సోషల్ విూడియాలో బాధ్యతగా వ్యవహరించాలి
బిఆర్‌ఎస్ సోషల్ విూడియా పోస్టులపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అభ్యంతరం
కరీంనగర్, ప్రజాతంత్ర, జనవరి 24 : ప్రజలను కించపరిచేలా మాట్లాడొద్దని బీఆర్‌ఎస్ సోషల్ విూడియా వారియర్స్‌కు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ప్రజలను తప్పుపట్టేలా పోస్టులు పెట్టవద్దన్నారు. ప్రజలు ఎప్పుడూ తప్పు చేయరని అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్ సోషల్ విూడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..2001 ఏప్రిల్ 27 నాడు జలదృశ్యంలో పార్టీ పుట్టిన నాడు మొదటి సమావేశం జరిగి ఆనాడు ఉద్యమానికి ఊపిరిలూదింది..ఊపిరిపోసింది కరీంనగర్ గడ్డ అన్నారు. ఎస్సారార్ కాలేజీలో ఆ నాడు 2లక్షల పైచీలుకు తెలంగాణ ప్రజలు కదిలివచ్చి.. తెలంగాణ ఉద్యమం సజీవంగా ఉంది.. తెలంగాణ నినాదం సజీవంగా.. తెలంగాణ రావాలన్న కోరిక బలంగా ఉందని దేశం మొత్తానికి చాటిచెప్పిన సందర్భం సింహగర్జన అని అన్నారు.
2001లో ఉద్యమానికి ఊపిరిపోసినా.. 2006లో మళ్లీ పునర్జన్మనిచ్చినా ఇదే కరీంనగర్ గడ్డపై ఆ నాడు 2 లక్షల వోట్ల మెజారిటీతో కేసీఆర్‌ను ఉప ఎన్నికల్లో గెలిపించిందని, మళ్లీ దేశానికి బలంగా తెలంగాణ కావాలని చెప్పిందని, అది కరీంనగర్ గడ్డ గొప్పతనమేనన్నారు. 2009లో ఆశలు లేవు.. అయిపోయింది టీఆర్‌ఎస్ పరిస్థితి.. 45 సీట్లలో పోటీ చేస్తే పది సీట్లే గెలిచింది.. అయిపోయింది కేసీఆర్, టీఆర్‌ఎస్ పని.. తెలంగాణ రాష్ట్రం ఇక రాదు అనే పరిస్థితుల్లో మరోసారి అక్కున చేర్చుకొని గుండెల్లో పెట్టుకొని 2009 నవంబర్ 29న అల్గునూర్‌లో అగ్గి అంటించింది ఇదే కరీంనగర్ గడ్డ అనేమాట అందరికీ గుర్తు చేస్తున్నానన్నారు.
కరీంనగర్ నిరాహార దీక్షలో అల్గునూర్‌లో ఆయన అరెస్టు కాగానే తెలంగాణ అంతా అగ్గి అంటుకున్న విషయం అందరికీ తెలుసునని తెలిపారు. మొన్న జరిగిన ఎన్నికల్లో డిసెంబర్ 3న వొచ్చిన ఫలితం.. హతాశయులయ్యే పరిస్థితి కాదని, ఇంట్లో దుప్పటి కప్పుకొని పడుకునేంత బాధాకరమైన ఫలితం కాదని కేటీఆర్ స్పష్టం చేశారు. సోషల్ విూడియా భావోద్వేగంతో ఉంటరని, ఉద్యమ పార్టీగా..ఉద్యమంలో మొదటి నుంచి ఉన్న తమ్ముళ్లు.. తర్వాత వొచ్చిన తమ్ముళ్లకు తెలంగాణతో, కేసీఆర్, పార్టీతో భావోద్వేగపూరిత అనుబంధం ఉంటుందన్నారు. ప్రజలను మోసం చేసిన నాయకులను చూశాం కానీ.. నాయకులను మోసం చేసిన ప్రజలను చూడలేదని కొందరు పోస్టులు పెట్టారని, తాను వారిని చేతులెత్తి వేడుకుంటున్నానని, ఇలాంటి భావోద్వేగపూరిత మాటలు ప్రజలను కించపరిచేలా మాట్లాడడం సరికాదని ఆయన ఈ సందర్భంగా సూచించారు. ఎందుకంటే అదే ప్రజలు మనకు అండగా నిలబడ్డరని అన్నారు. అదే ప్రజలు తెలంగాణ ఉద్యమంలో ఏం లేని నాడు.. 2001లో కేసీఆర్ బయలుదేరిన నాడు.. మజిల్ పవర్ లేదు.. మనీ పవర్ లేదు. విూడియా పవర్ లేదు. ప్రత్యర్థులకు కొదవ లేదు.
ఏం లేనినాడు కూడా కేసీఆర్‌ను ఎత్తిన పెట్టుకున్నది.. గుండెల్లో పెట్టుకున్నది అదే ప్రజలు.. నడిపించింది అదే ప్రజలని మరిచిపోవద్దు. ఒక్కసారి 1.85శాతం తేడాతో మనపై చిన్నపాలి అలక చూపెడితే దానికి ప్రజలను నిందించడం సోషల్ విూడియాలో మంచిది కాదు. ఇలాంటి పనులు చేయొద్దు’ అంటూ సూచించారు. తెలంగాణ ప్రజల మనసు మళ్లీ తిరిగి ఎట్ల గెలుచుకుందాం.. లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ ఎట్లా జెండా పాతుదాం.. మళ్లీ ఎట్ల గులాబీ జెండా ఎగురవేద్దామనే దిశగా ఆలోచిద్దాం పొరపాటున కూడా ప్రజలను నిందించే విధంగా, ప్రజల తీర్పును అవమానించేలా మాట్లాడొద్దు. గెలుపుతోని పొంగిపోవద్దు.. ఓడిపోతే కుంగిపోవద్దని మన నాయకుడు కేసీఆర్ చెబుతారు. ఉద్యమం ప్రారంభమైన కొత్తలో రసమయి బాలకిషన్, గోరెటి వెంకన్న, వరంగల్ శీనులాంటి వారితో కూర్చొని పాటలు రాసేది. కేసీఆర్ ఆ నాడే పిడికిలి బిగించి.. కవులు, కళాకారులతో పాటలు రాయించి.. స్వయంగా కూర్చోని ఈ పాటలకు మెరుగులుదిద్దిన పరిస్థితి’ అని కేటీఆర్ గుర్తు చేశారు.





