‌తెలంగాణపై ఇక బిజెపి దూకుడు

గుజరాత్‌ ఎన్నికలు ముగిసాయి. ఎగ్జిట్‌ ‌పోల్‌ ‌సర్వేలన్నీ బిజెపికి అనుకూలమని చెబుతున్నాయి. గత మూడు దశాబ్ధాలుగా బిజెపినుండి గుజరాత్‌ను మరే పార్టీ గెలుచుకోలేకపోయిందన్నది మరో సారి దీనితో స్పష్టమవుతున్నది. ఒకసారి బిజెపి అధికారంలోకి వొచ్చిన తర్వాత ఎవరూ దాన్ని కబళించలేరని ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ చేసిన  ప్రసంగం ఈ సందర్భంగా గమనార్హం. అదే దృష్టితో తెలంగాణపైన  బిజెపి గత కొంతకాలంగా తీవ్రంగా ఫోకస్‌ ‌చేస్తోంది. దక్షిణాది రాష్ట్రాలను తన ఆధిపత్యంలోకి తీసుకువొచ్చేందుకు ముందుగా తెలంగాణనే ఆ పార్టీ టార్గెట్‌గా పెట్టుకుంది. రానున్న ఎన్నికల్లో ఇక్కడ విజయ ఢంకా మోగించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.

వాస్తవంగా తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ఎంతలేదన్నా సంవత్సరకాల వ్యవధి ఉన్నప్పటికీ  ఇక్కడ రాజకీయ పార్టీలన్నీ ఇప్పటినుండే కత్తులు దూస్తున్న విషయం తెలియందికాదు. గత శాసనసభ  ఎన్నికల తర్వాత కొంతకాలం మౌనంగా ఉన్న బిజెపి ఆ తర్వాత దూకుడు మొదలుపెట్టింది. ఎప్పుడైతే మూడు శాసనసభ ఉప ఎన్నికల్లో విజయం సాధించినతర్వాత తెలంగాణ ప్రజలు తమ పార్టీని విశ్వసిస్తున్నారన్న నమ్మకం బిజెపికి  ఏర్పడింది. అయితే ఊహించని విధంగా మునుగోడు ఉప ఎన్నిక ఆ పార్టీని కొంత నిరాశ పర్చినా, కాంగ్రెస్‌ను పక్కకు నెట్టి రెండవ స్థానంలో నిలబడ్డామన్న సంతృప్తి ఆ పార్టీలో ఏర్పడింది. కేవలం పదివేల వోట్ల తేడాతో ఓడి పోయినా, ప్రజలు తమ వెంట నడుస్తున్నారన్న ధీమా ఇప్పుడాపార్టీలో ఏర్పడింది. దీంతో ఆ పార్టీ మరింత బలమైన పునాదులు వేసుకునేందుకు తాపత్రయపడుతోంది.

తెలంగాణ ఏర్పాటులో సుష్మాస్వరాజ్‌ ‌లాంటి వారు కొందరు సహరించి, రాష్ట్ర ఏర్పాటు బిల్లుకు చివరి అంకంలో మద్దతు పలికినా, తెలంగాణకోసం పోరాటం చేసిన చరిత్ర లేదన్న విమర్శ ఆపార్టీకి ఉండేది. ఆకర్ష్ ‌పథకం కింద వివిధ పార్టీలనుండి వొచ్చి చేరిన వారితో ఇప్పుడు ఆ పార్టీకి ఆ పేరును తుడిపేసుకుంటోంది.  దీనికి తగినట్లుగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌పాదయాత్రలతో ప్రజలకు దగ్గరవుతున్నారు. ఇప్పటివరకు ఆయన అయిదు విడుతలుగా పాదయాత్రలు చేపట్టారు. తర్వాత కూడా దీన్ని కొనసాగిస్తామన్న సంకేతాన్నిచ్చారాయన.  శాసనసభ ఎన్నికలు ముందస్తుగానే వొచ్చే అవకాశాలున్నాయన్నది ఆయన అంచనా. అందుకుతన యాత్ర మరింత త్వరితగతిన సాగేందుకు బస్సుయాత్రను చేపట్టే ఆలోచనలో ఆయన ఉన్నారు. తెలంగాణపైన కాషాయ జండా ఎగురవేయాలన్నది ఆ పార్టీ ఎప్పటినుండో లక్ష్యంగా పెట్టుకుంది. దానికి  కేంద్ర నాయకత్వ నేతృత్వంలో ప్రణాళికా రచన సాగుతున్నదన్నది నిర్వివాదాంశం.

ఇప్పటికే ఉప ఎన్నికలు, గ్రేటర్‌ ‌మున్సిపల్‌ ‌తదితర ఎన్నికల సందర్భంగా ప్రధాని, హోం మంత్రి లాంటి వారితో ఇక్కడ ప్రచారం చేయించిన ఆ పార్టీ రాష్ట్ర శాఖ, రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేపట్టనున్న ప్రతీ కార్యక్రమంలో కేంద్ర నాయకత్వాన్ని భాగస్వామిని చేసేవిధంగా ప్రణాళికలను రూపొందిస్తోంది. తాజాగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అయిదవ విడుత పాదయాత్ర ముగియనున్న సందర్భంగా ఈ నెల 16న మరోసారి బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపీ నడ్డాను రాష్ట్రానికి ఆహ్వానిస్తున్నారు. బండి సంజయ్‌ ‌ప్రాతినిథ్యం వహిస్తున్న కరీంనగర్‌ ‌లోకసభ నియోజవర్గంలో ఆయన రాక సందర్భంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే  కెసిఆర్‌, ఆయన కుటుంబంపైన విరుచుకు పడుతున్న బిజెపి నాయకులకు ఇప్పుడు మరో అస్త్రం చేతికి చిక్కినట్లు అయింది.

దిల్లీ  లిక్కర్‌ ‌పాలసీ స్క్యామ్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కుమార్తె, ఎంఎల్సీ  కవిత పేరు చోటుచేసుకోవడంతో ఆ పార్టీ దాన్ని విస్తృతంగా వాడుకునే అవకాశం లభించింది. దీనికి తగినట్లుగా తెలంగాణ మంత్రులు, శాసన సభ్యులు, ఇతర నాయకులపై ఇడి, సిబిఐ కేసుల నేపథ్యాన్ని కూడా తెరాస ప్రభుత్వంపై ఆరోపణలను  గుమ్మరించే అవకాశం ఆ పార్టీకి లభించినట్లు అయింది. ఇదిలా ఉంటే టిఆర్‌ఎస్‌ను దెబ్బతీసేందుకు పెద్ద ఎత్తున రాజకీయ వ్యూహరచన చేస్తున్నదనడానికి రాష్ట్రంలో ఇటీవల జరిగిన సంఘటనలు చెప్పకనే చెబుతున్నాయి.  తాజాగా వైఎస్‌ఆర్‌తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్‌ ‌షర్మిల ఘటన రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. ఆమె దాదాపు మూడు వేల అయిదు వందల కిలోమీటర్ల పాదయాత్రను ప్రశాంతంగా ముగించుకున్నప్పటికీ, ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాలో జరిగిన సంఘటన రాష్ట్ర రాజకీయాలను ఒక కుదుపు కుదిపినట్లు అయింది. ఈ ఘటనపై బిజెపి స్పందించినంతగా మరే పార్టీ స్పందించకపోవడంతో అమె బిజెపి విడిచిన బాణమంటూ టిఆర్‌ఎస్‌ ఆరోపిస్తున్నది. తాజాగా ప్రధాని మాటలు ఈ ఆరోపణకు మరింత బలాన్ని చేకూర్చేవిగా ఉన్నాయి.

ఇటీవల దిల్లీ లో జరిగిన జీ20 దేశాల సమావేశానికి హాజరైన ఏపి ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డితో తెలంగాణలో షర్మిల సంఘటనను ప్రత్యేకంగా ప్రస్తావించారన్న వార్త  టిఆర్‌ఎస్‌ అనుమానానికి ఊతమిచ్చినట్లైంది.  షర్మిల కూర్చుని ఉండగా కారును క్రేన్‌ ‌ద్వారా తీసుకెళ్ళిన విధానంపై అన్నగా ఎందుకు స్పందించలేదని జగన్‌ను  ప్రధాని అడిగారన్న వార్త  టిఆర్‌ఎస్‌ ఆరోపణ నిజమేనన్న భావాన్ని కలిగిస్తున్నది. అంతటితోనే దాన్ని వొదిలి వేయలేదు. ప్రధాని షర్మిలతో ఫోన్‌లో మాట్లాడటంకూడా వారి అనుమానం నిజమే అన్నట్లుగా ఉంది.  అందుకే షర్మిలకూడా కనీస మర్యాదలను కూడా పాటించకుండా తెలంగాణ సర్కార్‌పైన, కెసిఆర్‌ ‌కుటుంబంపైన విమర్శనాస్త్రాలను సంధిస్తున్నదన్న వాదనఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *