ప్రారంభించనున్న మంత్రి జూపల్లి కృష్ణారావు
పుస్తక ప్రదర్శన ప్రాంగణానికి ప్రజా యుద్ధ నౌక గద్దర్, వేదికకు రవ్వా శ్రీహరి పేర్లు
బుక్ ఫెయిర్ అధ్యక్షులు జూలూరు గౌరీశంకర్ వెల్లడి
ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 08 : తెలంగాణ కళాభారతి(ఎన్టీఆర్ స్టేడియం)లో ఈనెల 9 నుంచి 19వ తేదీ వరకు 36వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శనను నిర్వహించనున్నట్లు బుక్ ఫెయిర్ అధ్యక్షులు జూలూరు గౌరీశంకర్ తెలిపారు. ఈ మేరకు హైదరాబాదులోని ఎన్టీఆర్ స్టేడియంలోని పుస్తక ప్రదర్శన ప్రాంగణంలో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పుస్తక మహోత్సవాన్ని రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించనున్నారని చెప్పారు. గత జనవరి మాసంలో కలకత్తాలో జరిగిన పుస్తక ప్రదర్శనను 29 లక్షలకు పైగా పుస్తక ప్రియులు సందర్శించారని, ఆ స్థాయికి హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఎదగాలన్నారు. జ్ఞాన తెలంగాణ నిర్మాణానికి పుస్తక ప్రదర్శనలను సాధనాలుగా తయారు చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్బంగా ఆయన 10 తేదీ నుంచి 18 వరకు జరిగే సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాల వివరాలను తెలిపారు. ఈ ప్రదర్శన రోజూ మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి ఎనిమిదిన్నర వరకు జరగనుందన్నారు.
శని, ఆదివారాలలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి తొమ్మిది వరకు ఉంటుందన్నారు. ఈ పుస్తక ప్రదర్శన ప్రాంగణానికి ప్రజా యుద్ధ నౌక గద్దర్ పేరును, వేదికకు సాహిత్య రంగానికి విసృత సేవలు అందించిన రవ్వా శ్రీహరి పేరును పెడుతున్నామని తెలిపారు. ద్వారానికి ఉర్దూ దినపత్రిక సియాసత్ మాజీ యండి జహీరొద్దీన్ అలీ ఖాన్ పేరు పెడుతున్నామన్నారు. పుస్తక ప్రదర్శన ప్రాంగణంలో తెలంగాణ అమర వీరుల స్మారకస్థుపాన్ని పెడుతున్నామని తెలిపారు. ఈ ప్రదర్శనలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రముఖ పబ్లిషర్స్ తో 365 స్టాల్స్ తో లక్షల పుస్తకాలు పుస్తక ప్రియులను అలరించనున్నాయన్నారు. అన్ని భాషలకు చెందిన పుస్తకాలు ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉంటాయన్నారు. పిల్లల్లో పుస్తక పఠనాభిలాషను పెంపొందించడానికి ప్రతిరోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం కార్యదర్శి ఆర్ వాసు మాట్లాడుతూ పిల్లలకు, ఉపాధ్యాయులకు, జర్నలిస్టులకు ప్రవేశం ఉచితమని చెప్పారు. ప్రతిరోజూ రెండు నుంచి నాలుగు గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, నాలుగు నుంచి ఎనిమిది గంటల వరకు సాహిత్య కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఈ సమావేశంలో బుక్ ఫెయిర్ ఉపాధ్యక్షులు నారాయణ రెడ్డి, కోయ చంద్రమోహన్, సంయుక్త కార్యదర్శి శోభన్ బాబు, కార్యవర్గ సభ్యులు సూరిబాబు, బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




