– అధికారులకు ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు
– విచారణ 18కి వాయిదా
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 14: బంజారాహిల్స్‌లోని పెద్దమ్మ గుడి కూల్చివేత చెందిన వివరాలు అందజేయాలని రాష్ట్రానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని భద్రపరచాలని అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. సమగ్ర వివరాలతో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రతివాదులైన హైదరాబాద్ కలెక్టర్, తహసీల్దార్లకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 18కు వాయిదా వేసింది. ఈమేరకు న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆలయాన్ని కూల్చడం, ఆపై విగ్రహాన్ని తొలగించడం ద్వారా భక్తుల మనోభావాల్ని దెబ్బతీశారని, రాజ్యాంగంలోని 14, 21, 25, 26 అథికరణాలను ఉల్లంఘించారంటూ హిమాయత్‌నగర్‌కు చెందిన పల్లె వినోద్ కుమార్ రెడ్డి హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కూల్చివేతకు ముందు ఆలయమున్నట్టుగా అదే స్థలంలో ఆలయాన్ని నిర్మించేలా ఉత్తర్వులు ఇవ్వాలని, దేవాదాయ శాఖ పర్యవేక్షణలో స్థానిక భక్తుల పర్యవేక్షణలో తిరిగి విగ్రహాన్ని ప్రతిష్టించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ న్యాయవాది వాదించారు. కాలపరిమితిని నిర్ణయించి ప్రభుత్వ నిధులతో నిర్మాణం చేయించాలని కోరారు. విగ్రహ తొలగింపుపై కోర్టు పర్యవేక్షణలో న్యాయ విచారణ జరిపించాలని, కూల్చివేతలకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకునేలా ఉత్తర్వులు ఇవ్వాలని కూడా కోరారు. గత జూలై 24న అర్ధరాత్రి 3 గంటల సమయంలో అధికారులు వచ్చి గుడిని పూర్తిగా ధ్వంసం చేయడమే కాకుండా పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని సైతం తొలగించారని అన్నారు. చట్టవిరుద్ధంగా వారి చర్యలు ఉన్నందునే అర్ధరాత్రి కూల్చివేతలకు పాల్పడ్డారని అన్నారు. భక్తుల మనోభావాలకు చెందిన అంశమని, దీనిని తీవ్రంగా పరిగణించాలని కోరారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ, అది ప్రభుత్వ భూమి అని, అక్రమణలకు గురికాకుండా ఉండేందుకే ఆ విధమైన చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. వాదనల తర్వాత హైకోర్టు, తదుపరి విచారణ వరకు పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని భద్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది.
పెద్దమ్మ విగ్రహాన్ని భద్రపరచండి



