20వ శతాబ్దంలో ప్రపంచ ప్రసిద్ధిచెందిన గణిత మేధావుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన, భారతీయ గణిత చరిత్రకు మెరుగులు దిద్దిన శ్రీనివాస రామానుజన్ పుట్టిన రోజును పురస్కరించుకుని ప్రతియేటా డిసెంబర్ 22ను జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపు కొంటున్నారు. గణిత శాస్త్రములో ఆర్యభట్ట, భాస్కరాచార్యులు తరువాత భారత దేశానికి గొప్ప పేరు తెచ్చిన మేధావి భారత గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ (1887 డిసెంబర్ 22 – 1920 ఏప్రిల్ 26). తన విలక్షణ అసమాన మేధాసంపత్తితో అనన్య సామాన్యమైన కృషిచేసి భారతీయ కీర్తి పతాకాన్ని దశదిశలా ఎగరవేసిన మహా గణితజ్ఞుడు శ్రీనివాస రామానుజన్. ఆయన జీవించింది 32 అయినా 3900పైగా సిద్ధాంతాలను, సూత్రాలను అందించిన అపరగణిత మేధావి. ఆయన సిద్దాంతాలపై నేటికీ ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు జరుగుతుండడం విశేషం.
గణితం వేద కాలము నుండి భారతీయ సంప్రదాయంలో భాగమేనని మన వేద గణితం ద్వారా మనకు తెలుస్తున్నది. గణితం ప్రాచీన భారత దేశంతో పాటు ప్రాచీన ఈజిప్టు, మెసపు టేమియా, ప్రాచీన చైనా, ప్రాచీన గ్రీకు నాగరికతలలో ఎక్కువగా అభివృద్ధి చెందింది. ప్రపంచ వ్యాప్తంగా గణితము అభివృద్ధిలో భారతీయుల పాత్ర ఎంతో ఉంది. సంఖ్యామానానికి పట్టుకొమ్మ అయిన సున్నా భారతీయుల ఆవిష్కరణే. ప్రాచీన భారతీయులు గణితంలో ఎన్నో విషయాలు కనుగొన్నారు. సంఖ్యలను కనుగొనడంలో చాల కృషి చేశారు. దశాంశ పద్ధతిని గుర్తించిన మొదటివారు భారతీయులే. ఆర్యభట్ట కాలాన్ని భారతీయ గణిత శాస్త్రానికి స్వర్ణయుగంగా పేర్కొంటారు. ఇది భాస్కరా చార్యుని వరకు ఆప్రతిహతంగా సాగింది. భాస్కరాచార్యుని తర్వాత కాలంలో బహు విదేశీ దండ యాత్రల వల్ల గణితం కళ తప్పింది. అనువాదాలు, వ్యాఖ్యానాలు తప్ప పెద్దగా స్వతంత్ర గణిత సారస్వతం ఏదీ ఆవిష్కరణ కాలేదు. ఆ స్థితిలో మళ్లీ భారతీయ గణిత చరిత్రకు మెరుగులు దిద్దిన మేధావి శ్రీనివాస రామానుజన్. గణితంపై అనేక గ్రీకు అరబిక్ గ్రంథాలు 12వ శతాబ్దం నుండి లాటిన్‌లోకి అనువదించ బడ్డాయి. ఇది మధ్యయుగంలో ఐరోపాలో గణిత శాస్త్రం మరింత అభివృద్ధికి దారితీసింది. పురాతన కాలంమధ్య యుగాల వరకు, గణితశాస్త్ర ఆవిష్కరణ కాలాలు తరచుగా శతాబ్దాల స్తబ్దతతో అనుసరించ బడ్డాయి. 15వ శతాబ్దంలో పునరుజ్జీవనోద్యమం ఇటలీలో ప్రారంభమై , కొత్త గణిత శాస్త్ర పరిణామాలు, కొత్త శాస్త్రీయ ఆవిష్కరణల పరంపర పెరుగుతున్న వేగంతోఈ రోజు వరకు కొనసాగుతోంది.
ఆధునిక కాలపు తొలినాళ్ళలో పశ్చిమ ఐరోపాలో గణిత శాస్త్రం అభివృధ్ధి వేగం పుంజుకుంది. 17వ శతాబ్దం లో న్యూటన్, లీబ్నిజ్ ల కలన గణితం అభివృద్ధి చెందిది. గణితంలో విప్లవాత్మక మార్పులను తెచ్చింది. లియొన్‌హార్డ్ ఆయిలర్ 18వ శతాబ్దంలో అత్యంత ప్రసిద్ధ గణిత శాస్త్రజ్ఞుడు, అనేక సిద్ధాంతాలు, ఆవిష్కరణలకు తోడ్పడ్డాడు. 19వ శతాబ్దంపు తొలి గణిత శాస్త్రజ్ఞులలో ఒకడైన కార్ల్ ఫ్రెడ్రిక్ గాస్… బీజగణితం, విశ్లేషణ, అవకలన జ్యామితి, మాతృక సిద్ధాంతం, సంఖ్యా సిద్ధాంతం, గణాంకాలు వంటి రంగాలలో అనేక రచనలు చేశాడు. శ్రీనివాస రామానుజన్, కల్యం పూడి రాధాకృష్ణ రావు, సుజాత రాందొరై, పి.సి. మహల నోబిస్, మడకా హరిప్రసాద్ లాంటి ప్రముఖ భారతీయ గణిత శాస్త్రజ్ఞులు విశేష కృషి చేశారు.
2012 ఫిబ్రవరి 26 న మద్రాస్ విశ్వవిద్యాలయంలో జరిగిన రామానుజన్ 125వ జయంతి ప్రారంభ వేడుకల్లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రామానుజన్ పుట్టిన రోజును జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించారు. అలాగే 2012 ను జాతీయ గణిత సంవత్సరంగా జరుపుకుంటామని ప్రకటించారు. అలా 2012 నుంచి ప్రతీ సంవత్సరం డిసెంబర్ 22 ను జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
యువతలో శాస్త్రీయ స్వభావాన్ని పెంపొందించడం, గణిత శాస్త్రంలో పరిశోధనలను ప్రోత్సహించడం, ఆర్థిక, విజ్ఞాన శాస్త్రం, ఇతర విభాగాలలో దాని అనువర్తనాన్ని అన్వేషించడంతో పాటు గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ ను స్మరించుకుని, గౌరవించటం జాతీయ గణిత దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
భారత దేశంలోని వివిధ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలలో జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటారు.
రామానుజన్ 75వ జన్మదినోత్సం సందర్భంగా 1962లో కేంద్ర సర్కార్ పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. అత్యంత చిన్న వయసులోనే గణిత శాస్త్రంలో తనకున్న పట్టును చాటుకున్న రామానుజన్ మ్యాథ్య్ జీనియస్ గా పేరుగాంచిన ఆయన జీవిత ఆధారంగా ద మ్యాన్ హూ నో ఇన్ఫినిటీ పేరుతో సినిమా కూడా విడుదలైంది.
– రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494




