పదేళ్లుగా దేశాభివృద్దికే అంకితం

  • అవినీతి నిర్మూలనకు ప్రాధాన్యం
  • దర్యాప్తు సంస్థల దుర్వినియోగం సత్యదూరం
  • రాజకీయనేతల విచారణ కేసులు 3 శాతం మాత్రమే
  • మీడియా ఇంటర్వ్యూలో ప్రదాని మోదీ
  • త్వరలోనే జమ్మూకశ్మీర్‌ ‌రాష్ట్రహోదా పునరుద్దరణ : కశ్మీర్‌ ఎన్నికల ప్రచారంలో ప్రధాని

న్యూ దిల్లీ/శ్రీనగర్‌, ఏ‌ప్రిల్‌ 12 : ‌లోక్‌సభలో భాజపా వరుసగా రెండుసార్లు మెజార్టీని సాధించి ఏర్పాటు చేసిన తమ ప్రభుత్వం అధికారాన్ని దేశాభివృద్ధి కోసమే ఉపయోగించిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. కానీ, అంతకుముందు కాంగ్రెస్‌ ‌మాత్రం దశాబ్దాల పాటు తమకున్న మెజార్టీతో ఓ కుటుంబాన్ని బలోపేతం చేసిందని దుయ్యబట్టారు. వొచ్చే ఎన్నికల్లో వరుసగా మూడోసారి ఎన్డీయే ప్రభుత్వమే అధికారంలోకి వొస్తుందని ప్రతిపక్షాలకు కూడా తెలుసని ఎద్దేవా చేశారు. ఓ జాతీయ వి•డియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తుందన్న విపక్షాల ఆరోపణలకు గట్టిగా బదులిచ్చారు. అవినీతిపరులపై కఠిన చర్యలు చేపట్టేందుకు తమ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుందని, భాజపా అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ తమ చర్యలు కొనసాగుతున్నాయని, కేవలం రాజకీయ నాయకులనే దర్యాప్తు సంస్థలు లక్ష్యంగా చేసుకుంటున్నాయని కొందరు కావాలనే తప్పుడు కథనాలు సృష్టిస్తున్నారని మోదీ అన్నారు.

ఈడీ దర్యాప్తు చేస్తున్న అవినీతి కేసుల్లో కేవలం 3శాతం వాటికే రాజకీయాలతో సంబంధముందని, మిగతా 97శాతం అవినీతి అధికారులు, నేరగాళ్లకు సంబంధించినవే అని మోదీ వెల్లడించారు. 2014లో తాము అధికారంలోకి వొచ్చిన నాటి నుంచి అవినీతి నిర్మూలనకే అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు ప్రధాని తెలిపారు. గ్రూప్‌ ‌సి, గ్రూప్‌ ‌డి ఉద్యోగాల్లో ఇంటర్వ్యూలను రద్దు చేయడం, లబ్దిదారులకు నేరుగా ప్రయోజనాలు అందేలా నేషనల్‌ ‌సింగిల్‌ ‌విండో సిస్టమ్‌ను తీసుకురావడం దానిలో భాగమేనని గుర్తుచేశారు. ఈ చర్యలతో గత పదేళ్లలో దాదాపు 10 కోట్ల మంది నకిలీ లబ్దిదారుల పేర్లను తొలగించినట్లు పేర్కొన్నారు. దీంతో రూ.22.75లక్షల కోట్లను తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా కాపాడినట్లు తెలిపారు. 2014 ముందు ఈడీ అటాచ్‌ ‌చేసుకున్న ఆస్తులు విలువ రూ.25వేల కోట్లుగా ఉండగా.. గత పదేళ్లలో ఆ మొత్తం రూ.లక్ష కోట్లకు పెరిగిందని మోదీ వెల్లడించారు. పోలింగ్‌ ‌ప్రారంభం కాకముందు నుంచే చాలా మంది ఈవీఎంలపై నిందలు వేశారని, వొచ్చే ఎన్నికల్లో ఎన్డీయే ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వొస్తుందని విపక్షాలకూ తెలుసునని, అందుకే చాలా మంది ప్రతిపక్ష నేతలు ప్రచారానికి దూరంగా ఉంటున్నారని మోదీ విమర్శలు గుప్పించారు.

త్వరలోనే జమ్మూకశ్మీర్‌ ‌రాష్ట్రహోదా పునరుద్ధరణ : కశ్మీర్‌ ఎన్నికల ప్రచారంలో ప్రధాని
త్వరలో జమ్మూకశ్మీర్‌లో రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని ప్రధాని మోదీ అన్నారు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. ఆ రోజు ఎంతో దూరంలోలేదని, ప్రజలు తమ ఆకాంక్షలు వారి ఎమ్మెల్యేలు, మంత్రులతో పంచుకోవచ్చని వెల్లడించారు. ఈ విషయంలో తనను నమ్మాలని, గత 60 ఏళ్లుగా జమ్మూకశ్మీర్‌ను పట్టి పీడిస్తున్న సమస్యను దూరం చేస్తానని ఆయన వెల్లడించారు. ఉగ్రవాద భయం, రాళ్లదాడులు, సీమాంతర కాల్పులు వంటివి లేకుండా రానున్న లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయని హావి• ఇచ్చారు.

శుక్రవారం జమ్మూకశ్మీర్‌ ‌పర్యటనకు వెళ్లిన ప్రధాని.. ఉదంపుర్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ…దశాబ్దాల తర్వాత కశ్మీర్‌లో ఎన్నికలకు ముందు తీవ్రవాదం, బంద్‌లు, రాళ్ల దాడులు, సరిహద్దు ఘర్షణలు వంటి సమస్యలు తలెత్తకపోవడం ఇదే తొలిసారని అన్నారు. రాష్ట్రంలో గడిచిన పదేళ్లలో చాలా అభివృద్ధి పనులు చేశామని, విపక్షాలకు ఈ ప్రాంతాభివృద్ధిపై పట్టింపులేదని, ఆర్టికల్‌ 370 ‌రద్దుతో రాష్ట్రంలో నాణ్యమైన విద్య అందించే అవకాశం లభించిందని, ఐఐఎం, ఐఐటీ వంటి విద్యా సంస్థల ఏర్పాటుకు పునాది పడిందని, అవినీతి నిర్మూలన జరిగిందని మోదీ పేర్కొన్నారు. కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 ‌రద్దు అనేది బీజేపీ తీసుకున్న అతిపెద్ద సాహసోపేత మైన నిర్ణయబని, ఇది అందరికీ సమాన రాజ్యాంగ హక్కులను కల్పిస్తుందని అన్నారు.

అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి కాంగ్రెస్‌ ‌గైర్హాజరుకావడాన్ని ఈ సందర్భంగా మోదీ ప్రస్తావిస్తూ… రామ మందిరం అనేది భాజపాకు ఎన్నికల అంశమని కాంగ్రెస్‌ ‌చెస్తుందని, కానీ అది ఎప్పటికీ ఎన్నికల అంశం కాదని స్పష్టం చేయాలను కుంటున్నానని, భాజపా అనేది లేకముందే ఈ మందిరం కోసం పోరాటం జరిగిందని, విదేశీ దురాక్రమణదారులు మన ఆలయాలను ధ్వంసం చేసినప్పుడు.. మతపరమైన ప్రాంతాలను రక్షించుకునేందుకు భారత ప్రజలు పోరాడారని మోదీ తెలిపారు. కాంగ్రెస్‌, ‌దాని మిత్ర పక్షాలు పెద్దపెద్ద బంగ్లాల్లో ఉంటారని, కానీ రామ్‌లల్లా టెంట్‌ ‌మార్చే విషయానికి కొచ్చేసరికి వెనుదిరిగారని దుయ్యబట్టారు.

బుజ్జగింపు రాజకీయాలకు కాంగ్రెస్‌ ‌పార్టీ కేరాఫ్‌గా నిలిచిందని ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు చేశారు. నవరాత్రుల సందర్భంగా ఇండియా కూటమి నేతలు మాంసాహారం తీసుకుంటారని, ఇండియా కూటమి భారత సంస్కృతి విస్మరించిన బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతుందని, కూటమి నేతలకు ప్రజల మనోభావాలతో పని లేదని, విలువలు పట్టించుకోరని, విభజన రాజకీయాలకు పాల్పడతారని దుయ్యబట్టారు. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ప్రతిపక్షాలు దూరంగా ఎందుకున్నాయని మోదీ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ‌నేతలు ప్రాణ ప్రతిష్ఠను ఎన్నికల కార్యక్రమంగా అభివర్ణించారని, అయితే రామమందిర పోరాట ఉద్యమం 500 ఏళ్లకుపైనే నడిచిందని ఆ పార్టీకి తెలియదా అంటూ ప్రధాని ప్రశ్నించారు. బీజేపీ రాముడికి ప్రపంచమే అబ్బురపడే గుడిని నిర్మించిందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *