర్గం, విద్యారంగం సమాజం ఎదుర్కొంటున్న సవాలక్ష సమస్యల్ని శాలువాల మాటున చాటిపెట్టడం నిరంతరం కొనసాగుతున్న ప్రహసనమే.
దీనికి భిన్నంగా మనం కొనసాగుతున్న సమాజం ఎందరో మహనీయుల త్యాగాల పరంపరలో అదొక ప్రజాస్వామిక సమాజంగా రూపాంతరం చెందిందని, ఆ సమాజానికి కొన్ని ప్రజాస్వామిక విలువలు లక్ష్యాలు ఉన్నాయని వాటిని నెరవేర్చే కర్తవ్యం టీచర్లకు, టీచర్లను ప్రేరేపించడానికి అట్లాంటి సమాజం మొత్తం సమాజాన్ని మానవీకరించడానికి, కనీసం ప్రజాస్వామీ కరించడానికి ప్రజలచే ఎన్నుకోబడ్డ పాలకులు నిర్వర్తించవలసిన బాధ్యతలు, విద్యారంగంలో రావాల్సిన మార్పులు భవిష్యత్ తరాలను రూపుదిద్దాల్సిన తరగతి గదుల్లోని చదువుని సంస్కరిం చుకోవాల్సిన సందర్భం టీచర్స్‌డే.
టీచర్లు సమాజానికి ఆదర్శంగా ఉండాలని ఆశించే సమాజం, పాలకులు అట్లాంటి ఆదర్శ సమాజం తమ విధానాల వల్ల ఆ విద్యావిధానం పట్ల వాళ్ళు అనుసరిస్తున్న అశాస్త్రీయ ప్రజాస్వామిక విధానాలే కారణమని గర్వించలేక పోవడం ఇవ్వాళ్టి విశాదం.
ఎందరో మహనీయుల త్యాగఫలం దేశానికే స్వాతం త్య్రం సిద్ధించి డెబ్బైఐదేళ్ళు పూర్తి చేసుకొని ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లు జరుపుకుంటున్న సందర్భంలో రా•స్థాన్‌లోని సరస్వతీ శిశుమందిర్‌లో మంచినీళ్ళు తాగడాని మేఘ్వాల్ అనే చిన్నారిని కుల వివక్షతో రాజపుత్ టీచర్ చేతిలో మృతి చెందడం ఎంతో హృదయ విదారక•మో భారత సమాజం వీక్షించింది. మానవత్వమున్న మనుషులు టీచర్లు కన్నీళ్ళు చెమర్చారు.నిజానికి సర్వేపల్లి కన్నా ముందే ఈ దేశంలో కుల అంధ మూఢ విశ్వాసాల వల్ల ఆడపిల్లలు చదువుకుంటే చెడిపోతారని దళిత బహుజన స్త్రీలకు విద్యను దూరం చేస్తే చదువు చెప్పడానికి ఆడపిల్లలకు బడులు తెరిసిన తొలి భారత మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిభాయి పూలే ఆదర్శాలు ఆచరణీయం అనుసరణీయం. అట్లాంటి సామాజిక దురన్యా యాన్ని ప్రతిఘటించిన జ్యోతిరావు పూలేలు సామాజిక మార్పుకు విద్య ఆయుధంగా మారాలి అన్న ఎందరో మహానుభావులు కలగన్న సమాజం ఇవ్వాళ సంక్షుభిత దిశవైపు పయనిస్తున్నది.
మూఢ అంద విశ్వాసాలకు వ్యతిరేకంగా పోరాడిన నేలమీద కులమత విద్వేషాలతో పిల్లల్ని కొందరు టీచర్లు, టీచర్లను కొందరు నాయకులు, మహిళా టీచర్‌కు బడిలో వాష్‌రూమ్‌కు వెళ్లే స్వేచ్ఛ కూడా లేదని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడి దూషణలకు సంబంధించిన వీడియో వైరల్, ఓ విద్యార్థి తోటి విద్యార్థిని హత్య చేసి జైలు కెళ్ళాలనే చేసానని ప్రకటించడం, గాంధీ సినిమా చూపించడానికి వెళ్ళిన ప్రధానోపాధ్యాయుడు అమ్మాయిలపై అసభ్యంగా ప్రవర్తించడం, హిజాబ్‌లు ధరిస్తే ఊరకోమనే కళాశాలల్లో అమ్మాయిలపై దాడులు, ఆవు మాంసం తిన్నాడని అఖ్లాక్ లాంటి చిన్నారుల్ని హతమార్చడం ఆసిఫా అనే అమ్మాయిపై గుడిలోనే అత్యాచారం చేయడం బిల్కిస్ బానో మీద అత్యాచారం చేసి పసిపాపను చంపిన నేరస్థుల్ని విడుదల చేస్తే పూలదండలు వేస్తూ సన్మానించడం లాంటి విద్వేషకర, విద్రోహకర సంఘటనలకు టీచర్లకు సంబంధం లేకపోయినా పలు సందర్భాల్లో నైతిక విలువలు లేని విద్యావిధానం ఇందుకు కారణంగా గుర్తిస్థూనే అవి పెంపొందించడం కేవలం టీచర్ల బాధ్యతనే అన్నట్లు సమాజం, పాలకులు తమ బాధ్యతల్ని విస్మరిస్తున్నది.
సమాజంలో సాంప్రదాయకంగా ఉన్న కులమత లింగపరమైన అనేక అసమానతలను అదిగమించేందుకే విద్య ఆయుధమవుతుంది… అన్న నోబుల్ గ్రహీత అమర్త్యసేన్ మాటలు తిరగబడుతున్నట్లుంది. ఇవ్వాళ దేశ వ్యాప్తంగా జాతీయ విద్యావిధానంపేర అమలు చేయబోతున్న విద్య అశాస్త్రీయంగా అప్రజాస్వామికంగా కొనసాగుతున్నదని అనేకమంది విద్యావేత్తలు ఆందోళన చెందుతున్న సందర్భం. రాష్ట్రాలు ముఖ్యంగా తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో గంగా జామున తెహజీబ్ లా కలిసిపోయిన భిన్నమతాల, విభిన్న సంస్క•తుల జీవన విధానం భంగం కలుగకుండా చూడవల్సిన కర్తవ్యం టీచర్ల మీద ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నది. ఇవ్వాళ రాజ్యాంగంలో పొందుపరుచుకున్న లక్ష్యాలు నెరవేరాలంటే జాతీయ ఉద్యమ ఘట్టాలు, లక్ష్యాలు, జాతీయ నాయకుల త్యాగాలతో పాటు ప్రజాస్వామ్యం అంటే ప్రజల జీవ విధానానికి సంబంధించిన అంశంగా విడమర్చి చెప్పాల్సిన సందర్భంలో కేవలం ఎన్నికలు, అధికారం అన్న సంక్రమిత అర్థంలోకి కుదించబడింది.
సాంఘీక శాస్త్రంలో అసలు ఆగస్టు 15, జనవరి 26 స్వాతంత్య్ర, గణ తంత్ర దినోత్సవాల ప్రాముఖ్యత కేవలం పరీక్షల్లో సమాధానం రాసే ప్రశ్నలుగా అసలు రాజ్యాంగ లక్ష్యాలను, అంబేద్కర్ జీవిత చరిత్ర విశదపరిచే ప్రజాస్వామిక అంశాలను సిబిఎస్ పాఠశాల్లో నుండి తొలగిస్తున్న సందర్భ భారత రామాయణాలు, భగవద్గీతలు, సంస్క•తం భాష హిందీని కొనసాగించే, జ్యోతిష్యవాస్తు శాస్త్రాలు అమలు చేయ పూనుకోవడం శాస్త్ర సాంకేతిక రంగాల్లో మన విద్యాలయాలు ఎంత వెనుక పట్టుపట్టాయో వ్యక్తుల జీవితాల్లో అవి ఎంతటి వ్యతిరేక ప్రభావాన్ని చూపుతున్నాయో గమనిస్తున్నాం.
మదనపల్లిలో ఫిజిక్స్ డాక్టరేట్‌లు చేసిన భార్యాభర్తలు కన్నబిడ్డల్ని మూఢ విశ్వాసాలకు కొట్టి చంపే అధోగతికి మన అజ్ఞాననం పెరుగుతున్నది. ఈ విషయాలు విప్పి చెప్పడానికి పాఠ్యాంశాల్లో శాస్త్రీయ పరిశోధనల్లో చోటు కల్పించాల్సిన ప్రభుత్వం ఆ ప్రయత్నం చేయకుండా అందుకోసం కృషి చేస్తున్నదబోల్కర్ ,కుల్బర్గీ గౌరి లంకేష్ లాంటి వాళ్ళను కాపడలేక పోవడం ఇవ్వాళ్టి సమాజానికి గొడ్డలిపెట్టు లాంటిది.
పర్యావరణ విధ్వంసానికి రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతల తగ్గింపుకోసం ఆయా దేశాల పాలకులు చర్యలు తీసుకోకపోతే భూగోళం గ్లోబర్‌వార్మింగ్‌తో విపరీత పరిణామాలు చోటు చేసుకుంటాయన్న ప్యారిస్ హెచ్చరికను, స్వీడన్ అమ్మాయి గ్రేట్ థన్ భర్గ్ ఆవేదనతో ఆవేశంతో భవిష్యత్తరాలను నాశనం చేసే హక్కు మీకెవరిచ్చారన్న ఆక్రందన మన తరగతి గదుల్ని తాకలేకపోతున్నది. పర్యావరణ అంశం ఐదు మాధ్యమాల ప్రశ్నగా మొక్కలు నాటి కార్యక్రమంగా కొనసాగుతున్నది.
అశాస్త్రీయ అప్రజాస్వామిక విలువల్ని పెంచే పద్దతుల్లో తరగతి గదుల్లో పాఠ్యశాల బోధన కొనసాగడం, పుస్తకాల్లో మూస పద్దతుల్లో సిలబస్ రూపొందించడం, క్రమశిక్షణ అంటే పిల్లలు నిశ్శబ్ధంగా పాఠం వినడం, ప్రశ్న అడిగినా ఏదైనా అన్యాయాన్ని నిలదీసినా నోరు మూయించే స్థితి తగతి నుండే ప్రారంభమవుతున్నది. పిల్లల్ని ప్రశ్నలు అడగనివ్వని అడిగిన ప్రశ్నలకు జవాబు ఇవ్వలేని పుస్తకం చదవడం నిరంతర అధ్యయనం లేని కొందరి టీచర్ల వల్ల పిల్లల భవిష్యత్తు తరగతి గదిలోనే ధ్వంసం చేయబడుతుంది.స్త్రీ పురుష సమానత్వాన్ని పరమత సహనాన్ని స్వేచ్ఛ సమానత్వం సాభ్రాతృత్వం విలువలు పెంపొందించాఏ ప్రక్రియ కేవలం రోజూ పాఠశాల ప్రారంభంలో చదివే ప్రతిజ్ఞలా మారిపోయింది.
ప్రతిజ్ఞలో మహానుభావుడు పైడి మర్రి ఆశించిన భారతీయులందరూ నా సహాదరులు, నేను దేశాన్ని ప్రేమిస్తున్నాను, దేశాన్ని ప్రేమించడమంటే భారత భూభాగాన్ని కాదు ప్రజల్ని ప్రేమించడం దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్ అన్న గురజాడ స్పూర్తిని రగిలించాల్సిన తరగతి గదులు కులమతాల స్త్రీ, పురుష ద్వేషం, అసమానతలు, ఆకలి దాహం తీరని పేద పిల్లలకో బడి, పెద్ద సంపన్నులకో బడి కొనసాగడం వల్ల సమాజంలో విద్వేశాలు కొనసాగుతున్నవి.
రాజ్యాంగ లక్ష్యాల్లో ఆర్టికల్ 45లో పొందు పరుచుకున్న అందరికీ ఉచిత సార్వత్రిక విద్య ఇవ్శాళ మరో రూపంలో ప్రైవేట్, కార్పొరేట్ సంపన్న, పేద వర్గాల వర్గీకరణగా కొనసాగుతున్నప్పుడు, టీచర్లు కూడా సమాజం నుండి అనేక ప్రశ్నల్ని ఎదుర్కోవలసి వస్తున్నది.
అందులో భాగంగానే మీ పిల్లలకు ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం మా పిల్లలకు ప్రభుత్వ తెలుగు మీడియం బడులా అనే వివక్షకు సమాధానం చెప్పాల్సిన పాలక వర్గాలు టీచర్లను దోషులుగా నిలబెడుతున్నది.డాక్టర్ డియస్ కొఠారి కోరినట్లు పేదోనికైనా పెద్దోనికైనా ఒకే బడి ఒకే చదువు అదే కామన్‌స్కూల్ విధానం అమలు చేయాలని అప్పుడు టీచర్లు నాయకులు అధికారుల పిల్లలంతా నైబర్‌హుడ్ పాఠశాలల్లో చేర్చడం వల్ల పాఠశాల స్థాయి నుండే ధనిక, పేద, కుల మత వర్గ విభజన లేని చదువును కొనసాగించవచ్చు. అందుకుఉపాధ్యాయ లోకం ఉద్యమించవలసియున్నది.అట్లాంటి పాఠ శాలల్ని నెలకొల్పాల్సిన పాలకులు భిన్న యాజమాన్యాల్లో రెసిడెన్షియల్, పబ్లిక్ కార్పొరేట్ ఒలంపియాడ్, ఐఐటి జెఈఈ లాంటి స్కూళ్ళు కాలేజీలు తెరుస్తూ విద్యను అమ్మకం సరుకుగా మార్చి విద్యార్థుల్లో విలువలు క్షీణిస్తున్నాయని అందుకు టీచర్లు విద్యా బుద్దులు చెప్పడం లేదని బదనాం చేయడం చూస్తున్నాం.అట్లాంటి విలువలు విద్యారంగంలో సమాజంలో కొనసాగాలంటే అబ్రహం లింకన్ తన కొడుకులో పెంపొం దించాల్సిన విలువల గురించి టీచర్లకు ఉత్తరం రాస్తూ. మోసం చేయడం కంటే విఫలమవడం లోనే గౌరవముందని మీ బడిలో నేర్పండి. ఉన్నతమైన వ్యక్తులతో ఉన్నతంగా ఉండాలని, మెల గాలని, దుండగులతో కఠినంగా వ్యవహరించాలని తెలియజే యండి. దొరికే ఐదు డాలర్లకంటే సంపాదించిన ఒక్క డాలర్ విలువైనదని తెలియజెప్పండి. అసూయకు దూరంగా ఉండడం, నిశ్శబ్ధంగా సంతోషించడం నేర్పించండి. స్వార్థపర రాజకీయ నాయకులతో పాటు ధీరోదాత్తులైన వారు కూడా ఉన్నారని నేర్పండి. కన్నీళ్ళు పెట్టుకోడానికి సిగ్గుపడనక్కరలేదని, మాన వత్వం మీద విశ్వాసాన్ని కోల్పోకుండా విశ్వాసం కలిగి ఉండాలని బోధించండి.
ఆ విలువలు పెంపుదల కోసం మన విద్యావిధానం బోధన సమాజం ఎదగవలసియున్నది. అందుకు టీచర్లుగా పోరాడదలచిన సందర్భం కేవలం పుస్తకాల్లో ఉన్నది చెప్పడం పిల్లలు బట్టీయంతో చదివి రాసింది మార్కులు వేసి గ్రేడులు వేయడం చదువు కాదని గుర్తించవలసియున్నది.
అందుకోసం తరగతి గదుల్ని పిల్లలు ఆనందంగా తమ అంతర్గత నిబడీకృతశక్తుల్ని వెలికి తీయడానికి సిద్ధం చేయవలసి వున్నది. పుస్తకాలు చదవడం పిల్లలకంటే ముందు టీచర్లు కొనసాగించడం పుస్తక పఠనం పెంపొందించడం విద్యార్థులెదుర్కొంటున్న ఆర్థిక సామాజిక సాంస్క•తిక సమస్యల్ని సహృదయంతో అర్థం చేసుకోవడం పాఠశాల స్థాయిలో కొడితే వాతలు పెడితే చదువులొస్తాయనుకోవడం మూర్ఖత్వం గిజుభాయి మాటల్ని గుర్తిస్తూ విద్య ఒక వ్యక్తి జీవితంలోనూ సమాజ జీవితంలోనూ అభివృద్ధికి దోహదం చేస్తుందన్న సర్వేపల్లి రాధాకృష్ణ 86 ఏళ్ళ ఆచరణలో చూపి ఏప్రిల్ 17, 1975లో చనిపోయే వరకు కొనసాగించిన స్పూర్తిని టీచర్లందరూ ప్రజాస్వామిక విలువల సాధనకు భవిష్యత్ తరాల కోసం ఉత్తమ టీచర్లుగా నిరంతరం కృషి చేయాలి..!.
– ప్రభాకర్ కస్తూరి, రచయిత, కన్వీనర్ తెలంగాణ టీచర్స్ ఫోరం, 9440970454




