తెలంగాణ నుండే లోక్‌సభ ఎన్నికల శంఖారావం

  • పాంచ్‌ న్యాయ్‌ .. పచ్చీస్‌ గ్యారంటీస్‌
  •  దిల్లీ పీఠానికి చేరుస్తాయని కాంగ్రెస్‌ నమ్మకం
  •  భారీ ఎత్తు చేరికలకు వేదికయ్యే అవకాశం

(మండువ రవీందర్‌రావు,  ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి)
లోకసభ ఎన్నికల శంఖారావం తెలంగాణ నుండే ప్రారంభించాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. దిల్లీలోని పార్టీ కార్యాలయంలో ముందస్తుగా శుక్రవారం పార్టీ మ్యానిఫోస్టోను విడుదల చేసినప్పటికీ, మొదటి సారిగా ఆ మ్యానిఫెస్టో వివరాలను దేశ ప్రజలకు తెలంగాణ వేదికగా వివరించేందుకు సన్నాహాలు చేస్తుంది. అందుకు తుక్కుగూడ సెంటిమెంటును వాడుకుంలుంది. గత సంవత్సరం జరిగిన శాసనసభ ఎన్నికల సందర్భంగా ’విజయభేరి ర్యాలి’ని కాంగ్రెస్‌ పార్టీ తుక్కుగూడను వేదికగా మల్చుకుంది. గత సెప్టెంబర్‌ 17 ఇదే వేదికగా మ్యానిఫెస్టోతో పాటు. ఆరు గ్యారంటీలను కాంగ్రెస్‌ విడుదల చేసింది. కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ చేతుల మీదుగా విడుదల చేసిన ఈ ఆరు గ్యారంటీలను వందరోజుల్లో ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీలన్నిటినీ అమలుపరుస్తూ వొచ్చింది. మధ్యలో లోకసభ ఎన్నికల షెడ్యూల్‌ రావడంవల్ల కొన్ని గ్యారంటీలు ప్రజల ముందుకు వెళ్ళే విషయంలో జాప్యం జరుగుతున్నప్పటికీ ప్రజల్లో మాత్రం ఈ గ్యారంటీలపైన నమ్మకం ఏర్పడిరది. తెలంగాణ ఎన్నికలకు ముందు కర్ణాటకలో ఇలాగే అయిదు గ్యారంటీలపై హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ అక్కడ అధికారంలోకి వొచ్చింది.

ఆ తర్వాత తెలంగాణలో కూడా ఆరు గ్యారంటీలతో అధికారంలోకి వొచ్చింది. ఈ గ్యారంటీలన్నవి ప్రజలకు ఎంత వరకు చేరుతున్నాయన్న విషయాన్ని పక్కకు పెడితే వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ను మాత్రం అధికారంలోకి తీసుకు వచ్చాయన్నది నిజం. అందుకే కాంగ్రెస్‌ కేంద్ర నాయకత్వం కూడా గ్యారంటీలతో ఎర్రకోటపైన తిరిగి కాంగ్రెస్‌ జండాను ఎగురవేస్తామని నమ్మకంగా ఉంది. అందుకోసం ప్రత్యేక మ్యానిఫెస్టోతో పాటు, అయిదు అనూహ్య గ్యారంటీలను ప్రవేశపెట్టింది. అందులో బాగమే ‘పాంచ్‌ న్యాయ్‌.. పచ్చీస్‌ గ్యారంటీస్‌’ పేర శుక్రవారం దిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే మ్యానిఫెస్టో విడుదల చేసిన సందర్భంగా సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ తదితరులు పాల్గొన్నారు. సామాజిక న్యాయంతోపాటు రైతులు, కార్మికులు, యువతకు, మహిళలకు న్యాయంపేరిట గ్యారంటీలు అమలుకు కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. ప్రకటించిన అయిదు న్యాయ్‌ విధానాల ఒక్కోదాని కింద మరో అయిదు అంశాలతో మొత్తం ఇరవై అయిదు అంశాలను కాంగ్రెస్‌ వాటిల్లో పొందుపర్చింది.

‘హిస్సేదారి న్యాయ్‌’లో సామాజిక ఆర్థిక కులగణన, ఎస్సీ, ఎస్టీ ఓబిసి రిజర్వేషన్‌లపైఉన్న 50 శాతం సీలింగ్‌ తొలగింపు, జల్‌ జంగల్‌ జమీన్‌పై చట్టబద్ద హక్కులు, గిరిజనులు ఎక్కువున్న ప్రాంతాలను షెడ్యూల్‌ ఏరియాలుగా గుర్తిస్తామన్నారు. ‘కిసాన్‌ న్యాయ్‌’ కింద కూడా మరో అయిదు అంశాలను పొందుపర్చారు. స్వామినాథన్‌ కమిటి సిఫారసుల మేరకు పంటకు గిట్టుబాటు ధర చట్ట భద్రత కల్పించడం, రుణమాఫీకి కమిషన్‌ను ఏర్పాటు చేయడం, పంట నష్టపోయిన 30 రోజుల్లో బీమా పరిహారం చెల్లింపు, రైతులు లబ్ధి పొందేలా ఎగుమతి, దిగుమతుల విధానం, వ్యవసాయ పరికరాలపైన జిఎస్టీ మినహాయింపు. ఇక ‘యువన్యాయ్‌’లో 30 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించడం, యువతకు ఏడాదికి లక్ష రూపాయల అప్రెంట్‌షిప్‌ చెల్లింపులు, పరీక్షా పేపర్లు లీక్‌ను అరికట్టే విధంగా కఠినచర్యలు, గిగ్‌ వర్కర్ల సామాజిక భద్రతకు చర్యలు, యువత స్టార్టప్‌కోసం 5 వేల కోట్ల నిధి కేటాయింపు, ‘శ్రామిక న్యాయ్‌’కింద ఆరోగ్య భద్రతా చట్టం, ఉపాధి హామీతో పాటు, కనీసం వేతనంలో నాలుగు వందల రూపాయల పెంపు, పట్టణ ప్రాంతంలో ఉపాధి హామీ అమలు, అసంఘటిత రంగ కార్మికుల జీవిత బీమా, యాక్సిడెంట్‌ బీమా సౌకర్యం, ప్రభుత్వంలో కాంట్రాక్టు ఉద్యోగాల నిలుపుదల చేయనున్నట్లు కాంగ్రెస్‌ ప్రకటించింది.

ఇక చివరగా ‘నారీ న్యాయ్‌’ కింద పొందుపర్చిన అంశాల్లో ముఖ్యంగా ప్రతీ పేద కుటుంబంలోని మహిళకు ఏడాదికి లక్ష రూపాయలివ్వడం, కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ను కల్పించడం, ఆశ, అంగన్‌వాడి, మిడ్‌ డే మీల్‌ వర్కర్స్‌కు రెండిరతల వేతన కంట్రీబ్యూషన్‌, మహిళా హక్కుల రక్షణకోసం అధికార మైత్రి ఏర్పాటు, వర్కింగ్‌ వుమెన్‌ కోసం సావిత్రీ బాయిపూలె పేరుతో హాస్టళ్ళ సంఖ్యను పెంచడం లాంటి అంశాలను కాంగ్రెస్‌ ఆ అయిదు అంశాల్లో పొందుపర్చింది. వాటిని వివిధ రాష్ట్రాలకుగాను ఆయా ప్రాంతీయ భాషల్లో తర్జుమా చేస్తున్నారు. కాగా శనివారు తుక్కుగూడ లోకసభ ఎన్నికల శంఖారావంలో వీటిని తెలుగులో విడుదల చేయబోతున్నారు. జన జాతర సభగా ఏర్పాటు చేస్తున్న తుక్కుగూడ సభను కనీసం పది లక్షల మందితో నిర్వహించే విధంగా రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ సన్నాహాలు చేస్తుంది.

ఈ సభలో చారిత్రక మార్పులు సంభవించవచ్చనుకుంటున్నారు. ఇప్పటికే బిఆర్‌ఎస్‌ నుండి ప్రముఖ నాయకులు పలువురు కాంగ్రెస్‌ పార్టీలో చేరిపోయారు. ఈ సభ సందర్భంగా మరెంత మంది బిఆర్‌ఎస్‌ను వీడనున్నారన్న ఆందోళన మాత్రం లేకపోలేదు. చాలా మంది ఎంఎల్‌ఏలు తమతో టచ్‌లో ఉన్నారని మొదటి నుంచీ కాంగ్రెస్‌ నాయకత్వం చెబుతూనే ఉంది. దానికి తగినట్లుగా ఇప్పటికే కొందరు సిఎం  రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుస్తున్నట్లు చెబుతున్నా, వారంతా అవకాశంకోసం ఎదురుచూస్తున్నారన్నది ప్రచారంలోఉంది. వీరిలో సిఎంను ఇంతవరకు కలువని వారు కూడా అవకాశం కోసం ఎదురు చూస్తున్న వారున్నారు. ఏది యేమైన తుక్కుకూడా సభ కాంగ్రెస్‌కు పెద్ద మలుపు కాబోతున్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *