– శంషాబాద్ నుంచి పలు విమానాల రద్దు
హైదరాబాద్, మార్చి 2: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం శంషాబాద్ నుంచి విదేశాలకు వెళ్లాల్సిన అనేక విమానాలు రద్దయ్యాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధవాతావరణం కారణంగా విమానాయన సంస్థలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. శంషాబాద్ విమానాశ్రయం నుంచి దోహా, అబుదాబి, జెడ్డా, సౌదీ అరేబియా వెళ్లాల్సిన విమానాలు రద్దయ్యాయి. అలాగే కువైట్, దుబాయ్, మస్కట్, మదీనా వెళ్లే సర్వీసులు కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. శంషాబాద్ నుంచి వెళ్లాల్సిన సుమారు 22 విమానాలు రద్దు కాగా వివిధ దేశాల నుంచి రావాల్సిన మరో 22 విమానాలు కూడా రద్దయ్యాయి. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం దృష్ట్యా ఎయిర్ ఇండియా, ఇండిగో, ఎమిరేట్స్, కతార్ ఎయిర్వేస్ వంటి విమానయాన సంస్థలు విమానాలను రద్దు చేశాయి. విమానాల రద్దుతో శంషాబాద్ విమానాశ్రయం పరిసరాలు ప్రయాణికుల లేక వెలవెలబోతున్నాయి. ప్రయాణికులకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కీలక సూచన జారీ చేసింది. మిడిల్ ఈస్ట్ దేశాలకు ప్రయాణాలను రద్దు చేసుకోవాలని, పైలట్ స్టేటస్‌ను ఎయిర్‌లైన్ వెబ్సైట్లు, ఎయిర్పోర్ట్ అధికారుల ద్వారా తెలుసుకోవాలని డీజీసీఏ సూచించింది.
స్టాక్ మార్కెట్లపై యుద్ద ప్రభావం
ముంబయి, మార్చి 2: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, చమురు రేట్ల పెరుగుదలతో సూచీలు దారుణంగా పడిపోయాయి. సెన్సెక్స్ 1000 పాయింట్లు నష్టపోయింది. నిప్టీ 300 పాయింట్ల మేర పడిపోయింది. సోమవారం ఉదయం 9.25 గంటల సమయంలో సెన్సెక్స్ 1,048.48 పాయింట్లు దిగజారింది. దీంతో 80,238.71 వద్ద, నిప్టీ 307.35 పాయింట్లు పతనమై 24,871.30 వద్ద కొనసాగుతున్నాయి. రూపాయి విలువ క్షీణించింది. నేటి సెషన్లో 24 పైసలు తగ్గింది. దీంతో 91.32గా ట్రేడ్ అవుతోంది. ప్రీ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 2,700 పాయింట్లు, నిప్టీ 530 పాయింట్లు కుంగడంతో ఇన్వెస్టర్లు తీవ్ర ఆందోళన చెందారు. ప్రస్తుతం మార్కెట్లు కొద్దిగా కోలుకున్నప్పటికీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇరాన్`అమెరికా యుద్ధంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు రేట్లు భగ్గుమన్నాయి. ముడి చమురు ధర 80 డాలర్లపైగా ట్రేడ్ అవుతోంది. దీని ప్రభావంతో దేశీయంగా చమురు రంగ షేర్లు బాగా పడిపోయాయి. ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ 5 శాతం మేర కుంగింది. మారుతి సుజుకీ, ఏషియన్ పెయింట్స్ వంటి షేర్లు తీవ్ర నష్టాల్లో కొనసాగుతున్నాయి. క్రితం సెషన్లో విదేశీ సంస్థాగత మదుపర్లు రూ.7536 కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మారు. ఇది కూడా మార్కెట్ సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావం చూపింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





