- ప్రభుత్వ తీరుపై మండిపడ్డ పొంగులేటి
- గాంధీ భవన్‌లో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డితో భేటీ
- తనపై 20 గుంటల భూమి కబ్జా నింద దారణమన్న కాంగ్రెస్ నేత
- సొంతభూమిలో ప్రభుత్వ సర్వే…హైకోర్టులో కేసు దాఖలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 18 : ఖమ్మంలో పొంగులేటి, ఆయన సోదరుడు ప్రసాదరెడ్డికి చెందిన ఎస్‌ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్‌పై ఎన్నెస్పీ, రెవెన్యూ అధికారులు సర్వే చేసి.. 21 గుంటలు ఎన్నెస్పీది అంటూ నిర్దారించడంపై కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం వి•డియాతో మాట్లాడిన పొంగులేటి.. బీఆర్‌ఎస్‌లో ఉంటే ఇక న్యాయం… వేరే పార్టీలోకి వెళ్తే ఒక న్యాయమా? అంటూ మండిపడ్డారు. కండువాలు మార్చుకున్నాక ఎవరికి ఎంత భూమి వొచ్చిందో బయట పడుతుందన్నారు. తనలాంటి వ్యక్తి 20 గుంటల కబ్జా చేశానని నింద మోపడం దారుణమన్నారు. తమ కుటుంబ సభ్యులకు అక్కడ 130 ఎకరాల భూమి ఉందని..ఉద్దేశపూర్వకంగా కోర్టు సెలవులు చూసి తనను ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. 14 సంవత్సరాల నుంచి లేని సమస్య ఇప్పుడెలా వొచ్చిందని ప్రశ్నించారు.
ఖమ్మం సభ సక్సెస్ అయ్యిందనే ప్రభుత్వం అక్కసు అంటూ మండిపడ్డారు. న్యాయ స్థానం ద్వారా పోరాటం చేయనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతుందని ఈ నిందలు వేస్తున్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వొస్తుందనే సిగ్నల్స్ వొస్తున్నాయని…అందుకే పార్టీపై బీఆర్‌ఎస్ నాయకులు భయపడుతున్నారని అన్నారు. ఈ నెల చివర్లో కొల్లాపూర్‌లో సభ ఉంటుందని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. కాగా..మంగళవారం ఉదయం పొంగులేటి గాంధీభవన్‌కు వొచ్చారు. కాంగ్రెస్‌లో చేరిన తర్వాత మొదటిసారి ఆయన గాంధీభవన్ వొచ్చిన సందర్భంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మార్యద పూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం పొంగులేటి మాట్లాడుతూ…పార్టీలో చేరిన కొద్ది రోజులకే తనపై నమ్మకంతో పదవి ఇచ్చినందుకు ఆనందంగా ఉందన్నారు. చిత్తశుద్ధితో, సీనియర్లు అందరితో కలిసి పార్టీని అధికారంలోకి తేవడానికి కష్టపడతానని తెలిపారు.
తెలంగాణ ప్రజలు ఆశించిన ఫలితాలు రాలేదని..తెలంగాణ ఏర్పడి 9 సంవత్సరాలైన ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారన్నారు. కల్వకుంట్ల కుటుంబం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. స్కీములు ప్రకటించడం తప్పా నెరవేర్చలేదన్నారు. తెలంగాణ వొచ్చి కల్వకుంట్ల కుటుంబానికి తప్ప ఎవరికి మంచి జరగలేదని విమర్శించారు. కరెంట్ కనుక్కున్నదే కేసీఆర్ అనేలాగా చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే బీఆర్‌ఎస్ నాయకుల పరిస్థితి ఎలా ఉండేదని ప్రశ్నించారు. అనేక మంది పోరాటాల ఫలితం తెలంగాణ రాష్ట్రమని అన్నారు. ఒక గంట, ఒక రోజు నిరాహార దీక్షతో తెలంగాణ రాలేదని తెలిపారు.
కేసీఆర్ వాగ్దానాలు వాగ్దానాలుగానే ఉన్నాయని.. ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది కేసీఆర్ కాదా అని నిలదీశారు. అప్పులమయం చేసి కల్వకుంట్ల కుటుంబ సభ్యులు బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి అందరం బుణపడి ఉన్నామన్నారు. కాంగ్రెస్ పార్టీలో హేమాహేవి•లు ఉన్నారని.. అందరం కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకుందామని పిలుపునిచ్చారు. ఆచరణకు సాధ్యమయ్యేవే కాంగ్రెస్ చెబుతుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వొచ్చాక ప్రజల నుంచి దోచుకున్న సొమ్మును వడ్డీతో సహా కట్టిస్తామన్నారు. కాంగ్రెస్ అభిమానులను, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
సొంతభూమిలో ప్రభుత్వ సర్వే…హైకోర్టులో కేసు దాఖలు
సొంత భూములపై ప్రభుత్వ సర్వేను సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి బెంచ్ విచారణ చేపట్టింది. విచారణ చేపట్టిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశించింది. ప్రస్తుతం ధర్మాసనం స్టేటస్ కో ఆర్డర్ ఇచ్చింది. విచారణ ఆగస్టు 1కి కోర్టు వాయిదా వేసింది. ఎస్సార్ గార్డెన్‌లో 20 గుంటల ప్రభుత్వ భూమి ఉందని అధికారులు సర్వే చేశారు.
ఎన్‌ఎస్‌పీ ల్యాండ్ ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే 13 సంవత్సరాల క్రితం గార్డెన్ నిర్మించామని పొంగులేటి పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వ కక్ష సాధింపులో భాగంగానే భూములు సర్వే చేస్తున్నారని పొంగులేటి పిటిషన్‌లో పొందిపరిచారు. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది.



