- పేదలను ఆదుకోవాలనేదే కెసిఆర్ ఆలోచన
- దుండిగల్‌లో ‘డబుల్’ ఇళ్ల పంపిణీలో మంత్రి కెటిఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 21 : దిల్లీ, బెంగళూరు నుంచి వొచ్చిన వాళ్లు ఇచ్చే హామీలను నమ్మి మోసపోవద్దని ప్రజలకు మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. పేదలను బ్రహ్మాండంగా ఆదుకోవాలని సిఎం కేసీఆర్ ఆలోచన చేస్తున్నారని, ఆ విషయాలను తొందరలోనే సీఎం చెబుతారని మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం దుండిగల్‌లో రెండో విడత డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ…కాంగ్రెస్ వాళ్లు ఇదివరకు ఏం చేసిండ్రో చెప్పలేక కొత్త రూపాల్లో వొస్తున్నారని, ఇష్టమొచ్చినట్లు హామీలు ఇస్తున్నారని అన్నారు. వాళ్లు ఇచ్చిన హామీలు నమ్మి మోసపోదామా? అనినాయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. ప్రజలు, రైతులపై కేసీఆర్ కంటే ఎక్కువ ప్రేమ ఉన్న నాయకులు భారతదేశంలో ఎవరైనా ఉన్నారా అని ఆలోచించుకోవాలని, తొందర పడవొద్దని సూచించారు. వాళ్లు చెప్పినదానికంటే ఎక్కువగానే సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని కేసీఆర్‌కు కూడా ఉందని అన్నారు.
తప్పకుండా వాళ్లు చెప్పినదానికంటే ఎక్కువగానే పేదలను ఆదుకోవాలని కేసీఆర్ ఆలోచన చేస్తున్నారని తెలిపారు. ఆ విషయాలను తొందరలోనే సీఎం కేసీఆర్ స్వయంగా చెబుతారని పేర్కొన్నారు. రాష్ట్రం కొత్తగా ఏర్పాటైనప్పటికీ ఈ తొమ్మిదేండ్లలో అభివృద్ధి, సంక్షేమంలో జోడెద్దుల మాదిరిగా తెలంగాణ రాష్ట్రం ప్రగతి బాటలో ముందుకెళ్తున్నదని అన్నారు. ఒకప్పుడు హైదరాబాద్‌లో ఏ బస్తీకి పోయినా మంచి నీళ్ల కోసం లొల్లి ఉండేదని, ఖైరతాబాద్ జలమండలి ముందు నుంచి వెళ్దామంటే నాయకులకు భయమయ్యేదని, ఎప్పుడు చూసినా ఖాళీ బిందెలు, ఖాళీ కుండలు పెట్టి ధర్నాలు చేసేవాళ్లని కాంగ్రెస్‌ను విమర్శించారు.
ఇక కరెంటు గోస చెప్పక్కర్లేదని, అపార్ట్‌మెంట్ కిందకు వెళ్తే డీజిల్ కంపుతో ముక్కులు పగిలిపోయేవన్నారు. ఇన్వర్టర్లు, జనరేటర్లు లేకపోతే జ్యూస్ స్టాల్, జిరాక్స్ సెంటర్లు నడుపుకోలేని పరిస్థితి ఉండేదని, గణేశ్ పండగ వొచ్చిందంటే వారం రోజులు కర్ఫ్యూ కంపల్సరీగా ఉండేవని అన్నారు. ఇవాళ ఆ పరిస్థితులు ఉన్నాయా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగున్నాయని..మంచినీళ్ల సవులత్ మంచిగైందని.. రోడ్లు బాగైనయని..పేదలకు కడుపు నిండే విధంగా పింఛన్ వొస్తున్నదని.. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వొస్తున్నాయని తెలిపారు. ఇన్ని పనులు చేసుకుంటూ ముందుకుపోతున్న ఈ ప్రగతి చక్రాలను ఆపేందుకు..వాటికి అడ్డుకట్ట వేసేందుకు ఎన్నికల ముందు కొంతమంది సంక్రాంతికి గంగిరెద్దు వొచ్చినట్టుగా వొచ్చి ఇష్టమొచ్చినట్టు మాటలు చెప్తున్నారని ఎద్దేవా చేశారు. అలాంటి వాళ్ల మాటలకు మోసపోవద్దని ప్రజలకు మంత్రి కెటిఆర్ విజ్ఞప్తి చేశారు.




