ఇద్దరూ కలిసే కాళేశ్వరం పేరుతో దోచుకున్నారు
* పాలమూరు ఎత్తిపోతలకు అన్యాయం చేశారు
* టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 03 : ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతుందని టీపీసీసీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఇందిరా భవన్ లో జరిగిన టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం మాట్లాడుతూ… సమావేశంలో మూడు తీర్మానాలు ప్రతిపాదించినట్లు తెలిపారు. ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ గారికి అభినందనలు తెలుపుతూ తీర్మానం.. తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఎంతో సమన్వయంతో పనిచేసిన మాణిక్ రావు ఠాక్రే అభినందిస్తూ రెండవ తీర్మానం..రాబోయే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి సోనియా గాంధీ గారు పోటీ చేయాలని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం ప్రతిపాదించినట్లు చెప్పారు. వీలైనంత త్వరగా పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించి.. వారికి సముచిత స్థానం కల్పించే బాధ్యత మాది.
బోర్లా పడి బొక్కలు విరిగినా బీఆరెస్ కు బుద్ది రాలేదు. నెల రోజులు గడవకముందే కాంగ్రెస్ హామీలపై పుస్తకాలు విడుదల చేస్తున్నారు. చెరుకు తోటల్లో పడిన అడవి పందుల్లా తెలంగాణను బీఆరెస్ దోచుకుంది. బీఆరెస్ విమర్శలను ధీటుగా తిప్పికొట్టాలి. టార్గెట్ 17 పెట్టుకుని లోక్ సభ ఎన్నికల్లో పనిచేయాలి. రాష్ట్రంలో 12కు తగ్గకుండా లోక్ సభ స్థానాలు గెలిపించుకోవాలి. ఈ నెల 8న 5జిల్లాలు, 9న 5 జిల్లాల నేతలతో సమీక్షిస్తా. ఈ నెల 10 నుంచి 12 వరకు 17 పార్లమెంట్ ఇంఛార్జ్ లతో సన్నాహక సమావేశం నిర్వహిస్తాం. 20 తరువాత క్షేత్ర స్థాయి పర్యటనల్లో పాల్గొంటా..బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఆదాయం తగ్గినట్టుంది. అందుకే కిషన్ రెడ్డి కాళేశ్వరంపై సీబీఐ ఎంక్వయిరీ కోరుతున్నారు. ఆనాడు స్వయంగా నేను సీబీఐ ఎంక్వయిరీ కోరినపుడు ఏం చేశారు. దొంగను గజదొంగకు పట్టించాలని కిషన్ రెడ్డి అడుగుతున్నాడు. కాళేశ్వరం అవినీతిపై మేం జ్యుడీషియల్ విచారణ చేసి తీరుతాం. బీజేపీ, బీఆర్ఎస్ తోడు దొంగలు.. ఇద్దరూ కలిసే కాళేశ్వరం పేరుతో దోచుకున్నారు… పాలమూరు ఎత్తిపోతలకు అన్యాయం చేశారు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు.
ఆరు గ్యారంటీలు పక్కా అమలు
పిసిసి విస్తృతస్థాయి సమావేశంలో పలు నిర్ణయాలు
హాజరైన పార్టీ నూతన ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ
తెలంగాణ కాంగ్రెస్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆరు గ్యారెంటీల అమలు కోసం గ్రామ కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్‌గా దీపాదాస్ మున్షీ నియామకం అయిన తర్వాత తొలిసారి గాంధీభవన్‌లో రాష్ట్ర కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఈ భేటీలో లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహలతో పాటు పలు అంశాలపై చర్చించారు. అనంతరం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కోసం ఎకరం స్థలం కేటాయించాలని నిర్ణయించారు. అలాగే స్టేట్ ఎస్సీ కమిషన్‌ను రద్దుచేసి, దాని స్థానంలో కొత్త కమిషన్‌ను తీసుకురావాలని నిర్ణయించారు. అలాగే జోనల్ వ్యవస్థను సవిూక్షించేందుకు కమిటీ వేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి అధికారం చేపట్టిన తర్వాత తొలిసారి పీసీసీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ విూటింగ్‌లో ఏఐసీసీ కార్యదర్శులు, మంత్రులు, ఎన్నికల, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యలతో పాటు కాంగ్రెస్ జిల్లాల అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, పార్టీ అధికార ప్రతినిధలు పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని రేవంత్ నిర్ణయించారు. ఆరు గ్యారెంటీల అమలు కోసం గ్రామ కమిటీలు ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింతగా చేరువ చేయవచ్చని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హావిూలను తూచా తప్పకుండా అమలు చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసినవారికి పదవులు వస్తాయని, పార్టీ గుర్తింపు ఇస్తుందని రేవంత్ చెప్పారు. ఇదిలావుంటే సీఎం రేవంత్ రెడ్డి దిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. గురువారం ఏఐసీసీ భేటీ కానుంది. లోక్‌సభ ఎన్నికలపై ఈ విూటింగ్‌లో చర్చించనున్నారు. ఈ భేటీలో లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు కోసం అనుసరించా ల్సిన వ్యూహలపై రాష్ట్ర నాయకత్వానికి కాంగ్రెస్ హైకమాండ్ దిశానిర్దేశం చేయనుంది. అందులో భాగంగా వివిధ రాష్టాల్ర సీఎంలు, పీసీసీ చీఫ్‌లతో అధిష్టానం సమావేశం కానుంది. ఈ భేటీలో పాల్గొనేందుకు రేవంత్ దిల్లీ వెళ్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.