- వర్ధంతి సందర్భంగా సిఎం రేవంత్ ఘన నివాళి
- పాల్గొన్న దీపాదాస్ మున్షి, భట్టి, కాంగ్రెస్ నాయకులు
- ‘నీ కలలు..జ్ఞాపకాలు..’ ఎల్లప్పుడు మదిలో ఉంటాయి : తండ్రికి రాహుల్ నివాళి
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 21 : రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని, ప్రధానిగా ఐటీ రంగ వృద్ధికి రాజీవ్ గాంధీ బాటలు వేశారని సీఎం రేవంత్‌రెడ్డి కొనియాడారు. నగరంలోని సోమాజి గూడలో రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ఆయన విగ్రహానికి నివాళి అర్పించారు. ప్రధానిగా దేశానికి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, జానారెడ్డి, వి.హనుమంతరావు, షబ్బీర్ అలీ, పార్టీ రాష్ట్ర వ్యవహవారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజీవ్‌గాంధీ విగ్రహానికి నివాళి అర్పించారు. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ అక్కడి న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద నిర్వహించిన వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
నీ కలలు..జ్ఞాపకాలు..ఎల్లప్పుడు మదిలో ఉంటాయి : తండ్రికి రాహుల్ నివాళి
నాన్నా, మీ కలలు, నా కలలు, మీ ఆకాంక్షలు, నా బాధ్యతలు. మీ జ్ఞాపకాలు, ఈ రోజు మరియు ఎల్లప్పుడూ, ఎల్లప్పుడూ నా హృదయంలో ఉంటాయి’’ అంటూ మంగళవారం తండ్రి రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి సందర్భంగా ఆయనతో తన జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ తండ్రితో పాటు ఉన్న తన చిన్ననాటి ఫోటోను రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, పార్టీ ప్రధాన నేత, తల్లి సోనియా గాంధీలతో కలిసి రాజీవ్ గాంధీకి వీర్ భూమి వద్ద నివాళులర్పించారు.





