తెలంగాణ సాహిత్య పరిశోధనకు సంబంధమైన విశిష్టమైన అంశాలతో వెలువడిన విమర్శనాత్మక వ్యాస సంకలనం పలుకుజెలి. సీనియర్ సాహితీవేత్త, కవి డాక్టర్ టి. శ్రీరంగస్వామి లేఖిని నుండి వెలువడిన 16 వ్యాసాలతో కూడిన విశిష్ట సంకలనమిది. అధ్యయనశీలత, సూక్ష్మ వివేచనా దృష్టితో ఈ వ్యాసాలలో విమర్శనాత్మక విశ్లేషణ జరిగింది.సంకలనంలోని మొదటి, రెండవ వ్యాసాలు తెలంగాణలో స్వాతంత్రోద్యమంలో స్వాతంత్య్రోద్యమ సాహిత్యంతో పాటు జాతీయోద్యమ విశేషాలెన్నింటిలో లోతైన వివేచనా దృష్టితో డాక్టర్ శ్రీరంగస్వామి వెల్లడించారు. మూడవ వ్యాసం ఒక పాలకుని ఆత్మఘోష. నిజాం రాష్ట్ర చివరి ప్రధాని మీర్‌లాయక్ అలీ ఆలోచనలు, అంతరంగాన్ని హైద్రాబాదు విషాదం పేరుతో తెలుగులో ఏనుగు నర్సింహ్మారెడ్డి అందించిన తీరును విశ్లేషిస్తూ అనేక ఆసక్తికరమైన అంశాలను సోదాహరణంగా వివరించారు. నిజాం రాజులకు అసఫ్ జాహీలు అన్న పేరెలా వచ్చిందో వివరంగా తెలిపారు.
తెలంగాణలో పుట్టిన వారంతా తెలంగాణ గురించి లోతుగా అవగాహన చేసుకునేందుకు ఆ అనువాద గ్రంథం ఎలా ఉపయోగపడుతుందో చెప్పారు. నాలుగవ వ్యాసం భాగవతానికి నాంది నారాయణ శతకం అన్న వ్యాసం బొమ్మెర పోతన విశిష్టతను వెల్లడిస్తూనే శైవం నుండి వైష్ణవంపై దృష్టిని సారిస్తున్న క్రమంలో ఆ శతకాన్ని గొప్ప సాహిత్య నిదిగా అందించారని నిరూపించారు. మహాభాగవత రచనకు తొలిమెట్టుగా ఈ శతకాన్ని పోతన వెలువరించి ఉండవచ్చన్న భావనను కూడా రచయిత వెల్లడించారు. నారాయణ మకుటంతో ఈ శతకంలో ఉన్న పద్యాలన్నీ మత్తేభ, శార్దూల వృత్తాలలో అందించడంలో పోతన పాటించిన విశిష్ట వైచిత్రిని రచయిత లోతైన దృష్టితో చూపించారు. నారాయణ శతకం, భాగవత ప్రణాళిక ఒకే విధంగా ఉన్నట్లు అనిపిస్తుందని చెప్పారు.
నారాయణ శతకం భాగవతానికి ఒక బీజం అయి ఉంటుందని భావించారు. విలక్షణమైన, సుసంపన్నమైన తెలుగు సాహిత్య ప్రక్రియలకు గౌరవం ఆపాదించిన లక్షణ కర్తల గురించి తెలుగు సాహిత్యం – లక్షణ కర్తలు అన్న వ్యాసంలో తెలిపారు. భామహుడు, కేతన, అనంతాచార్యుడు, కృష్ణదీక్షితుడు, గౌరన, తిరుమలభట్టు, అడిదం సూరకవి. కస్తూరి రంగ కవి మొదలుకొని పలువురు కవుల ప్రస్తావనలు ఈ వ్యాసంలో ఉన్నాయి. పంపన భారతం, ఆది పురాణం, జిన వల్లభుడి కురిక్యాల బొమ్మలగుట్టపై వేసిన శాసనం గురించిన విశ్లేషణను రచయిత ఎంతో ఆలోచనాత్మకంగా చేశారు. కన్నడ, తెలుగు కంద పద్యాల గురించిన వివరణ కూడా ఈ వ్యాసంలో కన్పిస్తుంది. తొలి తెలంగాణ సాహిత్య దీపికలు అన్న వ్యాసంలో తెలంగాణ చరిత్రను తప్పుదారి పట్టించి, మసిబూసి మారేడు కాయలను అందించడాన్ని తెలుపుతూ అప్పట్లో ఆపేసి తెలంగాణీయులే తెలంగాణ చరిత్రను రాసుకుంటే అసమానతల దుస్థితి ఎంత మాత్రం ఉండేది కాదని డాక్టర్ శ్రీరంగస్వామి అభిప్రాయపడ్డారు. సురవరం ప్రతాప్‌రెడ్డి గొలనుకొండ కవుల చరిత్ర మొదలుకొని 1900కు ముందు తెలంగాణ సాహిత్య చరిత్రను నిక్షిప్తంచేసిన డాక్టర్ సుంకిరెడ్డి ముంగిలి గ్రంథం మొదలుకొని ఆచార్య ఎస్వీ రామారావు రచించిన తెలంగాణ సాహిత్య చరిత్రను విశ్లేషించారు.
