- హాజరు కానున్న మంత్రులు
- సంప్రదాయ సిద్ధంగా కొనసాగుతున్న జాతర
- దేవతలకు ప్రత్యేక పూజలు చేసిన మోస్రం వంశీయులు
ఆదిలాబాద్, ప్రజాతంత్ర, జనవరి 23 : నాగోబా జాతరలో భాగంగా మూడవ రోజు..పెర్సాపేన్, భాన్ దేవతలకు మెస్రం వంశీయులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో డోలు, పెప్రే, కాలీకోమ్ ఆదివాసీ వాయిద్యాలను వాయిస్తూ ఘనంగా పూజలు నిర్వహించారు. నాగోబా జాతరలో సోమవారం కొత్త కోడళ్లు కొత్త పుట్టకు పూజలు చేపట్టారు. సమ్మక్క-సారలమ్మ జాతర తర్వాత..ఆదివాసీల అతిపెద్ద పండగే..ఈ నాగోబా జాతర. ఆదివాసీ, గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబంగా ఈ జాతర నిర్వహిస్తారు. మూడు రాష్ట్రాల నుంచి లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు..స్వామివారికి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కొత్తగా భేటింగ్ అయిన కొత్త కోడళ్లు మర్రిచెట్టు దగ్గర ఉన్న బావి నుంచి పవిత్ర జలం తీసుకొచ్చి.. భాన్ దేవత ఆలయం ముందు ఉన్న పాత పుట్టను తొలగించి.. కొత్త పుట్టను తయారుచేసి పూజ కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీ.
ఇచ్చోడ మండలం సిరికొండ నుంచి తెచ్చిన మట్టి కుండల్లో నవ ధాన్యాలు బెల్లం, పప్పు, పిండి, బియ్యంతో నైవేద్యాన్ని తయారు చేసి కుల దేవతలకు మొక్కి నైవేద్యాన్ని సమర్పించారు. ఇక నేడు మంగళవారం నిర్వహించే గిరిజన దర్బార్..నాగోబా జాతరలో మరో ప్రత్యేకం. ఈ దర్బార్‌కు మంత్రి సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్సీ కవితతో పాటు స్థానిక నేతలు, అధికారులు హాజరవుతారు. కొండలు, కోనలు దాటి వొచ్చే గిరిజనుల సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు 1946 ఈ దర్బార్‌ను కొనసాగిస్తున్నారు. మెస్రం వంశీయులు ఆచార సంప్రదాయాలు పాటిస్తూ నాగోబాను స్మరిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. జాతరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి ఆదివాసీలు, గిరిజనేతరులు భారీగా తరలివచ్చారు. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ల నుంచి గిరిజనులు పెద్దఎత్తున వొచ్చారు. ఆదివారం నాగోబా జాతరకు కేంద్ర గిరిజనశాఖ మంత్రి అర్జున్ ముండా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసి పంపితే ఆలయ అభివృద్ధికి నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నారు కేంద్ర మంత్రి.





