వేలాదిగా తరలివచ్చిన గులాబీ దండు
కారు గుర్తుపై ఓటేస్తాం.. పటాన్ చెరు ప్రగతిని కొనసాగిస్తామంటూ నినాదాలు
కొనసాగుతున్న అభివృద్ధిని ఆశీర్వదించండి
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్ చెరులో అట్టహాసంగా బిఆర్ఎస్ పార్టీ రోడ్ షో.
పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 28: నవంబర్ 30న జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో కారు గుర్తుపై ఓటు వేసి పటాన్ చెరు ప్రగతిని కొనసాగించాలని బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెరు నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజైన మంగళవారం బిఆర్ఎస్ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలోపటాన్ చెరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం నుండి జిఎంఆర్ ఫంక్షన్ హాల్ వరకు వేలాదిమందితో నిర్వహించిన రోడ్డు షోకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజల కష్టనష్టాల్లో అండగా ఉంటూ ఇంటింటికి సంక్షేమ పథకాలు గ్రామ గ్రామాలకు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన బిఆర్ఎస్ పార్టీని నిండు మనసుతో ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. 60 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ , మతతత్వ నినాదంతో గద్దెనెక్కిన బిజెపి పార్టీలను ప్రజలు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. రైతుబంధు విడుదలను అడ్డుకున్న కాంగ్రెస్ పార్టీకి గట్టి బుద్ధి చెప్పాలని కోరారు.రాయి ఏదో రత్నం ఏదో ప్రజలు గమనించాలని, ఆలోచించి ఓటు వేయకపోతే అభివృద్ధి సంక్షేమంలో ఆమడ దూరంలో నిలుస్తామని అన్నారు.పటాన్ చెరు నియోజకవర్గాన్ని 9500 కోట్ల రూపాయలతో అభివృద్ధికి ప్రతీకగా నిలిపామని, ప్రభుత్వం అందించే నిధులతో పాటు సొంత నిధులతో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.ఈ కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయకుమార్, సీనియర్ నాయకులు శంకర్ యాదవ్, సపాన దేవ్, పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, సీనియర్ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.