తెలంగాణ సాహిత్య చరిత్రను ఎంతో లోతుగా పరిశీలించడానికి ఉపయోగపడే రామారావు గ్రంథంలోని మూలాలను గురించి పరిశోధకులు దృష్టిని పెట్టాలని సూచించారు. భర్తృహరి వైరాగ్యశతి అన్న వ్యాసంలో చెప్యాల రామకృష్ణారావు సులభ శైలిలో సరళంగా, ఆహ్లాదంగా, కదళీపాకంలా వైరాగ్యశతకాన్ని అనువదించిన తీరును వెల్లడించారు. రామకృష్ణారావు అనువాదానికి డాక్టర్ ఆశావాది ప్రకాశరావు చేసిన తాత్పర్య వ్యాఖ్యానాన్ని కూడా తెలుపుతూ ఆ కృషిని ప్రబంధానికి అందిన ఒక ప్రామాణికతగా వర్ణించారు. పత్రికానీలమణి యం.ఎస్ ఆచార్య అన్న వ్యాసంలో వరంగల్ కేంద్రంగా 1958 నుండి జనధర్మ, వరంగల్ వాణి పత్రికలను నడిపిన శ్రీమాన్ మాడభూషి శ్రీనివాసాచార్యుల పాత్రికేయ వృత్తి ప్రత్యేకతలను ఎన్నో సంఘటనలను ఉదాహరిస్తూ తెలిపారు. మనకాలపు తెలంగాణ యోగి వరకవి భూమాగౌడ్ అన్న వ్యాసంలో ఆధ్యాత్మిక యోగిగా ఆయనను చూపి వైష్ణవ సంపద్రాయాన్ని ఆచరించి రామానుజుల వెంట నడిచి తనకు తెలిసిన ఆయుర్వేద వైద్యం చేస్తూ జీవితం గడిపారని వెల్లడించారు. వరకవి భూమాగౌడ్ నవల ప్రత్యేకతను వెల్లడిస్తూ కీర్తనలు, పద్యాలను సమయస్ఫూర్తితో సందర్భోచితంగా ఉదాహరించిన వేముల ప్రభాకర్ రచనా కృషిని కూడా ప్రశంసించారు.
తెలంగాణ శతక సాహిత్యం – పల్లేరు పరిశోధన అన్న వ్యాసంలో పరిశోధనారంగంలో, భాషా వ్యాకరణ రంగాలలో వీరస్వామి నిపుణతను వెల్లడించారు. ఉత్తర తెలంగాణ కథలు (1970 – 2000) – సమగ్ర పరిశీలన అన్న ఆకునూరు విద్యాదేవి పరిశోధనా గ్రంథంలో తెలంగాణ కథ పుట్టుక నుండి సమకాలీన పరిణామ పరిణతిని విశ్లేషిస్తూ శ్రీరంగస్వామి పరిశోధన విలువల ప్రాధాన్యతను వెల్లడించారు. సంకల్ప బలం, సాహిత్య స్ఫూర్తితో విద్యాదేవి పరిశోధనలో సూచించిన కథాంశాలు, ఆయా కాలాల వెనక ఉన్న చరిత్రలను ఆయన విశదంగా తెలిపారు. కథా సాహిత్యం పరిశీలించే వారికి విద్యాదేవి పరిశోధనా గ్రంథం ఎంతగానో తోడ్పడుతుందని అంటూ ఉత్తర తెలంగాణ కథకు చిరునామాగా ఆమె పరిశోధన నిలిచిపోతుందని పేర్కొన్నారు. అమ్మంగి వ్యాసాలు – ఒక విజ్ఞాన సర్వస్వం అన్న శీర్షికన అమ్మంగి రాసిన 62 వ్యాసాల సహృదయ సాహిత్య విమర్శ – వైవిధ్యం అన్న వ్యాససంపుటి ప్రత్యేకతను విశదీకరించారు. వివేచన, విచక్షణ కలిగిన వ్యాసకర్తగా అమ్మంగి చూపిన వ్యాసరచనా నేర్పును శ్రీరంగస్వామి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
సమకాలీన సాహిత్య చరిత్ర, హైద్రాబాద్ నేపథ్యాలను అమ్మంగి వ్యాససంపుటి దర్శింపజేస్తున్నందున అది విజ్ఞాన సర్వస్వమేనని శ్రీరంగస్వామి అభిప్రాయపడ్డారు. తొలి మహిళా పదకోశకర్త ముదిగంటి సుజాతారెడ్డి అన్న వ్యాసంలో భాషాభివృద్ధికి మార్గదర్శులుగా ఉపయోగపడే పదకోశాల రూపకల్పనలో ఆమె కృషిని ప్రస్తావించారు. తెలంగాణ వ్యవహార పదకోశాన్ని ఎంతో మక్కువతో, నమ్రతతో, నిబద్ధతతో రూపొందించిన సుజాతరెడ్డి కృషిని ఈ వ్యాసంలో ఎంతో స్పష్టంగా శ్రీరంగస్వామి సూచించారు. నిశ్శబ్ద యోధ అన్న వ్యాసంలో అమృత లత ఓ వ్యక్తిగా మొదలై సమూహంగా ఎలా విస్తరించిందో వివరించారు. విజయ హైస్కూల్ స్థాపకురాలిగా అమృతలత ప్రయాణాన్ని చిత్రిస్తూ ఆర్ధ్రమైన, కంటతడి పెట్టించే సన్నివేషాలెన్నింటినో వ్యాసకర్త చెబుతూనే ప్రతిపాత్ర ప్రాధాన్యత దెబ్బతినకుండా ఆత్మగతం చేసుకున్న రీతిని పాటిస్తూ రాశారు. అమృత ఏకాంత బృందగానం అన్న వ్యాసంలో తెలుగులో ఆత్మకథలకు శతాధిక సంవత్సరాల వయస్సు ఉందని చెబుతూ ఆదిభట్ల నారాయణరావు నా ఎఱుక మొదటిదని అయినా కందుకూరి వీరేశలింగం స్వీయ చరిత్ర 1906లోనే వెలుగుచూసిందని చెప్పారు.
తెలుగులో వచ్చిన అనేక ఆత్మకథలను, స్వీయ చరిత్రలను ఈ వ్యాసంలో ప్రస్తావించారు. నిత్య సాహితీవసంతుడు నిత్యానందుడు అన్న వ్యాసంలో ఆచార్య వెలుదండ నిత్యానందరావు పరిశోధక కృషిని, వెలువరించిన వివిధ గ్రంథాలను గురించి చెప్పారు. సమీక్షలలో సూక్ష్మత, సమగ్రత పాటించి రాసిన మంచి వ్యాస రచయితగా, ఆచార్యునిగా, నిత్య పరిశోధకునిగా నిత్యానందరావును ప్రశంసించారు. నిత్య సాహితీ వసంతునిగా నిత్యానందరావు నిరంతర కృషితో వెలువరించిన అనేక పరిశోధనాత్మక గ్రంథాలను పేర్కొంటూ ఒక్కొక్కటిగా వాటి ప్రత్యేకతను వివరించారు. విభిన్న రచయితలు, లక్షణకర్తలు, ఉద్యమశీలురు, రచయితలు జరిపిన కృషిని వారి మూలాలలోకి వెళ్లి ఎంతో శ్రద్ధతో వివరించి రాసిన అరుదైన వ్యాసాలు డాక్టర్ శ్రీరంగస్వామి పలుకుజెలిలో చోటుచేసుకున్నాయి. తెలంగాణ సాహిత్య విమర్శ చరిత్రను, వాటి స్వరూప స్వభావాలను విస్తృతంగా ఈ వ్యాసాలలో విశ్లేషించి చూపారు. తెలంగాణ చారిత్రక సాహిత్య వివేచన, విశ్లేషణ కలగలిసిన ఈ వ్యాసాలలో ఆయా రచయితల ప్రతిభాన్విత రచనా సప్రమాణత వెల్లడైంది. అధ్యయన శీలతతో, సూక్ష్మ వివేచనతో శ్రీరంగస్వామి అందించిన ఈ వ్యాసాల సంపుటి ఆయనలోని పరిణత పరిశోధనా దృష్టికి అద్దం పట్టింది.
– డా. తిరునగరి శ్రీనివాస్
8466053933




