- కాంగ్రెస్ అధికారంలోకి రాదు
- టికెట్ల పంపిణీ చేయలేక చతికిల పడిపోయింది
- దర్పల్లి 100 పడకల హాస్పిటల్తోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు
నిజామాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 6 : రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వొచ్చే పరిస్థితి లేదని హరీష్ రావు పేర్కొన్నారు. తప్పుడు సర్వేలతో హస్తం పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుందని దుయ్యబట్టారు. టికెట్ల పంపిణీ చేయలేక ఆ పార్టీ చతికిల పడిపోయిందని విమర్శించారు. బీఆర్ఎస్లో టికెట్లు రాని వారిని కాంగ్రెస్ చేర్చుకుంటుందని హరీష్ రావు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో విద్యార్థులకు గొడ్డు కారంతో అన్నం పెడుతుంటే.. తెలంగాణలో మాత్రం కేసీఆర్ సర్కార్ చిన్నారులకు మమకారంతో అల్పాహారం అందిస్తుందని మంత్రి వెల్లడించారు. కేంద్రం, మహారాష్ట్రలో బీజేపీ సర్కార్ ఉన్నా..నాందేడ్ హాస్పిటల్లో మందులు ఎందుకు లేవని హరీష్ రావు ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో జాకీ పెట్టి లేపినా భారతీయ జనతా పార్టీ లేచే పరిస్థితి లేదని విమర్శించారు. టికెట్ల పంపిణీ చేయలేకపోతున్న కాంగ్రెస్..అధికారంలోకి వొస్తే ఏం అభివృద్ధి చేస్తుందని నిలదీశారు.
అనంతరం హరీష్ రావు నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో రూ.30 కోట్లతో నిర్మించనున్న..100 పడకల హాస్పిటల్కి భూమి పూజ చేశారు. ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ పట్టుపట్టి 100 పడకల హాస్పిటల్ని ఈ ప్రాంతానికి మంజూరు చేయించారని ఆయన తెలిపారు. బాజిరెడ్డిని మరోసారి గెలిపించి హ్యాట్రిక్ ఇవ్వాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్ పాలనలో హాస్పిటల్లో సూది ఉంటే మందు లేని పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. బీడీ పరిశ్రమను దెబ్బతీయడానికే బీడీ కట్టపై జీఎస్టీ వేశారని.. మహిళా బీడీ కార్మికులకు ఫించన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని హరీష్ రావు పేర్కొన్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి తక్కువ నిధులు కేటాయించారని బాజిరెడ్డి గోవర్దన్ అన్నారు. బాల్కొండ నియోజకవర్గానికి ఎక్కువ నిధులు వచ్చాయని.. చిన్న వయస్సులోనే ఆయన పెద్ద పదవిలో ఉన్నారని చెప్పారు. తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని బాజిరెడ్డి గోవర్దన్ సూచించారు. దీనిపై స్పందించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతుందని చెప్పారు. ఎన్ని నిధులు ఇచ్చినా.. బాజిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. రూ.200 కోట్లతో రూరల్ నియోజకవర్గంలో రోడ్లు వేయించామని ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు.





