వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, నవంబర్ 20: పోస్టల్ బ్యాలెట్ పంపిణీ పక్కాగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు జిల్లా ఎన్నికల అధికారి సి. నారాయణరెడ్డి అన్నారు.సోమవారం తాండూరు రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో చేపట్టిన పోస్టల్ బ్యాలెట్ పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి, ఈ జిల్లాకు చెందిన, ఇతర జిల్లాలో పనిచేస్తున్న సిబ్బందికి, అత్యవసర సేవలు అందించే శాఖల సిబ్బందికి, అలాగే 80 సంవత్సరాలు దాటిన వయోవృత్తులకు మరియు 40 శాతం కన్నా ఎక్కువ అంగవైకల్యం ఉన్న దివ్యాంగులకు హోమ్ ఓటింగ్ కొరకు ఫామ్ 12, ఫామ్ 12 డి ద్వారా పోస్టల్ బ్యాలెట్ పంపిణీకి చేపట్టిన పనులను పరిశీలించారు. ఈనెల 21 నుండి 24 వరకు పోస్టల్ బ్యాలెట్ ల పంపిణీ పూర్తి కావాలని సిబ్బందికి సూచించారు. దాదాపు 7వేల పైచిలుకు పోస్టల్ బ్యాలెట్ లను అందించడం జరుగుతుందన్నారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, తాండూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించడం జరిగిందని అన్నారు. ఎన్నికలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని, ఈనెల 30న నిర్వహించు పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మొత్తం 1133 కేంద్రాలలో నిర్వహించడం జరుగుతుందన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో అవసరమైన సదుపాయాలన్నీ కల్పించడం జరిగిందని, ఓటర్లందరికి ఇప్పటి వరకు 50 శాతం ఓటర్ స్లిప్పులు అందించడం జరిగిందన్నారు. మిగిలిన స్లిప్పులన్నీ మూడు రోజులలో అందించడం జరుగుతుందని సూచించారు. దీనితో పాటు సి- విజిల్ కు సంబంధించిన పాంప్లెట్లు, ఓటర్ గైడ్లైన్స్ కూడా అందించడం జరుగుతుందన్నారు. ఎన్నికలలో ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎలాంటి ప్రలోభాలకు లొంగకూడదని సూచించారు. ఈరోజు నుండి ఎన్నికల సిబ్బందికి రెండో విడత శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎన్నికల నిబంధనల మేరకు పనులు చేపట్టడం జరుగుతుందని, ఇంతలో భాగంగా పొలిటికల్ పార్టీలు, పోటీలో ఉన్న అభ్యర్థులు సహకరించడం జరుగుతుందని తెలిపారు. నిబంధనల మేరకు ప్రచార కార్యక్రమాలను 24 గంటల ముందు ముగుస్తుందని, అందరి సహకారంతో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. సి – విజిల్ ద్వారా వచ్చే ఫిర్యాదులను 100 నిమిషాలలో పరిష్కరించడం జరుగుతుందని, పోటీలో ఉన్న అభ్యర్థులు చేస్తున్న ఖర్చులపై నిఘా ఉంచడం జరిగిందని సూచించారు . ఈ కార్యక్రమంలో వ్యయ పరిశీలకులు రత్నాకర్ కాలు, తాండూర్ రిటర్నింగ్ అధికారి శ్రీనివాసరావు, పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి అనిల్ కుమార్, తహసీల్దార్ వెంకటస్వామి, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పోస్టల్ బ్యాలెట్ పక్కగా నిర్వహించాలి పోస్టల్ బ్యాలెట్ పక్కగా నిర్వహించాలి





