ఆలోచనా శక్తి, వివేకం కేవలం మంచి పుస్తకాలను చదవడం వలనే ఏర్పడతాయి. గతతరం నీతివంతంగా జీవించిందంటే దానికి కారణం మంచి విషయాలను వినడం,చదవడం వంటి మంచి లక్షణాలవలన సాధ్యపడింది. నేటి పరిస్థితులు తద్విరుద్ధంగా ఉన్నాయి.మానవ సంబంధాలు ధ్వంసమై,విలువలు మృగ్యమై నగ్నత్వం నాట్యమాడుతున్న నేటి తరుణంలో మనకు కర్తవ్య నిర్దేశనం చేసే గురువు కావాలి. అలాంటి గురువే ఒక మంచిపుస్తకం. పుస్తక పఠనమే గగనకుసుమమై,చరవాణితో చంచల స్వభావానికి లోనై,సాంకేతిక విప్లవం సృష్టించిన చెడు రహదారుల్లో పయనించడానికే మక్కువ చూపే నేటి తరానికి తీరికెక్కడ? పుస్తకపఠనానికి ఓపికెక్కడ?మంచి,చెడుల కలయికతో మిళితమై సాగుతున్న సాంకేతిక పథంలో చెడుకి సాష్టాంగ ప్రణామం చేస్తున్న యువతలో మార్పు రావాలంటే వారి ఆలోచనా ధోరణి సక్రమంగా సాగాలి.
మానసిక వికాసాన్ని అందించకుండా,మొద్దుబారిన మెదళ్ళను తయారు చేస్తున్న సాంకేతిక మార్పులను కొంత వరకు త్యజించి, సాంకేతిక రంగంలోని సవ్యమైన విధానాలను మాత్రమే అనుసరిస్తూ గ్రంథ పఠనానికే నేటి యువత అత్యధిక ప్రాధాన్యత నివ్వాలి. గ్రంథపఠనం వలన మన ఆలోచనా గవాక్షాలు తెరుచుకుంటాయి. మంచి,చెడుల విచక్షణ తెలుసుకునే మార్గం సుగమమౌతుంది.ఆలోచనకే తావులేని మరబొమ్మలుగా,తోలు బొమ్మలుగా తైతక్కలాడించే నేటి సాంకేతిక వ్యవస్థలో మనహృదయాలు సైతం మొద్దుబారిపోతున్నాయి. విచక్షణా నేత్రాలు మసకబారిపోతున్నాయి.
వివేకం అడుగంటి,వినయం,సంస్కారం ఆలోచనాజ్ఞానం నశింపుతో సమాజంలో అత్యల్ఫస్థాయిలో మిగిలున్న సంబంధబాంధవ్యాలు సైతం పెనం మీద నుంచి పొయ్యిలో పడిన చందంగా మారిపోయాయి.మనిషిలో ఆలోచన రావాలి. అందుకు మంచి పుస్తకాలు చదవాలి. గ్రంథాలయాలకు పూర్వవైభవం రావాలి. పాఠకుల సంఖ్య పెరగాలి. పఠనా పటిమ ఒక వ్యాపకంగా మారాలి.నేటి యువత,విద్యార్ధి కి గ్రంథ పఠనం పై ఆసక్తిని పెంపొందించాలి. మానసిక వికాసం కోసం ప్రతీ ఒక్కరూ విజ్ఞాన సముపార్జన చేయాలనే ఉద్దేశ్యంతో స్వాతంత్య్రోద్యమ తరహాలో అయ్యంకి వెంకటరమణయ్య,గాడిచర్ల హరిసర్వోత్తమ రావు,వెలగా వెంకటప్పయ్య,పాతూరి నాగభూషణం లాంటి మహనీయులందరి అవిశ్రాంత పోరాట ఫలితమే గ్రంథాలయోద్యమం.
మొక్కవోని దీక్షతో వారంతా గ్రంథాలయాల స్థాపనకు ఎంతగానో కృషిచేస్తే, వారి కృషి బూడిదలో పోసిన పన్నీరై చరవాణి నెత్తిన పన్నీరై యువత చెడు దారుల్లో పయనిస్తున్న సంక్లిష్ట పరిస్థితి దాపురించిన నేపథ్యంలో నైతిక విలువలను,మానవీయకోణాన్ని మింగేస్తున్న విషతుల్యమైన సాంకేతికత స్థానాన్ని పుస్తకం ఆక్రమించాలి. విజ్ఞానగనుల వంటి గ్రంథాలయాల్లో పుస్తక రూపాల్లో నిక్షిప్తమైన జ్ఞాన సంపదను యువత వెలికితీసి, మస్తిష్కంలో పొందుపరచుకోవాలి. మొక్కుబడిగా సాగే గ్రంథాలయ వారోత్సవాలు మన ఆరంభశూరత్వాన్ని చాటిచెప్పడానికే తప్ప,వాటివల్ల ఆశించిన ప్రయోజనం సిద్ధించదు. సందర్భాన్ని పురస్కరించుకుని చేసే ఏ కార్యక్రమమైనా ఆ రోజుకే పరిమితమై,ప్రచారానికి మాత్రమే ఉపకరిస్తుంది. ఫలసిద్ధి ప్రాప్తించాలంటే చిత్తశుద్ధి,కార్యదీక్షత అవసరం. మనకు ప్రచారపటోటాపాలపై ఉన్న శ్రద్దాశక్తులు కార్యసాధనలో కొరవడుతున్నాయి. గ్రంథాలయోత్సవా లు వారం రోజులు జరిగి, చివరిలో తాంబూలాలిచ్చేసాం కదా తదుపరి తంతు మనకెందుకులేనన్న ధోరణితో ముగియరాదు.ఆరంభ శూరత్వం విడనాడి,యువతను, విద్యార్థులను నిరంతరం గ్రంథపఠనం పై దృష్టిసారించేలా కృషిచేయాలి. ప్రసంగ కర్తల స్ఫూర్తి మరో గ్రంథాలయోద్యమానికి దారి తీయాలి.
సుంకవల్లి సత్తిరాజు,
సంగాయగూడె, ఏపీ
9704903463.




