డబ్ల్యూటిఓ జంట టవర్ల కూల్చివేతకు 21 ఏండ్లు

తేదీ సెప్టెంబర్‌ 11, 2001 మంగళవారం రోజు. సమయం ఉదయం 8:46 గంటలు. స్థలం అమెరికాలోని న్యూయార్క్‌ మహానగరం. జనజీవనం ప్రారంభమవుతున్న ఉషోదయ వేళ. హఠాత్తుగా అమెరికన్‌ ఏయిర్‌లైన్స్‌ బోయింగ్ 767 విమానం 20,000 గ్యాలన్ల జెట్‌ ఇంధనంతో వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌, డబ్ల్యూటిఓ 110- అంతస్తుల నార్త్ టవర్‌ 80వ అంతస్తులోకి దూసుకెళ్లింది. ఎవరూ ఊహించని ఈ దుర్ఘటనలో వేల మంది ప్రాణాలు కోల్పోగా, అనేకులు వివిధ అంతస్తుల్లో చిక్కుకుపోయారు. టవర్‌లో చిక్కుకున్న ప్రజల్ని కాపాడే ప్రయత్నాలు జరుగుతున్న సమయంలోనే దాదాపు 9:03 నిమిషాల సమయంలో రెండవ బోయింగ్‌ – 767 యునైటెడ్‌ ఏయిర్‌లైన్స్‌ విమానం-175 డబ్ల్యూటిఓ సౌథ్‌ టవర్‌ 60వ అంతస్తులోకి దూసుకుపోయింది. ఈ దుర్ఘటనతో టవర్‌ నుంచి భయంకర మంటలు ఎగిసిపడ్డాయి. అమెరికాలోని ప్రఖ్యాత ప్రపంచ వాణిజ్య కేంద్రపు జంట ఆకాశహర్మ్యాలు జంట విమానాల దాడిలో అగ్నికి ఆహుతి అవుతున్న వార్త దావానలంలా వ్యాపిస్తున్న వేళ, నగర వీధుల్లో హాహాకారాలు, భయంతో నగరవాసుల అగమ్యగోచర పరుగులు పెడుతున్న వేళలో ఉదయం 9:37 గంటలకు డౌన్‌టౌన్‌ వాషింగ్టన్ ప్రాంతంలోని‌ యుయస్‌ మిలిటరీ కేంద్ర కార్యాలయం పెంటగన్ తూర్పు దిక్కున 3వ అమెరికన్ బోయింగ్‌‌ ఏయిర్‌లైన్స్‌ విమానం-77 దూసుకు పోవడం జరిగింది. ఈ దుర్ఘటనలో 125 మంది మిలిటరీ సిబ్బంది, పౌరులతో పాటు విమానంలోకి 64 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. కాలిఫోర్నియాకు వెళ్లాల్సిన యునైటెడ్‌ ఫ్లైట్‌ – 93 విమానం హైజాక్‌ అయిన 40 నిమిషాలకు హైజాకర్లు కాక్‌పిట్‌కు నిప్పంటించడంతో పెన్సిల్వేనియా సమీప శాన్కుస్‌విల్లే క్షేత్రంలో 10:03గంటలకు కుప్పకూలి పోయింది. ఈ దుర్ఘటనలో విమానంలోని 44 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. బోయింగ్‌ విమానం-767లోని జెట్‌ ఇంధన మంటలకు తట్టుకోలేక 10:30 గంటలకు నార్త్ టవర్‌ కుప్పకూలి పోయింది.

                     09 సెప్టెంబర్‌ 2001న అల్‌ఖైదా ఇస్లామిక్‌ తీవ్రవాద హైజాకర్ల నాలుగు జట్లు సృష్టించిన నాలుగు విమానాల విధ్వంసం, జంట టవర్లు కూలిపోవడం, విమానయానం చేస్తున్న ప్రయాణికులతో కలిపి 78 దేశాలకు చెందిన 2,996 మంది పౌరులతో పాటు 19 మంది (3 జట్లలో ఐదుగురు సభ్యులు, ఒక జట్టులో నలుగురు సభ్యులు) సౌథీ అరేబియా, అరబ్‌ దేశాలకు చెందిన  ఆత్మాహుతిదళ తీవ్రవాదులు మరణించగా, దాదాపు 25,000 మంది గాయాలతో బయట పడ్డారు. 1979లో అఫ్ఘానిస్థాన్‌ను రష్యా ఆక్రమించు కోవడంతో మెుదలైన తీవ్రవాద సెగలు నేటికీ ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తూనే ఉన్నాయి. యుయస్‌ ప్రభుత్వం ఇజ్రాయిల్‌కు సహకారం, గల్ఫ్ యుద్దం, సొమాలియా/లెబనన్‌/చెచన్యా/కాశ్మీర్‌లలో ముస్లిమ్‌లపై దాడులు, ఫిలిప్పీన్స్‌లో మోరో సంఘర్షనలు, ఇరాక్‌లో విధించిన ఆంక్షలు, మిడిల్‌ ఈస్ట్‌లో మిలిటరీ దళాలను మోహరిస్తున్న అమెరికాను శత్రు దేశంగా భావించిన అల్‌ఖైదా తీవ్రవాద సంస్థ ఈ నాలుగు విమాన దుర్ఘటనలకు పకడ్బందీగా ప్రణాళికలు వేసి అమలు పరిచింది. డబ్ల్యూటిఓ ట్విన్ టవర్లు కూలిపోవడంతో 2,763 మంది ప్రాణాలు అర్పించారు. పెంటగన్‌ ప్రధాన కేంద్రంపై దాడి జరిగితే అమెరికా పూర్తిగా బలహీనపడేదని విశ్లేషించారు. ఈ నాలుగు హైజాక్‌ అయిన విమానాల ద్వారా అల్‌ఖైదా ఆత్మాహుతిదళ తీవ్రవాదులు ‘అమెరికాలోని భవనాలు కూల్చవచ్చేమో కాని యుయస్‌ పునాదులను కదిలించలేరని’ నాటి యుస్‌ అధ్యక్షుడు జార్జ్‌ డబ్ల్యూ బుష్ అదే రోజు సాయంత్రం 7:00 గంటలకు తన టివి ప్రసంగంలో‌ ప్రకటించారు. నాటి భయంకర మారణహోమానికి ప్రతీకార చర్యగా అఫ్ఘానిస్థాన్‌లోని తాలిబాన్‌ పాలనకు రెండు మాసాల్లోనే చరమగీతం పాడటం, అల్‌ఖైదా అగ్రనాయకుడు ఒసామా బిన్‌ లాడెన్‌ను వెంటాడి 2011లో చంపడం చూశాం. ఈ 9/11 దుర్ఘటన నేపథ్యంలో యుయస్‌ నియమించిన ‘9/11 కమీషన్‌’ తన నివేదికను 22 జూలై 2004న సమర్పంచడం, ఈ దాడులకు ప్రధాన కారకుడు ‘ఖలీద్‍ షేఖ్‌ మహమ్మద్‍’ (ప్రస్తుతం అమెరికా కస్టడీలో ఉన్న) అని తేల్చింది. నాలుగు విమానాలను కూల్చివేయడంలో నలుగురు తీవ్రవాదులు ప్లైట్ శిక్షణ పొందడం, ఒకేసారి నాలుగు దుర్ఘటనలను జరపాలనే ప్రయత్నం చేయడంలో ఆత్మాహుతి దళాలు అధిక శాతం సఫలీకృతం అయ్యాయనే చెప్పాలి.
                 9/11 దుర్ఘటనతో 60 బిలియన్ డాలర్ల విలువైన‌ డబ్ల్యూటిఓ టవర్లు నేలమట్టం కావడంతో పాటు అమెరికా ఆర్థిక వ్యవస్థ, స్టాక్‌ మార్కెట్‌ కుప్పకూలి పోయింది. ఒక్క న్యూయార్క్‌ నగరంలోనే 1,43,000 ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. కూలిన టవర్ల శిథిలాలను తొలగించడానికి 750 మిలియన్‌ డాలర్లు వెచ్చించాల్సి వచ్చింది. ఈ దుర్ఘటన ఫలితంగా వెలువడిన విష పొగలు, దుమ్ము ధూళి కణాల కారణంగా 10,000 మందికి కాన్సర్‌ సంబంధ వ్యాధులు వ్యాపించాయని 2018లో నిర్థారించారు. అమెరికన్‌ ప్రభుత్వం 9/11 రోజున ‘దేశభక్తుల దినం (పాట్రియాట్‌ డే)’ పాటించుట ఆనవాయితీగా మారింది. నాటి నుంచి నేటి వరకు అఫ్ఘానిస్థాన్‌లో తాలిబాన్లతో పోరాడుతూ, శత్రువులుగా భావించి, దూరంగా ఉంచుతూ, ఏర్పాటు చేసిన ప్రజా ప్రభుత్వం యుయస్‌-నాటో దళాల సహకారంతో పని చేసింది. యుయస్‌-నాటో దళాల ఉపసంహరణ నిర్ణయంతో తిరిగి తాలిబాన్లు అఫ్ఘానిస్థాన్‌ను చేజిక్కించుకోవడం, రక్తపాతం సృష్టించడం, షరియత్‌ చట్టాల నిర్భంధ అమలు, మహిళల్ని కట్టడి చేయడం, పౌరుల్ని భయప్రాంతుల్ని చేయడం, తాలిబాన్లకు వ్యతిరేకంగా పని చేశారనే నెపంతో పౌరుల్ని వెతికి చంపడం లాంటి అమానవీయ దుశ్చర్యలకు తెర లేపినట్లు అయ్యింది. అగ్రరాజ్యం అమెరికా పలు సందర్భాలలో తీసుకున్న విదేశాంగ నిర్ణయాలు స్వల్పకాలం మేలు చేసినప్పటికీ, దీర్ఘకాలికంగా యుయస్‌కు నష్టాన్ని కలిగిస్తున్నాయని చరిత్ర చెబుతున్నది. పాముకు పాలు పోసి పెంచితే, ఏదో ఒకరోజు కాటు వేయక మానదు. ఎవరు తీసిన గోతిలో వారే పడతారనే నానుడిని అమెరికా మననం చేసుకోవలసిన సమయం ఆసన్నమైంది. ఏది ఏమైనా 9/11 దుర్ఘటన అమెరికా చరిత్రలో అత్యంత చీకటి రోజుగా నిలుస్తున్నది. ప్రపంచ దేశాలు తీవ్రవాద ఊడల్ని నిర్ధాక్షిణ్యంగా పీకివేయడానికి సత్వర చర్యలు తీసుకోవలసిందే. ప్రపంతశాంతి కపోతాన్ని స్వేచ్ఛగా ఎగిరే వాతావరణాన్ని కల్పించాల్సిందే.
                     డా: బుర్ర మధుసూదన్ రెడ్డి
                    కరీంనగర్‌ – 9949700037

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *