- రెండోరోజు సమ్మిట్‌లో సిఎం జగన్
- పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
విశాఖపట్టణం,మార్చి4 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023(జీఐఎస్) రెండో రోజు శనివారం ఘనంగా ప్రారంభమైంది. రెండో రోజు కార్యక్రమాలలో సీఎం వైఎస్ జగన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 16 నూతన పారిశ్రామిక యూనిట్లను సీఎం జగన్ వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం సభ వేదికపై నుంచి సీఎం జగన్ మాట్లాడారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం తరపున కతజ్ఞతలు తెలిపారు. అందరి పెట్టుబడులతో రాష్ట్రం మరింత అభివృద్ధిని సాధిస్తుందన్నారు. కీలక సమయంలో సమ్మిట్ నిర్వహించామని చెప్పారు.
ఏపీని పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ఈ సమ్మిట్‌లో 15 రంగాల్లో చర్చలు జరిగాయని చెప్పారు. వంద మందికి పైగా స్పీకర్స్ పాల్గొన్నారని చెప్పారు. రెండు రోజుల్లో 352 ఎంవోయూలు జరిగాయని చెప్పారు. మొత్తంగా రాష్టాన్రికి 13 లక్షల 5 వేల 663 కోట్ల రూపాయల పెట్టుబడితో.. 6 లక్షల 3 వేల 223 మందికి ఉపాధి అవకాశాలు లభించేలా ప్రతిపాదనలు వచ్చాయన్నారు. సాధ్యమైనంత త్వరగా ఎంవోయూలు కార్యరూపం దాల్చేటట్టుగా చూస్తామని చెప్పారు. ఇందుకోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్టుగా ముఖ్యమంత్రి తెలిపారు.



