తిరుమలలో కొనసాగుతున్న తెప్పోత్సవాలు

తిరుమల,మార్చి4:  కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. వారాంతం కావడంతో భక్తుల రాక పెరిగింది.  11 కంపార్ట్‌మెంట్ల లో స్వామివారి దర్శనానికి వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. శుక్రవారం  స్వామివారిని 58,137 మంది భక్తులు దర్శించుకోగా 26,805 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.30 కోట్లు వచ్చిందని వివరించారు. స్వామి వారి సాలకట్ల తెప్పోత్సవాలు శుక్రవారం సాయంత్రం నుంచి తిరుమలలో ప్రారంభమయ్యాయి.

విద్యుద్దీపాలు, పుష్పాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి దర్శనమిచ్చారు. శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రుని ఉత్సవమూర్తుల ఊరేగింపు ఆలయ నాలుగు మాడ వీధుల గుండా పుష్కరిణి వద్దకు చేరుకుంది. తొలిరోజు శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామివారు పుష్కరిణిలో తెప్పపై మూడు చుట్లు తిరిగి కనువిందు చేశారు. వేదం, గానం, నాదం మధ్య తెప్పోత్సవం వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజీయర్‌ ‌స్వామి, టీటీడీ ఈవో ఏ వి ధర్మా రెడ్డి, ఎస్‌ ఈ 2 ‌జగదీశ్వర్‌ ‌రెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో రమేష్‌ ‌బాబు, అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *