- ఇతర రాష్రాల్లో ఉత్తమ విధానాలపై అధ్యయనం
- వొచ్చే వారం కేన్సర్ చికిత్సకు అదనంగా అందుబాటులోకి 300 పడకలు
- నిమ్స్, ఎంఎన్జే హాస్పిటళ్ల పనితీరుపై జూమ్ ద్వారా వైద్యారోగ్య మంత్రి హరీష్ రావు నెలవారీ సమీక్ష
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 13 : పిల్లల్లో జన్యులోపాలు నివారించేలా ముందస్తు పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందని మంత్రి హరీష్ రావు సూచించారు. ఈ అంశంపై ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న ఉత్తమ విధానాలు అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఆయన నిమ్స్ జెనిటిక్స్ విభాగం, జేడి మేటర్నల్ హెల్త్లను ఆదేశించారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిమ్స్, ఎంఎన్జె హాస్పిటళ్లపై అధికారులతో నెలవారీ జరిగే సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఓపీ పెరుగుదలకు అనుగుణంగా కౌంటర్లు పెంచాలని, ఇఎండిలో బెడ్స్ అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అన్నారు. బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్ చేసి, అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం ఆరోగ్య శ్రీ కింద రూ. 10 లక్షలు ఇస్తున్నదని తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా అవయవదానంపై అవగాహన పెంచాలని, బ్రెయిన్ డెడ్ నిర్ధారణ కేసుల్లో అవయవదానం చేసేలా ప్రోత్సహించాలని, ఇందుకు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇవ్వాలని అన్నారు. అవసరం అయితే తాను కూడా స్వయంగా ఆయా కుటుంబ సభ్యులతో మాట్లాడి ఒప్పించేందుకు సిద్ధమని మంత్రి ప్రకటించారు. నిమ్స్ అధ్వర్యంలో స్పోక్ మోడల్లో వివిధ జిల్లాల్లో ఉన్న డయాలసిస్ సెంటర్లను మానిటరింగ్ చేయాలని, సమస్యలు లేకుండా చూడాలన్నారు. ఎంఎన్జే కేన్సర్ హాస్పిటల్లో 300 పడకల కొత్త బ్లాక్ వొచ్చే వారంలో ప్రారంభిస్తామని, దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్కోవాలని ఆదేశించారు. ఇది అందుబాటులోకి వొస్తే మొత్తం 750 పడకలు కేన్సర్ చికిత్స కోసం అందుబాటులో ఉంటాయని తెలిపారు.
పాలియేటివ్ సేవల గురించి అవగాహన కల్పించి, ఎక్కువ మందికి సేవలు అందేలా చూడాలన్నారు. మొబైల్ స్క్రీనింగ్ బస్ ద్వారా నిర్వహించే క్యాంపుల సంఖ్య పెంచాలని, మారుమూల ప్రాంతాల్లోనూ వీటిని నిర్వహించాలని ఆదేశించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించే విధంగా సీఎం కేసీఆర్ అన్ని విధాల సపోర్ట్ చేస్తున్నారని, అడిగినవన్ని ఇస్తున్నారని, ఆయన మన మీద పెట్టుకున్న నమ్మకం వమ్ము కాకుండా పని చేద్దామని పిలుపునిచ్చారు. ప్రజలకు మంచి వైద్య సేవలు అందించడం, వారిని బాగా చూసుకోవడం మన బాధ్యత అని, పేషెంట్లు, వారి సంబంధీకులతో సెక్యూరిటీ, నాల్గవ తరగతి ఉద్యోగులు గౌరవంగా మెలగాలని మంత్రి హరీష్ రావు ఈ సందర్భంగా సూచించారు..




