హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, నవంబర్ 07 : న్యాయస్థానాలు బాధితుల కేసుల విషయంలో జాప్యం చేయరాదని మానవ హక్కుల కార్యకర్త జి.స్వర్ణ గౌడ్ విజ్ఞప్తి చేశారు. తన మెడికల్ నెగ్లీజెన్సీ కేసు విషయంపై ఖైరతాబాద్ కన్జ్యూమర్ కోర్టులో మాట్లాడినందుకు పెనాల్టీగా తమ కేసును న్యాయమూర్తి మరో నెల పొడగించాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం హైదర్ గూడ ఎన్ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మెడికల్ నెగ్లిజెన్సీ కేసులో భాగంగా తన కేసును గత సంవత్సరం కాలంగా వాయిదాలు వేస్తూ వస్తున్నారని అన్నారు. తన ఒక్క కేసు కాకుండా కన్జ్యూమర్ కోర్టులో ఇలాంటి కేసులు ఎన్నో వాయిదాలు వేస్తూ వస్తున్నారని ఆరోపించారు. కోర్టులు ఇలా వాయిదాలు వేయడంతో రాష్ట్ర రాష్ట్ర నలుమూలల నుండి ఎంతోమంది బాధితులు వేళ్ళకు వేలు ఖర్చు పెట్టి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని కానీ వినియోగదారులకు సత్వర న్యాయం జరగడం లేదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు సీజేఐ వ్యాఖ్యానిస్తూ న్యాయస్థానాల్లో కేసులు పదేపదే వాయిదాలు పడడంపై అసహనం వ్యక్తం చేసినట్లు ఆమె గుర్తు చేశారు. భారత రాష్ట్రపతి, సుప్రీంకోర్టు, హైకోర్టు, రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఆమె పేర్కొన్నారు.
న్యాయస్థానాలు కేసుల విషయంలో జాప్యం చేయరాదు



