- ప్రజా వ్యతిరేక పాలన పోవాలే..
- గండ్ర వెంకటరమణారెడ్డి వ్యాపారంలో కేటీఆర్ భాగస్వామి
- భూపాలపల్లి ఎమ్మెల్యే అవినీతి, అక్రమాలలో కెటిఆర్‌కు వాటా
- నిరూపించేందుకు మా నాయకులు సిద్ధం
- బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి సవాల్
చిట్యాల(భూపాలపల్లి జిల్లా), ప్రజాతంత్ర, ఫిబ్రవరి 22 : భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి వేల కోట్ల అవినీతి అక్రమాలలో కేటీఆర్ భాగస్వామిగా ఉన్నాడని, ఆయన చేసే ప్రతి దోపిడీలో కేటీఆర్ కు వాటా ఉన్నదని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యే గండ్ర అక్రమ వ్యాపారంలో కేటీఆర్ వాటాను నిరూపించేందుకు మా నాయకులు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ విషయంలో నిజాయితీ ఉంటే కేటీఆర్ బహిరంగ చర్చకు రావాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. రాష్ట్రంలో కొనసాగుతున్న రాక్షస పాలన పోయి ఇందిరమ్మ రాజ్యం రావాలంటే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. బుధవారం రాత్రి నియోజకవర్గంలోని మొగుళ్లపల్లి మండల కేంద్రంలో జరిగిన కార్నర్ సభలో రేవంత్ రెడ్డి ఉద్వేగంగా మాట్లాడారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా ప్రభుత్వ పాలన కొనసాగుతున్నదన్నారు.
అత్యాచారాలు, ఆత్మహత్యలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరేళ్ల పసిపాప అత్యాచారానికి గురైతే పట్టించుకున్న వారు లేరని ఆవేదన చెందారు. నిన్న రాజధానిలో కుక్కల దాడిలో పసిపిల్లాడు చనిపోతే కనీసం ఓదార్చే నాయకుడు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. కుక్కలు అరచి చంపిన బాలుడికి కుటుంబానికి సారీ చెప్తే సరిపోతుందా అని కేటీఆర్ ను సూటిగా ప్రశ్నించారు. ఏమాత్రం మానవతా విలువలు ఉన్న, మానవత్వం ఉన్న ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని అన్నారు. మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తో పాటు నగర మేయర్ కూడా సిగ్గులేకుండా వ్యవహరించారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం ఓదార్పు నిచ్చే అవకాశం లేదని, ఆస్తులు పెంచుకోవడం, దోపిడీలు చేయడానికి సమయం సరిపోతుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమీ లేదని మాట్లాడుతున్న గంట రమణారెడ్డి కూడా పెట్టుకున్న ప్రతి ఆస్తి కాంగ్రెస్ పార్టీదేనని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీలో సంపాదించిన ఆస్తులు సరిపోవని పార్టీ మారిన గండ్ర రమణారెడ్డి తో సహా 12 మంది ఎమ్మెల్యేలను వదిలిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించాడు. నియోజకవర్గంలో నక్సలైట్లు ఆక్రమించి, పేదలకు పంచిన భూములను ఎమ్మెల్యే గండ్రమణారెడ్డి మళ్ళీ లాక్కుని ఆయిల్ ఫామ్ పెడుతున్నాడని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది పేద ప్రజల బాగోగుల కోసం కాదా? అని ప్రశ్నించారు. దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని, మూడు ఎకరాల భూమి ఇస్తాడని నమ్మబలికితే ప్రజలు అధికారమిచ్చారని, గడచిన తొమ్మిది ఇళ్లలో హామీలను విస్మరించిన కేసీఆర్ ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తున్నాడని రేవంత్ రెడ్డి విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రూ. 500 కే గ్యాస్ సిలిండర్ పేదలకు అందిస్తామన్నారు. రైతులు అప్పుల పాలు కాకుండా రూపాయలు రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. అనారోగ్యానికి గురైన పేదలకు ఐదు లక్షలతో ఆరోగ్యశ్రీ వర్తింప చేస్తూ, ఇల్లు లేని నిరుపేదలకు రూ. ఐదు లక్షలతో ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తామని హామీ ఇచ్చాడు. ఇంకా మైనారిటీలకు, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, ప్రత్యేకంగా నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తామని వివరించారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించి చివరి గింజ వరకు కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. ఇప్పటికైనా ప్రజలు గమనించి బిఆర్ఎస్ నాయకుల అక్రమాలను ఎండగట్టాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి గండ్ర సత్యనారాయణ రావు, ములుగు ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య తదితరులు పాల్గొన్నారు.




