రేపటి అత్యాశల గాలానికి చిక్కుకొని
బలవంతంగా రూపురేఖలు మార్చుకుంటూ
విలవిల్లాడుతోంది మావూరు…
వేరునుంచి విడిపోయిన మొక్కలా
దాహానికి దూరమైపోయిన నీటిచుక్కలా
బావురుమంటోంది
చెలిమిచెలమల్ని కోల్పోయిన నా హృదయపుటేరు…
కాంక్రీటు గోడల నీడల్లో
మావూరు వాడలన్నీ తమ జాడల్ని
పోగొట్టుకుంటున్నాయి…
నాకు పురాజ్ఞాపకాలుగా మీగిలిపోతున్న
నా పల్లె అందాలనూ, అనుబంధాలనూ
ఆత్మభూతద్దంలోంచి
అదేపనిగా వెతుక్కుంటున్నాను…
అప్పుడు మా పల్లె పిల్లతెమ్మెర గమ్మత్తుగా
నాకు వినిపించేది పైర్ల గుసగుసలు
ఇప్పుడిక్కడంతా
నవనాగరీక రణగొణధ్వనులు…
నా మాతృభూమీ!
నీ పంటల సిరి
ఎన్నెన్ని బ్రతుకుల్ని పండించిందో
ఎన్నెన్ని కనుపాపల్ని వెలిగించిందో
నీ మట్టిపొరల ఆత్మీయ స్పర్శను
మళ్లీ మళ్లీ పొందాలని తపించిపోతున్నా
నా ఊహల పల్లకిలో
నీ గత వైభవాన్ని ఊరేగిస్తూ
మన అనుబంధానికి గుర్తుగా
నీ ముంగిట్లో
నా జ్ఞాపకాల్ని
తోరణాలుగా కడుతున్నా…
– డాక్టర్ కొత్వాలు అమరేంద్ర,9177732414,
తిరుపతి (ఆ.ప్ర).




