కేంద్రంలో అధికారంలో ఉన్నా ఎందుకు అడుగు వేయలే
సిబిఐ విచారణ కోరడం కెసిఆర్‌ను రక్షించడానికే
కిషన్ రెడ్డి డిమాండ్‌పై మండిపడ్డ మంత్రి పొన్నం ప్రభాకర్
‘ప్రజా పాలన’ దరఖాస్తులకు పొడిగింపులేదని మంత్రి స్పష్టం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 2 : కాలేశ్వరం అవినీతిపై ప్రబుత్వం ఏర్పాటు చేసిన జ్యూడీషియల్ ఎంక్వైరీకి బీజేపీ సహకరించాలని..కాళేశ్వరంపై సీబీఐ విచారణకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ రాయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. అనేక కేసుల్లో కేసీఆర్ ఫ్యామిలీని బీజేపీ రక్షించిందని అన్నారు. ఇన్నేళ్లుగా కేసీఆర్‌పై విచారణ ఎందుకు చేయట్లేదని బీజేపీని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్‌ను రక్షించేందుకే కిషన్ రెడ్డి సీబీఐ ఎంక్వైరీ కోరుతున్నారని తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేసీఆర్ బినావిూ అని వ్యాఖ్యానించారు. ఎంఐఎం, బీజేపీ, బీఆర్‌ఎస్ ఒకటేనని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధిలో బీజేపీ పాత్ర శూన్యంగా ఉందని మండిపడ్డారు. పదేళ్లపాటు బిఆర్‌ఎస్‌కు వత్తాసు పలికి, వారి అక్రమాలను చూస్తూ వదిలేసిన వారు ఇప్పుడు నీతులు చెబుతున్నారని మంత్రి మండిపడ్డారు. పదేళ్లుగా అవినీతిపై డిమాండ్ చేస్తున్నా ఎందుకు పట్టించుకోలేదన్నారు. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఏం చేశారని మంత్రి పొన్నం నిలదీశారు. ప్రజా పాలన దరఖాస్తులకు పొడగింపు లేదని..జనవరి 6 లోపే అందరూ అప్లై చేసుకోవాలని మంత్రి పొన్నం వెల్లడిరచారు. ప్రజాపాలన అప్లికేషన్లపై రాజకీయాలు ఏంటని నిలదీశారు. లేడీస్ ఫ్రీ జర్నీ స్కీంను బీఆర్‌ఎస్ వ్యతిరేకిస్తుందని మండిపడ్డారు.
ఆటో డ్రైవర్లు బీఆర్‌ఎస్ ట్రాప్ లో పడొద్దని పొన్నం చెప్పారు. హిట్ అండ్ రన్ కేసుల్లోని కొత్త రూల్స్‌ను ఆపేయాలని చెప్పారు. ట్రక్కు డ్రైవర్ల సమ్మెతో నిత్యావసరాల ధరలు పెరుగతాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలను తప్పనిసరిగా ఆమలు చేస్తామని రవాణాశాఖ, హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. మంగళవారం మెహిదీపట్నం సర్కిల్ విజయనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ సెంటర్‌ను మంత్రి పరిశీలించారు. ఇప్పటి వరకు నగర వ్యాప్తంగా ఇప్పటి వరకు కంటోన్మెంట్‌తో పాటు 650 కేంద్రాలను ఏర్పాటు చేసి 9.92 లక్షల దరఖాస్తులు స్వీకరించామని మంత్రి వివరించారు.ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా జీహెచ్‌ఎంసీ అధికారులు సమర్థవంతంగా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. పబ్లిక్ ఎక్కువ వచ్చినా ఇప్పుడున్న కౌంటర్ల కంటే అవసరం మేరకు కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హావిూలను నిలబెట్టుకుంటామని తెలిపారు. అర్హులైన నిరుపేదలకు పథకాలు అందుతాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ప్రజాపాలనలో భాగస్వామ్యం కావాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్‌రోస్, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, జోనల్ కమిషనర్ వెంకటేష్ దొత్రే, ప్రత్యేక అధికారి, డిప్యూటీ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు.




