- విడుదల చేసిన సిఎం రేవంత్ రెడ్డి
- పేపర్-1లో 67.13 శాతం… పేపర్-2లో 34.1 శాతం మందికి అర్హత
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 12 : టీజీ టెట్ 2024 ఫలితాలను బుధవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విడుదల చేశారు. టీజీ టెట్-2024 పేపర్-1కు 57,725 మంది అర్హత సాధించగా, పేపర్-2కు 51,443 మంది అర్హత సాధించారు. పేపర్-1లో 67.13శాతం..పేపర్-2లో 34.18శాతం అర్హత సాధించారు. టెట్-2024లో అర్హత సాధించని దరఖాస్తుదారులకు వొచ్చే టెట్‌కు ఉచితంగా దరఖాస్తు చేసుకునే వెలుసుబాటు ప్రభుత్వం కల్పించింది. ఇక, టెట్-2024లో అర్హత సాధించిన వారికి ఒకసారి ఉచితంగా డిఎస్సికి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.
కాగా, గత మార్చి 15వ తేదీన టిజిటెట్ 2024 నోటిఫికేషన్ వెలువడగా..పేపర్-1కు 99,958 మంది, పేపర్-2కు 1,86,423 మంది దరఖాస్తు చేసుకున్నారు. మే 20వ తేదీన ప్రారంభమైన టెట్ పరీక్షలు జూన్ 2వ తేదీతో ముగిశాయి. పేపర్-1కి 86.03 శాతం మంది, పేపర్-2కి 82.58 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. పేపర్-1లో 67.13 శాతం మంది, పేపర్-2 లో 34.18 శాతం మంది అర్హత సాధించారు. పేపర్-1లో మొత్తం 85,996 మంది పరీక్ష రాయగా 57,725 మంది క్వాలిఫై అయ్యారు. పేపర్-2కు మొత్తం 1,50,491 మంది పరీక్ష రాయగా.. కేవలం 51,443 మంది మాత్రమే అర్హత సాధించారు. అభ్యర్థలు ఫలితాల కోసం వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు సూచించారు.
ఈసారి టెట్ అర్హత సాధించనివారు వొచ్చే టెట్‌కు ఉచితంగా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. అదేవిధంగా టెట్‌లో అర్హత సాధించిన వాళ్లు డీఎస్సీకి ఎలాంటి ఫీజులేకుండా ఉచితంగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చింది. ఎన్నికల కోడ్ కారణంగా టెట్-2024 ఫీజును తగ్గించలేకపోయామని ప్రభుత్వం తెలిపింది. అందుకే తదుపరి టెట్, డీఎస్సీ దరఖాస్తుదారులకు ఉపశమనం కల్పించాలని నిర్ణయించినట్లు వెల్లడిరచింది.




