డిసెంబర్ 9.. 2009న కేంద్రం దిగి వచ్చి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో సువర్ణాక్షరాలతో లిఖించబడిన దినం.
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సాఫల్య సాకార ప్రక్రియకు శ్రీకారం చుట్టిన దినం. ఇది ప్రత్యేక చారిత్రక సందర్భం. 2009 నవంబర్ 29న ప్రస్తుత ముఖ్య మంత్రి కేసీఆర్ మొదలు పెట్టిన ఆమరణ దీక్ష మలి దశ ఉద్యమంలో కీలక ఘట్టంగా నిలిచి, ఢిల్లీ పాలకుల చేత రాష్ట్ర ఏర్పాటు ప్రకటనకు మూలమైన నేపథ్యం, కేసిఆర్ ఆమరణ దీక్ష సందర్భం, క్రమాను గత సంఘటనల క్రమాన్ని మననం చేసుకునే ప్రయత్నం.
తెరాస అధినేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమై, మానసిక సన్నద్ధం కోసం నవంబర్ 26వ తేదీ సాయంత్రం కరీంనగర్ తీగల గుట్టపల్లిలోని ఉత్తర తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. అప్పటికే దీక్షకు సంబంధించి వాతావరణం వేడెక్కడంతో, ఆయనకు పార్టీ శ్రేణులు అపూర్వ స్వాగతం పలికాయి. మహిళలు ముందుండి వీర తిలకం దిద్దారు. కేసిఆర్ తెలంగాణ భవన్‌లో బస చేయడంతో ప్రభుత్వం కరీంనగర్ పై ప్రత్యేక దృష్టి నిలిపింది. కేసిఆర్ దీక్షను అడ్డు కోవడానికి 144 సెక్షన్ విధించడం, తెలంగాణ భవన్ వద్ద భారీగా పోలీసులు, ఇంటలిజెన్స్ వర్గాలు చేరడంతో కరీంనగర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేసిఆర్ ఆమరణ దీక్ష చేపడుతారా, పోలీసులు అడ్డుకుంటారా అనే సంశయం యావత్ తెలంగాణ ప్రజల్లో టెన్షన్. 29న ఉదయం దీక్షకు బయలు ఆనాటి అర్ధరాత్రి ఏమి జరగ నుందో అని 28వ తేదీ రాత్రి కరీంనగర్‌లో ఉత్కంఠ క్షణక్షణం పెరిగింది. దీక్షను అడ్డుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు జరిగాయి. ప్రభుత్వం కేసిఆర్ బస చేసిన ఉత్తర తెలంగాణ భవనం వద్ద పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించింది. అర్ధరాత్రి 12 గంటలకు భవన్‌ను పోలీసులు చుట్టు ముట్టారు. పోలీసుల ప్రయత్నాలను ఎదుర్కోవడానికి కార్యకర్తలు, నేతలు కూడా పెద్ద సంఖ్యలో భవన్‌కు చేరుకొని కేసిఆర్ కు అండగా లోపలే ఉండి పోయారు. రాత్రంతా ధూంధాం నిర్వహించారు. కార్యకర్తలు పలుమార్లు పోలీసుల పైకి రాళ్లు రువ్వడంతో ఉద్రిక్తత పెరిగింది.
29వ తేదీ ఉదయం తెలంగాణ భవన్‌లోనే మీడియా ప్రతి నిధుల సమా వేశం నిర్వహించి ప్రభుత్వ దమనకాండను నిరసించారు. ఉత్తర తెలంగాణ భవన్ నుంచి దీక్షకు సిద్ధ మయ్యారు. తర్వాత ఉదయం 7.30 గంటలకు తెరాస సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయ శంకర్, నాయిని నర్సింహారెడ్డి, కెఫ్టెన్ లక్ష్మీకాంతరావుతో కలిసి మెదక్ జిల్లా సిద్ధిపేట దగ్గర రంగధాంపల్లిలో ఏర్పాటు చేసిన దీక్షా స్థలికి వాహనంలో బయలు దేరారు. భవన్‌లో కాకుండా మార్గమధ్యలో అరెస్టు చేయాలనే పక్కా వ్యూహంతో పోలీసులు కేసిఆర్ ను వెంబడించారు. కేసిఆర్ కాన్వాయ్ బయలు దేరగానే, కార్తకర్తలు, మీడియా వాహనాలు కాన్వాయ్‌ను అనుసరించకుండా అల్గునూర్ బ్రిడ్జివద్ద నిలిపివేశారు. ఎమ్మెల్యేల వాహనాలను సైతం అనుమతించ లేదు. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య అల్గునూరు ఛౌరస్తా వద్ద వాహనాన్ని నిలిపివేసి కేసిఆర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టుకు నిరసనగా అల్గునూరు ఛౌరస్తాలోని రోడ్డుపై కూర్చొని కేసిఆర్ కొద్దిసేపు ఆందోళన చేశారు.
కార్యకర్తలు వాహనాల టైర్లలో గాలి తీసి ముందుకు కదలకుండా చేశారు. అక్కడి నుండి కెసిఆర్‌ను మరో వాహనంలో హుజురాబాద్, వరంగల్ మీదుగా పోలీసులు ఖమ్మం తరలించారు. ఆగ్రహించిన కార్యకర్తలు ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. కేసిఆర్ కు మెజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్‌కు ఆదేశించడంతో.. ఖమ్మం జైలుకు తరలించగా, జైలులోనే ఆయన ఆమరణ దీక్ష ప్రారంభించారు. అలా తెలంగాణ భగ్గుమంది. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు వేల సంఖ్యలో రోడెక్కారు.
జనవరి 23-29,2005




