ఎర్రటి ఎండల్లో నెర్రలు బారిన
నేలల్లో వలసల్లా సాగుతోన్న దాహం!
నెత్తిన ఖాళీ బిందెలతో దూరాలు
జయించినా చెమటల్లో తప్ప నీటిని
నిజంగా చూడలేని నిస్సహాయత
ఒక్క చెలమ చెలిమి లేని ఒంటరి
ఇసుక దారుల్లో కన్నీటి పొరల్లోంచే
కానరాని నీటిజాడ కోసం అన్వేషణ!
చేతులు కాలాక ఆకులు పట్టినట్టు..
అమృత దారల్లాంటి వర్షపు నీళ్ళు
నేలపాలైన గాజు ప్రతిమలా వెక్కిరిస్తుంటే
ఆ ముత్యపు బిందువుల్ని గుదిగుచ్చి
భద్రంగా దాచుకొలేని నిర్లక్ష్య ఫలమిది
నదుల ఊపిరి తీసేలా ప్రవాహదారుల్ని
కాచి రిసార్టుల్ని గుండెలపై అదిమేసి
నదీమ తల్లిని ఎముకల గూడు చేసి
అడవుల్లో ఆటవిక రాజ్యం స్థాపించి
పచ్చదనాన్ని నల్లధనంగా మార్చేసి
నేలతల్లి గుండెల్లోకి ఎండిన బోర్లేసి
భూగర్బజలాలకు గర్భశోకం తెచ్చిపెట్టి
అవినీతి సంపాదనకే తప్ప సాగునీటికి
తాగునీటికి పథకాలు ప్రణాళికలు లేని
దూరదృష్టి రాహిత్యపు దురదృష్టాల్ని
వెంటేసుకొని ఎండిన బావుల చుట్టూ
ఆవురావురాని మూగే కాకులమయ్యేం!
ఖాళీ బిందెలు బీళ్లు పడిన నేలలు
ఎండిన గొంతుకలతో
పాడిపంటలు కరువై
ఎడారి కష్టాలై తడారిన బతుకులయ్యాయి
పరిసరాలు ఎండి గుండె తడి ఆవిరయ్యేక
ఇకనైనా మనం కళ్ళు తెరవాలి తప్పదు!
ప్రతి నీటి బిందువు సాక్షాత్తూ అమృత
బిందువేనని గుర్తించి నీటిని పూజించాలి..
(నేడు ప్రపంచ జల దినోత్సవం)
 – భీమవరపు పురుషోత్తమ్‌,
రాజమండ్రి, 9949800253 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *