పోలీసు వాహనాల్లో ఎన్నికల డబ్బుల పంపిణీ ప్రకంపనలు!

 మొత్తంగా టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ(ఓఎస్డీ) రాధాకిషన్‌రావు దర్యాప్తులో చెబుతున్న విషయాలు విస్తు గొలిపేవిగా ఉన్నాయి. తెలంగాణలో ఎన్నికల సందర్భంగా వారు ఏం చేశారో కూడా విచారణ సందర్భంగా నిందితులైన అధికారులు చెప్పుకొచ్చారు. ప్రత్యర్థి రాజకీయ పార్టీలు నగదు తరలించకుండా కట్టడి చేయడంతోపాటు అధికార పార్టీకి చెందిన నగదును పోలీసు వాహనాల్లో తరలించామని చెప్పారు.

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఫోన్‌ ట్యాపింగ్‌ లాగితే అనేక విషయాలు బయట పడుతున్నాయి. ఇందులో టాస్ట్‌ఫోర్స్‌ పోలీసుల ఆధ్వర్యలంలో ఎన్నికల్లో డబ్బుల పంపిణీ జరిగినట్లు తాజాగా గుర్తించారు.ఎన్నికల్లో గెలవడానికి, విపక్షాలను నిలువరించడానికి ఎంతగా అధికార దుర్వినియోగం జరిగిందో గమనించవొచ్చు. నిజంగా ఇంత దారుణం జరగడం క్షమించరాని నేరంగా పరిగణించాలి. ఎన్నిక ల్లో గెలవడం కోసం పోలీసులను ఉపయోగించుకుని బయటపడుతన్నామన్న ధీమాతో ఉన్నప్పటికీ ప్రజలు ఇచ్చిన తీర్పు తో  కెసిఆర్‌ మైండ్‌ బ్లాక్‌ అయ్యింది. ఎపిలోనూ ఇంతకాలం ఇదే తరహాలో వ్యవహారం నడిచిందని తెలుస్తోంది. అక్కడా ప్రభుత్వం మారితేనే అసలురంగు బయటపడుతుంది. గతంలో వైఎస్‌ హయాంలో 108 వాహనాల్లో డబ్బుల సరఫరా జరిగిందన్న ఆరోపణలు వొచ్చాయి. ఇప్పుడేమో పోలీసుల సమక్షంలోనే ఇలా డబ్బుల చేరవేత జరిగిందన్న ఆరోపణలు రావడం దుర్మార్గమైన కిరాతక చర్యగా చూడాలి. ప్రజలకోసం అని బయలుదేరి రైతులను పరామర్శించేందుకు వెళ్లిన కెసిఆర్‌ హుంకరింపులు చూస్తే సాధారణ తెలంగాణ వాసులు గుండెలు మండుతున్నాయి. ఆయనలో ఉన్న అసహనం బయట పడుతుంది.

ఇన్ని అవకతవకలు బయటపడుతున్నా ఒక్కమాట కూడా మాట్లాడకుండా, ప్రభుత్వంపై నిందలు వేసే ప్రయత్నం చేయడం..దొంగేదొంగ అన్నట్లుగా ఉంది. ఇంతకాలం కెటిఆర్‌, హరీష్‌ రావు, కవితలు మాత్రమే ఇలా అసహనం వ్యక్తం చేశారు. ఇప్పుడు కెసిఆర్‌ కూడా తన అక్కసును వెళ్లగక్కు తున్నారని అర్థం అయ్యింది. అధికారం పోవడంతో కెసిఆర్‌ రంకెలు వేస్తున్నారు. కెసిఆర్‌ హయాంలో సిట్‌  అధికారులు ఎంత అరాచకంగా వ్యవహరించారో ఇప్పుడు తెలంగాణ పోలీసుల విచారణలో బయట పడుతుంటే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. కొంతమంది అధికారులు ఉన్నతస్థాయి ఆదేశాల మేరకు తాము పోలీస్‌ అధికారులం అన్న విషయం విస్మరించి, బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలకంటే అధ్వానంగా డబ్బులను కూడా పంచారన్న విషయం చూస్తుంటే ఎంతగా బరితెగించారో అర్థం చేసుకోవొచ్చు. విచారణ సమయంలో ఇప్పుడు అదుపులోకి తీసుకున్న పోలీసు అధికారుల్లో అత్యధికులు కెసిఆర్‌ సామాజిక వర్గానికి చెందినవారు కావడం కూడా ఎంతకు తెగించారన్న విషయం మరింత ఆగ్రహం కలిగిస్తోంది. అంటే కులరక్కసి ఎంతగా పనిచేసిందో అర్థం చేసుకోవొచ్చు. ఒకే సామాజిక వర్గానికి చెందిన కొందరు పోలీసు అధికారులు విచ్చలవిడితనంతో తెలంగాణను గుప్పిట పెట్టుకుని అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించారన్నది ప్రజలకు తెలిసి వస్తోంది.

ఇప్పుడు పలువురుని ప్రశ్నిస్తే మా ఫోన్లు కూడా ట్యాపింగ్‌లో ఉన్నాయిని చెబుతున్నారు. ఏకంగా ఓ బిల్డర్‌ పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. తన ఫోన్‌ ట్యాపింగ్‌ చేసి తనను బెదరించి కోట్లు కొల్లగొట్టారని ఆరోపించాడు. ఇప్పుడా విషయంలోనూ విచారణ సాగుతోంది. కెసిఆర్‌ ప్రభుత్వం గద్దె దిగాక …స్వేచ్ఛ వొచ్చింది.. ఫోన్లు మాట్లాడే స్వేచ్ఛను పొందామని ప్రొఫెసర్‌ కోదండరామ్‌ చెప్పడం చూస్తే వీటి ఆగడాలు ఎంతగా మితివిూరి పోయాయో గమనించవచ్చు. ఎపిలోనూ ఇలాంటి తతంగమే జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. టిడిపి ఈ విషయంలో ఆరోపణలు చేస్తూనే ఉంది. అంటే తెలుగు రాష్టాల్ల్రో ఫోన్‌ ట్యాపింగ్‌ అన్నది ఒకే తరహాలో సాగిందని అర్థం చేసుకోవొచ్చు. ఇరువురు ప్రభుత్వాధినేతలు కూడ బలుక్కుని చేశారని అనిపిస్తోంది. ఇకపోతే తమ ఫోన్లు ట్యాపింగ్‌ అవుతున్నాయి, దీంతో తమ కార్యకర్తలను అరెస్ట్‌ చేస్తున్నారని పిసిసి చీఫ్‌గా  ఉన్న సమయంలో రేవంత్‌ తీవ్ర ఆరోపణలు  చేశారు. నాటి ఇంటిలిజెన్స్‌ చీఫ్‌ ప్రభాకర్‌ రావు పేరు చెప్పి గట్టి హెచ్చరికుల చేశారు. ఈ క్రమంలో ఆనాటి ప్రభుత్వంలో స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌ కేంద్రంగా  సాగిన ఫోన్‌ట్యాపింగ్‌ వ్యవహారంలో కీలక పాత్రధారిగా భావిస్తున్న టి.ప్రభాకర్‌రావు పోలీసుల ఎదుట  లొంగి పోనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు అరెస్టయిన పోలీసు అధికారులు.. దర్యాప్తులో ప్రభాకర్‌రావు చెప్పినట్లు చేశాం అంటూ వాంగ్మూలం ఇవ్వడంతో అన్ని వేళ్లు ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ వైపే చూపుతున్నాయి.  దాంతో ప్రభాకర్‌రావు అమెరికా నుంచి తిరుగు ప్రయాణ మయ్యారనే సంకేతాలు వొస్తున్నాయి. గత ప్రభుత్వం చెప్పింది మేం చేశాం.

ప్రభాకర్‌ రావు ఇప్పటికే ఓ పోలీస్‌ అధికారితో వ్యాఖ్యానించారనే విషయం తెలిసిందే..!
మొత్తంగా టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ(ఓఎస్డీ) రాధాకిషన్‌రావు దర్యాప్తులో చెబుతున్న విషయాలు విస్తు గొలిపేవిగా ఉన్నాయి. తెలంగాణలో ఎన్నికల సందర్భంగా వారు ఏం చేశారో కూడా విచారణ సందర్భంగా నిందితులైన అధికారులు చెప్పుకొచ్చారు. ప్రత్యర్థి రాజకీయ పార్టీలు నగదు తరలించకుండా కట్టడి చేయడంతోపాటు అధికార పార్టీకి చెందిన నగదును పోలీసు వాహనాల్లో తరలించామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా కొందరు అధికారులు తమ పరిమితిని అతిక్రమించి వ్యవహరిస్తున్నట్టు వార్తలు వొస్తున్నాయి. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నిందితులపై టెలిగ్రాఫ్‌ చట్టం ప్రయోగించాలని తెలంగాణ పోలీసులు నిర్ణయించుకొని న్యాయస్థానం అనుమతి కోరారు.

న్యాయస్థానం అనుమతిస్తే నిందితులపైన టెలిగ్రాఫ్‌ చట్టం కింద కేసు పెడతారు. అప్పుడు విచారణలో నేరం రుజువైతే ఉద్యోగాలు పోవడమే కాకుండా జైలుకు వెళ్లాల్సి వొస్తుంది. మొత్తంగా కేసీఆర్‌ ప్రభుత్వం ఎంత అడ్డగోలుగా వ్యవహరించిందో తెలిపే సంఘటనలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. వీటన్నిటి పైనా విచారణ చేయించి కఠినంగ ఆశిక్షిస్తే తప్ప అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ నేతలు చేసిన ఆగడాలకు అడ్డుకట్టవేయలేం. ఇలాంటి నేతలను గుర్తించి ప్రజలు వారిని దూరం పెట్టాలి. ఇలాంటి వారిని ఆదరిస్తే నష్టపోయేది ప్రజలే అని తెలుసుకోవాలి.

`ప్రజాతంత్ర డెస్క్‌ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *