నేనెవరు ?
అనాదిగా నన్ను వేధిస్తున్న..
ఓ జటిల ప్రశ్న..
నా చుట్టపక్కాల కబుర్లెన్నో తెలుసు
బంధువుల పుట్టుపూర్వోత్తరాలు
మిత్రుల మతలబులు మర్మాలు
ఎదుటోళ్ల లోప బలహీనతలు
అక్కరకురానివన్నీ తెలిసిన (అ)జ్ఞానిని
అందరి లోతులు, లొసుగులు చూశా
వారిని చూసి పాలబడి నవ్వుకున్నా !
ఎవరి వీపు వారికి తెలియదు
నా బలహీనతలు నాకు అక్కర్లేదు
నాలోకి నేను తొంగి చూడనే లేదు
అత్మ విమర్శకు ఆస్కారమే లేదు
మనో విశ్లేషణ చేసుకున్నదే లేదు !
గ్రహాలపై కాలు మోపుతున్నాం
సముద్ర పాతాళ లోతులు తాకాం
అరంగుళం అంతరంగంలోకి..
తొంగి చూసిన పాపాన పోలేదు
మది గదిని శుభ్రం చేసే యావ లేదు !
నువ్వెవరో నీకు తెలిస్తేనే కదా..
లోకాన్ని జయించే అర్హత వచ్చేది
మది పొరల్లో దాగిన మురికిని..
కలుషితమైన స్వార్థ ఆలోచనల్ని..
మానవీయ తెల్ల బట్టతో తుడిచి..
శుద్ధి చేసుకుందాం అంతరంగాన్ని..
పరహిత భావనల శుద్ధ జలాల్తో..
ఆత్మను ఇష్టంతో శుద్ధి చేసుకుందాం
విజేతలుగా మార్గదర్శకులమవుదాం !
– డా: బుర్ర మధుసూదన్ రెడ్డి
కరీంనగరం – 9949700037




