తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్
ఘనంగా ఎఐసిసి అగ్రనేత సోనియా గాంధీ జన్మదిన వేడుకలు
హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 09 : తెలంగాణ జాతిపితగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరును ప్రకటించాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ నూతన కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఫోరం ఆధ్వర్యంలో శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సమావేశంలో ఎఐసిసి అగ్రనేత సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. అనంతరం డాక్టర్ చీమ శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ జన్మదిన కానుకగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారుల గెలిపించి ఇచ్చారని అన్నారు. ‘తెలంగాణ ఉద్యమకారుల ఫోరం’ ఈ గెలుపులో ముఖ్య భూమిక పోషింషించిందని తెలిపారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం సిఎం రేవంత్ రెడ్డి వెంటనే ఒక కమిటీ ఏర్పాటు వేసి తెలంగాణ ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి 250 గజాల ఇంటి స్థలంతో అటు రూ.25 వేల పెన్షన్ తదితర సౌకర్యాలు అమలు చేయాలని అన్నారు. 119 నియోజకవర్గాలలో బిఆర్ఎస్ నాయకులకు వ్యతిరేకంగా ఫోరం ప్రచారం చేసినట్లు పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమకారులపై ఉన్న పెండింగ్ కేసులను ఎత్తివేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ జేఏసీ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంకు ఉద్యమకారుల ప్రతినిధిగా ప్రభుత్వంలో ప్రాధాన్యత కల్పించాలని అన్నారు. నామినేటెడ్ పదవుల్లో ఉద్యమకారులకు అవకాశం కల్పించాలని అన్నారు. ఉద్యమకారులను విస్మరించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ ఛైర్మెన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ అన్నారు. సీమాంధ్ర కార్పొరేట్ ఆధిపత్యాన్ని అన్ని రంగాల్లో తగ్గించాలన్నారు. ప్రజా సంఘంగా ఫోరం పని చేస్తుందని అన్నారు. ఈ సమావేశంలో ఫోరం ప్రధాన కార్యదర్శి సురేందర్ రెడ్డి, నాయకులు జంగా సుదర్శన్, పెరిదుల శ్రీనివాస్ గౌడ్, అంజిపురం వెంకటేష్ గౌడ్, జనిగె విష్ణువర్ధన్, సురేందర్ రెడ్డి, నరేందర్ గౌడ్, కొంతం యాదిరెడ్డి, ఇంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.





