తొలి హావిూని అమలు చేసిన ఘనత ఆర్టీసీదే

ఉద్యమంలో ఆ కార్మికులది కీలక పాత్ర
మంత్రులు పొన్నం, సీతక్కలతో కలిసి కొత్తగా వంద బస్సులను ప్రారంభించిన సిఎం రేవంత్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10 : ప్రభుత్వ హావిూని తొలిసారి అమలు చేసింది ఆర్టీసీ కార్మికులేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. టీఎస్‌ ఆర్టీసీ కొత్తగా అందుబాటులోకి తెచ్చిన 100 ఆర్టీసీ బస్సులను శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో సీఎం ప్రారంభించారు. ఎన్టీఆర్‌ మార్గ్‌లో 100 కొత్త బస్సులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్‌, సీతక్కలతో కలిసి రేవంత్‌రెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పుడు కొత్త బస్సులు ప్రారంభించుకుంటున్నామని, తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులది కీలక పాత్ర అని, ఆర్టీసీ పాత్ర ఎవరు మర్చిపోరని కొనియాడారు. ఉద్యమాన్ని ఆర్టీసీ కార్మికులు ముందుండి నడిపించారని గుర్తు చేశారు.

రాష్ట్రం ఏర్పడితే తమ సమస్యలు పరిష్కారమవుతాయని వారు ఆశించారని, కానీ అలా జరగలేదన్నారు. సమస్యల పరిష్కారం కోసం కార్మికులు చేసిన ఆందోళనలో 36 మంది చనిపోయారని, అయినా గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మెకు దిగారని ఆర్టీసీ కార్మిక సంఘాలను నాటి సీఎం రద్దు చేశారని సిఎం దుయ్యబట్టారు. గత  ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి వారి కృషి ఏంతో ఉందన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించామని తెలిపారు. గత ప్రభుత్వం రూ.2.97లక్షల కోట్లతో బడ్జెట్‌ ప్రవేశపెట్టిందని, కానీ తాము వాస్తవ లెక్కలతో బడ్జెట్‌ రూపొందించామన్నారు. గతేడాది కంటే రూ.15వేల కోట్లు తక్కువతో బడ్జెట్‌ ప్రవేశపెట్టామని సీఎం తెలిపారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్‌, ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *