ధర్నా చేస్తుంటే రైతుల్ని పట్టించుకోరా?

డిమాండ్లు పరిష్కరించాలని మాత్రమే అడుగుతున్నారు
కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రైతుల కోసం ‘‘ఎంఎస్‌పీ’’ చట్టం
కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌గాంధీ

న్యూదిల్లీ, ఫిబ్రవరి 13 : డిమాండ్ల పరిష్కారం కోసం ఢల్లీిలో   నిరసన చేపడుతున్న అన్నదాతలపై టియర్‌ గ్యాస్‌ ప్రయోగించడాన్ని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌గాంధీ  తప్పుపట్టారు. రాహుల్‌ చేపట్టిన భారత్‌ జోడో న్యాయ యాత్ర ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో కొనసాగుతోంది. తాజాగా ఆయన ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ రైతులు చేపట్టిన చలో ఢల్లీి కార్యక్రమంపై స్పందించారు. రైతులు  కేవలం తమ డిమాండ్లు పరిష్కరించాలని మాత్రమే అడుగుతున్నారని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం ఎంఎస్‌ స్వామినాథన్‌కు  భారతరత్న ప్రకటించారు కానీ ఆయన చెప్పిన దానిని అమలు చేయడానికి మాత్రం సిద్ధంగా లేరని విమర్శించారు. రైతుల డిమాండ్లు న్యాయబద్ధమైనవి అని పేర్కొన్నారు. కానీ బీజేపీ ప్రభుత్వం మాత్రం దానిని అమలు చేయడానికి సిద్ధంగా లేదని చెప్పుకొచ్చారు.

ఇండియా కూటమి అధికారంలోకి రాగానే రైతుల హామీలు నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు స్వామినాథన్‌ చెప్పినట్లుగా అమలు చేస్తామని రాహుల్‌ భరోసా ఇచ్చా రు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే స్వామినాథన్‌ కమీషన్‌ ప్రకారం పంటకలు మద్దతు ధర(ఎంఎస్‌పీ)పై చట్టం చేస్తామని మంగళవారం హామీ ఇచ్చారు. ఈ ప్రకటన చారిత్రాత్మకమని, 15 కోట్ల మంది రైతు కుటుంబాలకు భరోసా కల్పించడం ద్వారా వారి జీవితాలను మారుస్తామని రాహుల్‌ గాంధీ అన్నారు. న్యాయమార్గంలో కాంగ్రెస్‌ మొదటి హామీ ఇదే అని ఆయన అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌ జిల్లాలో జరిగిన ‘భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర’లో భాగంగా కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున్‌ ఖర్గే కూడా ఇలాంటి హామీలు ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *