- పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టి ప్రభుత్వ విధానాలు కావు..
- చిన్న, మధ్య తరహా వ్యాపారులను చంపే ఆయుధాలు
- దేశ సంపద కొద్ది మంది కార్పొరేట్లకు అప్పగించే ప్రయత్నం
- ప్రస్తుతం నాయకులకు ప్రజల సమస్యలు వినే ఆసక్తి లేదు
- భారత్ జోడో యాత్ర హరియానాలోకి ప్రవేశించిన సందర్భంగా సభలో రాహుల్ గాంధీ
ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, డిసెంబర్ 21 : భారత్ జోడో యాత్ర ప్రధాన ఉద్దేశ్యం దేశంలో ప్రజల మధ్య నానాటికీ పెరుగుతున్న ద్వేషానికి వ్యతిరేకంగా అయినా నిరుద్యోగం, ద్రవ్యోల్బణం కూడా దేశాన్ని దెబ్బతీస్తున్నాయని రాహుల్ గాంధీ అన్నారు. బుధవారం యాత్ర రాజస్థాన్‌లో ముగించుకుని హరియానాలో ప్రవేశించిన సందర్భంగా ఉదయం ఆరు గంటలకు నూహ్ వద్ద ఏర్పాటు చేసిన సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ…ప్రస్తుతం దేశం ఎదుర్కుంటున్న అతిపెద్ద సమస్యల్లో నిరుద్యోగం ఒకటని, యాత్ర సందర్భంగా ఉద్యోగాలు లేని వృత్తిపరమైన అర్హత కలిగిన ఎంతోమంది నిరుద్యోగులను తాను కలువడం జరిగిందని తెలిపారు. కొంత మంది డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు కావాలనుకునే యువకులను కూడా కలిశానని వారికీ తమ కలలు నెరవేరి తాము కోరుకునే ఉద్యోగాలు దక్కే అవకాశం లేదని అన్నారు. ఇక ధరల పెరుగుదలపై మాట్లాడుతూ..
ఇంతకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ ద్రవ్యోల్బణం గురించి పదేపదే ప్రస్తావించేవారని అయితే ప్రస్తుతం ఆయన పాలనలో వంట గ్యాస్ ధర, పెట్రోల్ ధరలు అనేక రెట్లు పెరిగినా మాట్లాడటం లేదని అన్నారు. తమ హయాంలో గ్యాస్ ధర రూ.400 ఉంటే ఇప్పుడు అది 1200 అయిందని, అలాగే పెట్రోల్ ధర 60 ఉంటే ఇప్పుడు 100 దాటిందని అన్నారు. దేశ సంపద మొత్తం కొన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నం జరుగుతున్నదని అన్నారు. పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టి ప్రభుత్వ విధానాలు కావని అంటూ వాటిని చిన్న, మధ్యతరహా వ్యాపారులను చంపే ఆయుధాలుగా రాహుల్ అభివర్ణించారు. ప్రస్తుతం నాయకులు ప్రజల సమస్యలు వినేందుకు ఆసక్తి చూపడం లేదని దాంతో వారి మధ్య అంతరం పెరుగుతున్నదని తెలిపారు. తన యాత్ర ద్వారా ఆ అంతరాన్ని తగించే ప్రయత్నం చేస్తున్నానన్నారు.
తాము యాత్ర సందర్భంగా చాలా దూరం నడుస్తామని, వారి సమస్యలను ఓపికతో వింటామని, అదే రోజు చివరలో కొద్ది సేపు ప్రసంగిస్తామని అన్నారు. ఈ సందర్భంగా ఇక నుంచి కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పార్టీ నేతలు నెలకు కనీసం ఒకసారి ప్రజలతో కలిసేలా చూడాలని పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు సూచించారు. యాత్ర సందర్భంగా తన పట్ల ప్రజలు చూపిన ప్రేమ, మద్దతుతో తాను ఎంత దూరం నడిచినా అలసట అనిపించలేదని రాహుల్ గాంధీ అన్నారు. ఈ సమావేశంలో రాహుల్‌తో పాటు రాజస్థాన్, హర్యానా రాష్ట్రాలకు చెందిన పార్టీ నేతలు పలువురు పాల్గొన్నారు.
హరియానాలోకి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర రాజస్థాన్‌లో ముగించుకుని బుధవారం ఉదయం హరియానాలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా రాజస్థాన్-హరియానా సరిహద్దుపై నూహ్ వద్ద యాత్ర ఫ్లాగ్ సెర్మనీ నిర్వహించారు. ఝండాను రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆధ్యర్యంలో హరియానా కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయభాను మరియు భూపేంద్ర హూడాకు అందించారు. కాగా యాత్ర మొదటి విడుతలో 3 రోజులపాటు హరియానాలో కొనసాగనుంది. అనంతరం యాత్రకు 2023 జనవరి 2 వరకు విరామం ప్రకటించారు. నూహ్‌లో ఉదయం సభ అనంతరం ఓ వైపు మంచు కురుస్తుండగానే యాత్ర వేలాది మందితో ముందుకుసాగింది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర రాజస్థాన్‌లో ముగించుకుని బుధవారం ఉదయం హరియానాలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా రాజస్థాన్-హరియానా సరిహద్దుపై నూహ్ వద్ద యాత్ర ఫ్లాగ్ సెర్మనీ నిర్వహించారు. ఝండాను రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆధ్యర్యంలో హరియానా కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయభాను మరియు భూపేంద్ర హూడాకు అందించారు. కాగా యాత్ర మొదటి విడుతలో 3 రోజులపాటు హరియానాలో కొనసాగనుంది. అనంతరం యాత్రకు 2023 జనవరి 2 వరకు విరామం ప్రకటించారు. నూహ్‌లో ఉదయం సభ అనంతరం ఓ వైపు మంచు కురుస్తుండగానే యాత్ర వేలాది మందితో ముందుకుసాగింది.
ఉదయం 14 కిలోమీటర్ల మేర కొనసాగి ఫిరోజ్‌పూర్ ఝిర్కా అనాజ్ మార్కెట్ వద్ద ఆగింది. సాయంత్రం 4 గంటలకు తిరిగి ప్రారంభమయిన యాత్ర నాసిర్ బాస్ వరకు కొనసాగింది. పాదయాత్రలో రాహుల్ గాంధీ కొద్ది సేపు తనతో నడుస్తున్న మహిళలతో ముచ్చటిస్తూ ముందుకు సాగడం కనిపించింది. దారిలో మాజీ సైనికులు ఆయనకు ఆర్మీ జాకెట్ ధరింప జేశారు. కాగా యాత్రలో రాహుల్‌తో పాటు హరియానా కాంగ్రెస్ నేతలు పలువురు, పార్టీ కార్యకర్త్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పదం కలిపారు. కాగా డిసెంబరు 25న దిల్లీలో ప్రవేశించడానికి ముందు వొచ్చే మూడు రోజుల్లో యాత్ర హర్యానాలోని నుహ్, గురుగ్రామ్ మరియు ఫరీదాబాద్ ద్వారా కొనసాగనుంది. రాహుల్ గాంధీ నేడు గురువారం నుహ్ మరియు సోహ్నాలో బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు.




