- కొరోనా హెచ్చరికల్లో ఏమిటీ దౌర్భాగ్యం
- సామ్నా సంపాదకీయంలో ఘాటు విమర్శలు
ముంబై, డిసెంబర్ 22 : భారత్ జోడో యాత్రను నిలిపివేయాలంటూ కేంద్ర ఆరోగ్య శాఖ జారీ చేసిన ఆదేశాలపై ఉద్ధవ్ ధాకరేకి చెందిన శివసేన వర్గం ఘాటుగా స్పందించింది. రాహుల్ భారత్ జోడో యాత్రను నిలిపివేసేందుకు కేంద్రం కొరోనా వైరస్‌ను ప్రయోగించిందని ఎద్దేవా చేశారు. చట్టం ద్వారా, కుట్రతో భారత్ జోడో యాత్రను అడ్డుకోలేక కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్‌ను విడుదల చేసినట్లు కనిపి స్తోందని ధాకరేకి చెందిన శివసేన మాతృపత్రిక సామ్నా సంపాదకీయంలో పేర్కొంది. భారత్ జోడోయాత్ర కారణంగా కరోనా కేసులు పెరుగుతాయనే భయం సమంజసమైనదే. అయితే మూడేళ్ల క్రితం కరోనా విధ్వంసం సృష్టించిన సమయంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను గుజరాత్‌కు ఆహ్వానించడంతో పాటు ఆయన గౌరవార్థం లక్షలాది మందిని సకరించ లేదా అని పత్రిక పేర్కొంది.
ఆ సమయంలో కరోనా ఆంక్షలు ఎందుకు పాటించలేదని ప్రశ్నించింది. కాగా, కరోనా ఆంక్షలు పాటించకంటే భారత్ జోడోయాత్రను నిలిపివేయాలంటూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుక్ మాండవీయ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారత్ జోడో యాత్ర రాజస్థాన్‌లో కొనసాగుతోంది. మాస్కులు ధరించాలని, వాక్సిన్ వేయించుకున్నవారినే యాత్రలో పాల్గొనేలా చూడాలని ఆ లేఖలో పేర్కొన్పానరు. ఒకవేళ కరోనా నిబంధనలు పాటించకపోతే యాత్రను నిలిపివేయాలని అన్నారు.



