పార్టీలో కష్టపడిన వారికి కాకుండా కోవర్టులకు పదవులా?

  • పీసీసీ కమిటీల ఎంపికలో అసలు ప్రాతిపదిక ఏమిటి?
  • ఏఐసిసిపై మాజీ డిప్యూటీ సీఎం, కాంగ్రెస్‌ ‌దామోదర రాజనర్సింహ అసంతృప్తి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 13 : ‌రాష్ట్రంలో పిసిసికి జరిగిన పదవుల ఎంపికపై మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గాంధీభవన్‌లో మీడియా సమావేశాన్ని కొందరు ముఖ్య నేతలు అడ్డుకొన్నారు. దీంతో మంగళవారం మెదక్‌ ‌జిల్లాలో కొంత మంది నేతలతో మీడియా సమావేశం పెట్టి తదుపరి కార్యచరణపై చర్చించారు. తెలంగాణ కాంగ్రెస్‌కు కోవర్టు రోగం పట్టుకుందని ఆ పార్టీ దామోదర రాజనర్సింహ తీవ్ర ఆరోపణలు చేశారు. ఏఐసీసీ ప్రకటించిన పీసీసీ కమిటీల ఎంపికలో అసలు ప్రాతిపదక ఏమిటో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. ఉమ్మడి మెదక్‌ ‌జిల్లాలో డీసీసీ అధ్యక్షలు నియామకం, ఇతర పదవుల ఎంపికపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ వ్యవహారంపై తాడోపేడో తేల్చుకోవాలని సోమవారమే ఆయన గాంధీభవన్‌కు వెళ్లారు. అయితే అక్కడ విలేఖరులతో మాట్లాడేందుకు ఆయన ప్రయత్నించగా ముఖ్యనేతలు నిలువరించారు. దీంతో ఉమ్మడి మెదక్‌ ‌జిల్లా నేతలతో సమావేశమయ్యారు. తిరిగి మంగళవారం జిల్లా నేతలతో ప్రత్యేకంగా సమావేశమైన రాజనర్సింహ తదుపరి కార్యాచరణపై చర్చించారు. పార్టీలో కష్టపడిన వారికి గుర్తింపు లేదని కోవర్టులకు పదవులు వొచ్చాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలోనే లేనంతగా ఇంతమంది ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు అవసరమా అని ప్రశ్నించారు. దీనిపై అధిష్ఠానం స్పందించి ప్రక్షాళన చేయకుంటే పార్టీ మనుగడే కష్టమని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *