ఎల్బీనగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 14: సమస్యలు లేకుండా ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా కోసం చేపడుతున్న ఎస్.ఆర్.డి.పీ.పనుల్లో బాగంగా ఎల్.బి.నగర్ నియోజకవర్గ పరిధిలో బైరామల్ గూడ నందు లూప్ ఆకారంలో నిర్మిస్తున్న స్కై ఫ్లై ఓవర్ పనులు తుదిదశకు చేరుకున్నాయి. గురువారం ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పలువురు అధికారులతో కలిసి ఫ్లై ఓవర్ నందు పరిశీలించారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన ఎస్.ఆర్.డి.పీ.నిర్మాణాల్లో అరుదైన ప్రాజెక్ట్ అతి త్వరలో అందుబాటులోకి రావడం జరుగుతుందని తెలిపారు. ఔటర్ రింగు రోడ్డు తరహాలో ఎల్.బి.నగర్ నియోజకవర్గంలో బైరామల్ గూడలో లూప్ ఆకారంలో నిర్మాణం జరుగుతుందని తెలిపారు. స్థానికంగా ట్రాఫిక్ సుడిగుండాలకు శాశ్వత పరిష్కారంగా, వాహన దారులకు బహు ప్రయోజనాలతో దాదాపు 135 కోట్ల రూపాయలతో లూప్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టగా వచ్చే సంక్రాంతి వరకు అందుబాటులోకి తెచ్చేందుకు ఇంజనీర్లు పనులు వేగవంతంగా చేపడుతున్నారని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 47 ప్రాజెక్టుల్లో బాగంగా 36 ప్రాజెక్టులు అందుబాటులోకి రావడం జరిగిందని, బైరామల్ గూడ సెకండ్ లెవల్ ఫ్లై ఓవర్ తో పాటు రెండు లూప్స్ సైతం ప్రత్యేక నిర్మాణాలుగా నిలువనున్నాయని తెలిపారు. ఎల్.బి.నగర్, చంపాపేట, సాగర్ రింగ్ రోడ్డు మార్గాల వైపు వెళ్లేందుకు గాను ఈ లూప్ లైన్స్ ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో లింగోజిగూడా డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాసరావు, ఎస్.ఈ.రవీందర్ రెడ్డి, ఈ.ఈ.రోహిణి, డీ.ఈ.కార్తిక్, ఏ.ఈ.పరమేశ్ తదితరులు పాల్గొన్నారు.
తుది దశకు చేరుకుంటున్న లూప్ ఆకారంలో నిర్మిస్తున్న స్కై ఫ్లై ఓవర్ పనులు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి





