యోగా దినోత్సవంలో పాల్గొన్న కేంద్ర మంత్రులు
హరిద్వార్‌లో రాందేవ్ బాబా యోగాసనాలు
సైకతశిల్పంతో యోగా ఆవశ్యకతను చెప్పిన సుదర్శన్ పట్నాయక్
యోగాలో పాల్గొన్న వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు
న్యూ దిల్లీ, జూన్ 21 : దేశ వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. నాగ్‌పూర్‌లో జరిగినయోగా డేలో కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. వేల సంఖ్యలో వచ్చిన ప్రజలతో కలిసి ఆయన యోగాసనాలు వేశారు. కేంద్రమంత్రులు పలువురు పీయూష్ గోయల్, అశ్వినీ వైష్ణవ్, స్పీకర్ ఓంబిర్లా తదితరులు పాల్గొన్నారు. మంచుకొండల్లో సైన్యంయోగా చేసింది. చలికి వణకకుండా వారు యోగాసనాలు వేశారు. ప్రపంచంలోనే అత్యంత పురాతన విశ్వవిద్యాలయంగా పేరుగాంచిన బీహార్‌లోని నలంద మహావిహారలో ఇంటర్నేషనల్ యోగా దినోత్సవ వేడుకల్లో ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో కేంద్రం విద్యుత్ శాఖ మంత్రి ఆర్కె సింగ్ పాల్గొన్నారు. 700 మందితో ఆయన యోగాసనాలు వేయించారు. సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు.
వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజలు..వరుస క్రమంలో కూర్చోని యోగాసనాలు వేశారు. ఈ వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు పాల్గొని యోగాసనాలు వేశారు. 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఢిల్లీలోని తన నివాసంలో యోగాసనం వేశారు. యోగాభ్యాసం తన జీవితంలో భాగమని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. యోగా దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికి మంచి ఆరోగ్యం చేకూరాలని కోరుకుంటున్నట్లు రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. హర్యానాలోని కురక్షేత్రలో యోగా డే వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో కేంద్ర మంత్రి పీయూల్ గోయల్ పాల్గొని యోగాసనాలు వేశారు. గుజరాత్ లో జరిగిన అంతర్జాతీయ వేడుకల్లో కేంద్ర ఆరోగ్య మంత్రి డా. మన్సుఖ్ మాండవియా పాల్గొన్నారు. కెవాడియాలోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద ఆయన యోగా చేశారు. హిమాచల్ ప్రదేశ్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవ సంబరాలు అంబరా న్నంటాయి. కాంగ్రా కోట వద్ద జరిగిన ఇంటర్నేషనల్ యోగా డేలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పాల్గొన్నారు. వజ్రాసనం, పద్మాసనాలు వేసి అలరించారు. యోగా డే సందర్భంగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఫతేపూర్ సిక్రీలోని పంచ్ మహల్ వద్ద కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ యోగా చేశారు.
హరిద్వార్‌లో రాందేవ్ బాబా యోగాసనాలు
అంతర్జాతీయ యోగా దినోత్సవం 2022 సందర్భంగా యోగా గురు రామ్‌దేవ్ హరిద్వార్‌లోని పతంజలి యోగపీఠ్‌లో యోగా చేశారు. ఈ కార్యక్రమానికి వందల సంఖ్యలో చిన్నారులతో పాటు పలువురు హాజరయ్యారు. రాందేవ్ బాబాను అనుకరిస్తూ యోగా చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2022 యొక్క థీమ్ ’యోగా ఫర్ హ్యుమానిటీ’. దేశవ్యాప్తంగా 75 దిగ్గజ ప్రదేశాలలో యోగా దినోత్సవాన్ని జరుపుకోనున్నారు. ఒడిశా రాష్ట్రం పూరీ తీరాన అంతర్జాతీయ యోగా దినోత్స వేడుకలు ఘనంగా జరిగాయి. యోగా డేను పురస్కరించుకుని ప్రఖ్యాత సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ సాండ్ ఆర్ట్‌ను రూపొందించాడు. ప్రధాని మోడీ యోగా చేస్తున్నట్లుగా ఇసుకతో బొమ్మను రూపొందించాడు. సూర్య నమస్కార్, యోగా డే అని సైకత శిల్పంపై రాశాడు. మోడీ సైకత శిల్పం దగ్గరకు పెద్ద సంఖ్యలో స్థానికులు చేరుకుని యోగా చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని 2015 నుండి ఏటా జూన్ 21న జరుపుకుంటున్నారు. పలు రాష్టాల్ర ముఖ్యమంత్రులు సైతం యోగా వేడుకల్లో పాల్గొన్నారు. వీరిలో ముఖ్యంగా అస్సాం సీఎం హేమంత బిశ్వ శర్మ, హర్యానా ముఖ్యమంత్రి ఖట్టర్, హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం థాకూర్, ఛత్తీస్ ఘడ్ సీఎం భూపేశ్ భగేల్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజీవ్రాల్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామితో పాటు మరికొందరు రాష్ట్ర సీఎంలు యోగా డే పాల్గొని, వివిధ ఆసనాలు వేశారు.

