పోలింగ్‌కు సర్వం సిద్ధం. నరాలు తెగే ఉత్కంఠతో అభ్యర్థులు

కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు
35,655 పోలింగ్‌ కేంద్రాలు, 59,779 ఈవీఎంలు…
119 నియోజకవర్గాలకు బరిలో 2,290 మంది అభ్యర్ధులు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 29 :  అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. రంగంలో ఉన్న అభ్యర్ధులు ‘‘అన్ని పనులు’’ పూర్తి చేసుకుని తెల్లవారితే ఈవిఎంలలో తమ అదృష్టం ఎలా రికార్డవుతుందోనని సందిగ్ధంతో కొట్టుమిట్టాడుతున్నారు. మూడో తేదీ ఫలితంపై నరాలు తెగే ఉత్కంఠతో ఉన్నారు. ప్రచారం ముగిసి 24 గంటలైనా అనేకచోట్ల వాహనాల తనిఖీలలో నగదు, మద్యం, ఆభరణాలు భారీగా పట్టుబడుతున్నాయి. ఈ అక్రమ రవాణాలో కొందరు పోలీసులు, ఇతర ప్రభుత్వ సిబ్బంది కీలక పాత్ర నిర్వహిస్తున్నారన్న తీవ్ర ఆరోపణలున్నాయి. ఎన్నికల సిబ్బంది సాయంత్రానికల్లా కట్టు దిట్టమైన బందోబస్త్‌ మధ్య తమకు కేటాయించిన పోలింగ్‌ స్టేషన్లకు ఎన్నికల సామగ్రితో చేరుకున్నారు. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది.  ఎన్నికల సందర్భంగా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా  కేంద్ర బలగాలు కూడా రంగంలోకి దిగి ఎన్నికల సరళిని పర్యవేక్షిస్తున్నాయి. తెలంగాణలో జరగనున్న ఎన్నికలకు లక్ష మంది పోలీసులు ఎన్నికల విధుల్లో ఉన్నారు. రాష్ట్ర పోలీసులు మాత్రమే కాకుండా కేంద్ర బలగాలు కూడా రంగంలోకి దిగాయి. మావోయిస్ట్‌ ప్రభావిత ప్రాంతాలలో, సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలలో అదనపు బలగాలను మొహరించిన. ఎన్నికల విధుల్లో 375 కంపెనీల కేంద్ర బలగాలు ఉన్నాయి. 4400 సమస్యాత్మక ప్రాంతాలకు అదనంగా సిబ్బందిని కేటాయించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఎన్నికల విధుల్లో అస్సాం రైఫిల్స్‌, సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌, బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌, సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌, ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌, నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్స్‌ ఉన్నారు. పోలీస్‌ గస్తీ దళాలు, ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌లు విధులలో దిగాయి. కీలక ప్రాంతాలలో బలగాలు ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించాయి. 12 వేల సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో పటిష్టమైన భద్రత కల్పించారు. రాష్ట్రంలో ఎన్నికల విధులలో 65 వేలమంది తెలంగాణ పోలీసులు ఉన్నారు. 18 వేల మంది హోం గార్డులు కూడా పనిచేస్తున్నారు. ఎన్నికల బహిష్కరణకు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో అవాంచిత సంఘటనలు జరగకుండా భద్రతను మరింత జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నారు. చత్తీస్‌ గడ్‌ తరహాలో మావోలు రాజకీయ నేతలు, పోలీసులు టార్గెట్‌గా భారీ స్కెచ్‌ వేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో మావోయిస్టుల కోసం పోలీసులు అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. దీంతో ఏజెన్సీ ప్రాంతాలు భయం గుప్పిట్లో ఉన్నాయి. పోలింగ్‌ ముగిసేవరకు రాష్ట్రంలో 144 సెక్షన్‌ అమలులో ఉంది.
image.png
35,655 పోలింగ్‌ కేంద్రాలు, 59,779 ఈవీఎంలు…119 నియోజకవర్గాలకు బరిలో 2,290 మంది అభ్యర్ధులు
తెలంగాణలో మొత్తం 35 వేల 655 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 59 వేల 779 ఈవీఎంలను వినియోగించనున్నారు.  రాష్ట్రం మొత్తం దివ్యాంగుల కోసం 21,686 వీల్‌ చైర్లు సిద్ధం చేసారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. సమస్యాత్మక 13 నియోజక వర్గాల్లో ఉదయం 7 నుంచి 4 వరకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. డిసెంబర్‌ 3న కౌంటింగ్‌ జరుగనుంది. తెలంగాణ వ్యాప్తంగా 49 కౌంటింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసింది. 2.5 లక్షల మంది. పోలింగ్‌ విధులు నిర్వహిస్తున్నారు. అదనంగా 22వేల మంది మైక్రో అబ్జర్వర్లు పని చేస్తారు. ఎన్నికల బందోబస్తు కోసం 80 ఏళ్లు పైబడిన వారికి ఉచిత రవాణా సదుపాయం ఏర్పాట్లు చేసారు.
మొత్తం 119 నియోజకవర్గాలకు 2,290 మంది అభ్యర్ధులు బరిలో ఉండగా వారిలో 221 మహిళా అభ్యర్ధులు ఉన్నారు. అత్యధికంగా ఎల్‌ బీ నగర్‌ నియోజకవర్గంలో 48 మంది,  అత్యల్పంగా నారాయణపేట, బాన్సువాడలో ఏడుగురు చొప్పున పోటీ చేస్తున్నారు. ముఖ్యమంత్రి కె సి ఆర్‌ పోటీలో ఉన్న గజ్వేల్‌ లో 44 మంది. కామారెడ్డి బరిలో 39 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. సిద్ధిపేటలో 21, సిరిసిల్లలో 21, కొడంగల్‌ లో 13 మంది అభ్యర్థుల చొప్పున పోటీ చేస్తున్నారు. తెలంగాణలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,26,02,799 కాగా అందులో పురుషులు 1,62,98,418 మంది, మహిళలు 1,63,01,705 మంది, ట్రాన్స్‌ జెండర్ల సంఖ్య 2,676. ఇక సర్వీసు ఓటర్లు 15,406, ప్రవాస ఓటర్లు 2,944గా నమోదై ఉన్నారు. 9.9 లక్షల మంది మొదటి సారి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా సుమారు 1.5 లక్షల మంది ఓటు వేసినట్లు సమచారం.
పోలింగ్‌ రోజున నిర్బంధ సెలవు
పోలింగ్‌ రోజున అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలకు సెలవు ఇవ్వాలని ఈసీ ఆదేశాలు ఇచ్చింది. విద్యాసంస్థలకు సైతం సెలవులు ఇవ్వాలని తెలిపింది. పోలింగ్‌ రోజున రాష్ట్రంలోని ప్రైవేటు సంస్థలు, ఐటీ కంపెనీలు విధిగా సెలవు ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌ రాజ్‌ మంగళవారం ఆదేశించారు. ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా సంస్థలు సెలవు ప్రకటించాలన్నారు. ప్రైవేట్‌ సంస్థలు ఉద్యోగులు సెలవు ఇచ్చాయో, లేదో పరిశీలించాలని, సెలవు ఇవ్వని సంస్థలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖను సీఈవో వికాస్‌ రాజ్‌ ఆదేశించారు.  విద్యా శాఖకు రెండురోజుల సెలవుతో పటు విధులకు హాజరైన సిబ్బందికి డిసెంబర్‌ 1 కాజువల్‌ లీవ్‌ గా సిఇఓ ప్రకటించారు. ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో రాష్ట్రంలో నేడు గురువారం సాయంత్రం 5 గంటల వరకు 144 సెక్షన్‌ అమలులో ఉంటుంది. సైలెన్స్‌ పీరియడ్‌లో సభలు, సమావేశాలపై నిషేధం విధించారు. డబ్బు, మధ్యం పంపిణీపై ఎన్నికల సంఘం ప్రత్యేక ఫోకస్‌ పెట్టింది. ఎన్నికల ప్రక్రియను కంట్రోల్‌ రూం ద్వారా పర్యవేక్షిస్తున్నారు. కాగా, పోల్‌ మేనేజ్‌ మెంట్‌పై రాజకీయ పార్టీలు దృష్టి పెట్టాయి. ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో రాష్ట్రంలో నేడు గురువారం సాయంత్రం 5 గంటల వరకు 144 సెక్షన్‌ అమలులో ఉంటుంది. సైలెన్స్‌ పీరియడ్‌లో సభలు, సమావేశాలపై నిషేధం విధించారు.
క్రిమినల్‌ కేసులున్న అభ్యర్ద్గులు
మూడు ప్రధాన పార్టీల మధ్యే పోరు ఉండగా, కొన్ని చోట్ల ద్విముఖ పోటీ, మరికొన్ని చోట్ల త్రిముఖ పోటీ, అతికొద్ది నియోజకవర్గాల్లో చతుర్ముఖ పోరు నెలకొంది. మొత్తం  2,290 మంది రంగలో ఉండగా వీరిలో క్రిమినల్‌ కేసులు 521 (23 శాతం)మందిపై నమొదయి ఉన్నాయి. తీవ్ర క్రిమినల్‌ కేసులున్న వారు 353 (15శాతం) బరిలో ఉన్నారు. ఇందులో బీఆర్‌ఎస్‌ నుంచి 57, కాంగ్రెస్‌ నుంచి 85, బీఎస్పీ నుంచి 40, బీజేపీ నుంచి 79 మందితోపాటు 138 మంది స్వతంత్రులపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. అదే విధంగా ఎంఐఎంకు చెందిన ఐదుగురు, అలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌కు చెందిన పది మంది, సీపీఎంకు చెందిన 12 మందిపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. నామినేషన్ల ప్రక్రియ నుంచి పోలింగ్‌, ఓట్ల లెకింపు వరకు అన్ని ఏర్పాట్లు, ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా కొనసాగేలా పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని ఎన్నికల సంఘం వెల్లడిరచింది.
పలు కేంద్రాలను సందర్శించిన వికాస్‌ రాజ్‌
హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 29 : పోలింగ్‌ కేంద్రాల పరిశీలన కోసం 22 వేల మంది మైక్రో అబ్జర్వర్‌లను, స్క్వాడ్‌లను ఈసీ నియమించింది. అదే విధంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ రాష్ట్రంలోని అన్ని డీఆర్సీ కేంద్రాలను సందర్శించారు. ఎన్నికల సామాగ్రి పంపిణీని పరిశీలించారు. మరోవైపు కలెక్టర్‌ అనుదీప్‌ హైదరాబాద్‌ పరిధిలోని డీఆర్సీ కేంద్రాలను సందర్శించారు. రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. మొత్తం 2,290 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీలు ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. డిసెంబర్‌ 3న వోట్లను లెక్కించి ఫలితాలను వెలువరించనున్నారు.

ముగిసిన ప్రచారం.. మొదలైన ప్రలోభం
వోట్ల జాతరలో నోట్ల వర్షం…
పోటా పోటీగా డబ్బు పంపిణీ

 
image.png
కూకట్‌ పల్లి, ప్రజాతంత్ర, నవంబర్‌ 29 : ఎన్నికల ఆఖరి అంకంలో డబ్బు ప్రవాహం ఎక్కువగా కనిపిస్తుంది. పోలింగ్‌ సమయం దగ్గరపడే కొద్దీ తాయిలాల హీట్‌ మరింతపెరుగుతుంది. వోట్ల జాతరలో నోట్ల వర్షం కురుస్తుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని గంటలే కౌంట్‌ డౌన్‌ మిగిలి ఉండటంతో పార్టీల మధ్య ప్రలోభాల పర్వం ఊపందుకుంది. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇక అసలు ఆట ఇప్పుడు మొదలైంది. అదే వోటర్లను తమ వైపు తిప్పుకోవడానికి పార్టీల ప్రలోభాలు. ఈ క్రమంలో వోటర్లకు డబ్బులు పంచుతూ కొందరు పట్టుపడగా.. మరికొంత మంది నగదును అక్రమంగా తరలిస్తూ పోలీసుల తనిఖీల్లో దొరిపోతున్నారు. శాసనసభ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 5 గంటలతో ముగియడంతో ఇక అభ్యర్థుల దృష్టి అంతా వోటర్లను ఏవిధంగా ప్రలోభపెట్టాలో అన్నదాని పైనే ఉంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వోటర్లకు డబ్బులు పంచుతున్నారనే ఫిర్యాదులు పోలీసులకు అందుతున్నాయి. ఏ అభ్యర్థి గెలిచినా తక్కువ మెజార్టీతో బయటపడతానే అంచనాలు ఉండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా పంపకాల జోరు కొనసాగిస్తున్నారు. పోటీ తీవ్రంగా ఉన్న చోట్ల ఊహించని రీతిలో వోటర్లకు తాయిలాలు ముట్టజెప్పుతున్నారు. స్థానిక వోటర్లకు తాయిలాలు పంచుతూ తమకే వోటు పడేలా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ ఒక్క వోటును జారవిడుచుకోవద్దన్న ఉద్దేశ్యంతో కొనుగోలు చేసేందుకు ఎంత డబ్బు అయినా పంచడానికి రెడీ అవుతున్నారు. కుల సంఘాలు, గేటెడ్‌ కమ్యూనిటీలు, అపార్ట్‌ మెంట్లవారీగా అభ్యర్థుల అనుచరులు ఇప్పటికే పంచుడు షురూ చెయగా..ఎన్నికల సంఘం నిఘా నేపథ్యంలో తమకు నమ్మకస్తుల ద్వారా ఈ తంతు పూర్తి చేయిస్తున్నారు. స్థానిక కూకట్‌ పల్లి నియోజకవర్గంలో త్రిముఖ పోరు ఉన్న కారణంగా అభ్యర్థులు కాంప్రమైజ్‌ కాకుండా ముట్టజెబుతున్నట్లు తెలుస్తుంది. ఇక గెలుపుపై నమ్మకం ఉన్న అభ్యర్థులు వోటర్లకు నగదు పంపిణీ విషయంలో ధైర్యం చేస్తుంటే అపనమ్మకమున్న అభ్యర్థులు మాత్రం కాస్త ఆచితూచి పంపకాలు కొనసాగిస్తున్నట్లు చర్చ జరుగుతుంది. స్థానిక అభ్యర్థులు ప్రజలను ప్రలోభాలకు లోను చేసి ఏమాత్రం మెజార్టీతో బయట పెడతారో వేచిచూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *