జీవితాన్ని ఏ రకంగా చూసినా
దారి తెలియని పయనమే.
తీపి తరగని ఇష్టమే
అది ఏ వైపున నడిచినా
ఏ లోతును చూసినా
ఎంత ఎత్తును కొలిచినా
ఎంత పొడవునా తలచినా
ఎవరిని ఎప్పుడు మాటేసే
ఏ ప్రశ్న దాడి చేస్తుందో?
ఎవరిని వల విసిరి
ఏ సుఖం మాయ చేస్తుందో?
ఎప్పుడు ఏ బాధ వేటాడి వేధిస్తుందో?
ఎవరిని ఏ సాకు చూపి పగ చేస్తుందో?
ఏ క్షణములో ఏ బుద్దికి బానిసై
ఏ మలుపు తిప్పునో!
ఏ మలుపు కటికమై
ఏ విలయం దాల్చునో!
తెలుసుకుని మలసుకునే లోగె
మలచుకుని గెలుచుకునే లోగే
గతం అడుగులో వర్తమానం
తప్పు ఒప్పులని గ్రహించే లోపే
కాలం మనసుకు పులిమే
రంగుల అందంలో అర్దం కాలేక
మనసును మత్తులో త్రోసిన
ఆశ తోడును అంచనా వేయలేక
వయసు సాధించిన అనుభవం
మనసుకంది ఆచరించే సమయానికి
నాదనుకున్న మనసే నాకే కరువు
నాదనుకున్న బ్రతుకు నాలో బరువు
ప్రేమించి ఊహించే లోకంలో
ధ్యానించి పూజించే కలలో
ఏ రంగుది అసలు కాదేమో!
ఏ నిజం శాశ్వతం కాదేమో!
కాలం వికటించినా
కష్టాలకు పదునెక్కిన బ్రతుకులో
అనుభవం చెప్పే పాఠాన్ని
జీవితం ఎంతవరకు అప్పచెబుతుందొ ?
-శ్రీసాహితి




