ధ్యానజగత్ సాకారానికి ఐకమత్యంతో ముందుకు సాగాలి

పిరమిడ్ ట్రస్ట్ చైర్మన్ కోరుప్రోలు విజయభాస్కర్ రెడ్డి
బ్రహ్మర్షి పితామహ పత్రీజీ లక్ష్యమే మన అందరి లక్ష్యం
పత్రీజీ కూతురు, పిఎస్ఎస్ఎం గ్లోబల్ ఫౌండర్ పరిమళ పత్రీ
ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 26 : 2030 కల్లా ధ్యాన జగత్ కల సాకారం అయ్యేలా ధ్యానులు ఐకమత్యంతో ఉండి పిరమిడ్ స్పిచువల్ సొసైటీని మూవ్మెంట్ ను ముందుకు తీసుకెళ్లాలని ది హైదరాబాద్ పిరమిడ్ స్పిచువల్ ట్రస్ట్ చైర్మన్ కోరుప్రోలు విజయభాస్కర్ రెడ్డి అన్నారు. భవిష్యత్తులో కైలాసపురి షిరిడి క్షేత్రం వలే విరాజిల్లుతుందని పత్రీజీ చెప్పేవారని గుర్తు చేశారు. ఈ మేరకు ది హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో 11 రోజులపాటు(డిసెంబర్ 21 నుంచి 31) కడ్తాల్ మహేశ్వర పిరమిడ్ లో జరుగుతున్న పత్రీజీ ధ్యాన మహాయాగం వేడుకలు మంగళవారం ఆరవ రోజుకు చేరుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది ధ్యానులు హాజరై పత్రీజీ శక్తి స్థల్ కు ధ్యానంతో నివాళ్లర్పిస్తున్నారు. ఉదయం 5 గంటల నుంచి 8 వరకు నిర్వహిస్తున్న ప్రాతఃకాల ధ్యానానికి వేల మంది పిరమిడ్ మాస్టర్లు హాజరయ్యారు. ఈ సందర్బంగా ధ్యాన మహా యాగంలో దత్తాత్రేయ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దత్త పౌర్ణమి సందర్భంగా ప్రత్యేకంగా పిరమిడ్ లో 9 నుంచి 12 గంటల వరకు సామూహిక ధ్యానం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ టీవీ 9 చైర్మన్ రామేశ్వరరావు కైలాసపురి పిరమిడ్ వద్దకు రావడం ఎస్ఎస్ఎంకు గొప్ప విజయం అని కొనియాడారు. రూ.1కోటి విరాళం ప్రకటించడం శుభ పరిణామం అన్నారు. తమ శక్తి మేరకు లక్షల మందికి భోజన, వసతి ఏర్పాట్లు చేశామని అన్నారు. విశాఖపట్నంకు చెందిన అప్పలనాయుడు, రెడ్డి నాయుడు సోదరులు రూ.5 లక్షలు అన్నదాన కార్యక్రమానికి విరాళంగా అందజేశారు. పరిమళ పత్రీ మాట్లాడుతూ పత్రీజీ లక్ష్యమే మన లక్ష్యం అని, కొత్తవారికి మార్గదర్శకంగా అత్యంత ఐకమత్యంతో క్రమశిక్షణగా ముందుకు సాగాలన్నారు. ధ్యాన మహా యాగం గ్రాండ్ సక్సెస్ అయ్యిందని హర్షం వ్యక్తం చేశారు. త్వరలోనే ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి కూడా కైలాసపురికి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే యేడుకల్లా 365 రోజులు ధ్యానులతో కైలాస పూరి కళకళలాడేలా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. భూ మండలం సుఖ, సంతోషాలతో విరాజిల్లాలంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి నాలుగు శక్తి పీఠాలుగా బెంగళూరు పిరమిడ్, కడ్తాల్ పిరమిడ్, పేరవరం వశిష్ట గౌతమి పిరమిడ్, అనంతగిరి ప్రకృతి వ్యాలి అభివృద్ధి చెందాలని పత్రీజీ చెప్తూ ఉండేవారని అన్నారు. కైలాస పూరి మహిళలకు తల్లిగారింటి వంటిదని, ప్రతి సంవత్సరం తప్పక హాజరు కావాలని  అన్నారు. పత్రీజీ గురువు సదానంద యోగి జీవిత చరిత్రపై పూర్ణిమ, లక్ష్మి నారాయణమ్మలు రచించిన పుస్తకాన్ని ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఈ సందర్బంగా కళాకారులు చేసిన నృత్యాలు, సంస్కృతిక కార్యక్రమాలు ధ్యానుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పిఎంసి ట్రస్ట్ చైర్మన్ దాట్ల హనుమంతరాజు, ఎండి బాలకృష్ణ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు నవకాంత్, ఆనంద్, విజయలక్ష్మి, రాయజగపతి రాజు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *