తిరుమలలో కోయిల్‌ ఆళ్వార్‌ ‌తిరుమంజనం

  • వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయశుద్ది
  • 11 గంటల తరవాత దర్శనానికి భక్తులకు అనుమతి

తిరుమల, డిసెంబర్‌ 27 : శ్రీ‌వారి ఆలయంలో మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ ‌తిరుమంజనం చేపట్టారు. వచ్చే నెల 2వ తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమంజనం కార్యక్రమాన్ని టీటీడీ శాస్తోక్త్రగా నిర్వహించింది. ఉదయం 6 నుంచి 11 గంటల వరకూ ఆలయశుద్ధి కార్యక్రమం కొనసాగింది. దీంతో భక్తుల దర్శనలను నిలిపివేశారు. ఏడాదిలో నాలుగుసార్లు.. ఉగాది, ఆణివారి ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం రోజున కోయిల్‌ ఆళ్వార్‌ ‌తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. కోయిల్‌ ఆళ్వార్‌ ‌తిరుమంజనం సందర్భంగా ముందుగా స్వామి వారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచారు. ఆనంద నిలయం నుంచి బంగారు వాకిలి వరకు..

శ్రీవారి ఆలయం లోపల ఉన్న ఉపాలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి వంటి అన్ని వస్తువులను నీటితో శుభ్రం చేశారు. శుద్ధి కార్యక్రమం పూర్తయిన తర్వాత నామపుకోపు, శ్రీచూర్ణం, కస్తూరిపసుపు, పచ్చకర్పూరం, గంధంపొడి, కుంకుమ, కిచీలీగడ్డ వంటి సుగంధ ద్రవ్యాలు కలిపిన పరిమళ ద్రవ్యాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం స్వామి వారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేకపూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు చేపట్టారు. పూజా కార్యక్రమాల తర్వాత ఉదయం 11 గంటల తరవాత స్వామి వారి సర్వదర్శనానికి భక్తులను అనుమతించారు.

ఏడాదిలో నాలుగుసార్లు ఆలయ శుద్ధి చేపట్టడం ఆనవాయితీ వస్తున్నదని టీటీడీ ఈఓ అనిల్‌ ‌కుమార్‌ ‌సింఘాల్‌ ‌తెలిపారు. తిరుపతిలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 9 కౌంటర్లలో వైకుంఠ ద్వారా దర్శనాలు జారీ చేస్తున్నట్లు చెప్పారు. రోజుకు 50వేల టిక్కెట్ల చొప్పున సర్వదర్శనం టైం స్లాట్‌ ‌టిక్కెట్లు అందుబాటులో ఉంటాయన్నారు. 5 లక్షల టిక్కెట్లు పూర్తయ్యే వరకు జారీ కొనసాగుతుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *