ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎన్‌కౌంటర్‌         

– మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు రూపీ మృతి
– సిద్దిపేట జిల్లా వాసిగా గుర్తింపు

భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13 : సరిహద్దున ఉన్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మరోసారి తుపాకుల మోత మోగింది. బస్తర్ అటవీ ప్రాంతంలో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మోస్ట్ వాంటెడ్ మహిళా మావోయిస్టు రూపీ అలియాస్ భాగ్య మృతిచెందారు. బస్తర్ అటవీ ప్రాంతంలో నక్సల్స్ సమావేశమయ్యారనే పక్కా సమాచారంతో భద్రతాబలగాలు కూమింగ్ నిర్వహించాయి. కాంకేర్ జిల్లాలోని చోటే భేటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మచ్చుపల్లి, హిందూ అటవీ ప్రాంతంలోకి ప్రవేశించిన బలగాలకు మావోయిస్టులు ఎదురుపడటంతో ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో ఏరియా కమిటీ సభ్యురాలు రూపి అలియాస్ భాగ్య మృతిచెందారు. ఘటనా స్థలం వద్ద ఒక పిస్టల్, మందు గుండు సామగ్రి, ఇతర వస్తువులను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఎన్‌కౌంటర్ సమయంలో సుమారు పదిమంది మావోయిస్టులు అడవుల్లోకి పారిపోయినట్లు సమాచారం. వారిని పట్టుకోవడానికి డ్రోన్ సర్వైలెన్స్, ప్రత్యేక కూంబింగ్ బలగాలను ఉపయోగిస్తున్నట్లు సమాచారం. రూపీపై రూ.25 లక్షల రివార్డు ఉన్నట్లు తెలుస్తోంది. రూపి 2025లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్టు అగ్రనేత విజయ్ రెడ్డి భార్యగా గుర్తించారు. ఈ ఎన్‌కౌంటర్‌ను కాంకేర్ జిల్లా ఎస్పీ నిఖిల్ రాకేష్ ధ్రువీకరించారు. రూపీ స్వస్థలం సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలోని ధర్మారం గ్రామంగా గుర్తించారు. 2004లో మావోయిస్టు పార్టీలో చేరి ఉద్యమబాట పట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంచి గుర్తింపు సాధించారు. కాగా, గత నెలలో కూడా ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతమైన సంగతి తెలిసిందే. ఎన్‌కౌంటర్ నేపథ్యంలో సమీప గ్రామాల్లో భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అటవీ ప్రాంతానికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *