చదువు సమాజ పురోగతికి దోహదం చేయాలి

  • పర్యాటక రంగ అభివృద్ధి ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి
  • గిరిజన పూజారుల సమ్మేలనంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
  • వర్చువల్‌గా ఏకలవ్య మోడల్‌ ‌రెసిడెన్సియల్‌ ‌పాఠశాలలను ప్రారంభం
  • శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్న రాష్ట్రపతి
  • 41.38 కోట్లతో పనులకు శంఖుస్థాపన

భద్రాచలం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 28 : ‌విద్యార్ధులు చదువుపై మనసు లగ్నం చేయాలని, చదువు పూర్తయి, స్వావలంబన సాధించాక తిరిగి సమాజ పురోగతికి దోహదం చేయాలని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉద్భోదించారు. సమాజ పురోగతి బాధ్యత ప్రభుత్వానిదో లేక సంబంధిత సంస్థలదో మాత్రమే కాదనీ, అది ప్రతి ఒక్కరి కర్తవ్యమని పేర్కొన్నారు. బుధవారం భద్రాచలంలోని వీరభద్ర కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమ్మక్క సారలమ్మ గిరిజన పూజారుల సమ్మేలనాన్ని ప్రారంభించిన అనంతరం ఆసిఫాబాద్‌, ‌మహబూబాబాద్‌ ‌జిల్లాలలో  గిరిజన ప్రాంతాలలో విద్యా సదుపాయాలను మెరుగుపరిచేందుకు నిర్మించిన  ఏకలవ్య మోడల్‌ ‌రెసిడెన్షియల్‌ ‌పాఠశాలలను రాష్ట్రపతి వర్చువల్‌ ‌విధానం ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి తెలుగులో అందరికి నమస్కారం అని అభివాదం చేసి అందర్నీ ఆశ్చర్య పరిచారు. ‘నా తెలంగాణా కోటి రతనాల వీణ..’ అని ప్రముఖ కవి దాశరథి రాసిన కవితా పంక్తులను ఈ సందర్భంగా ప్రస్తావించారు. తెలంగాణాలో మొదటిసారి చేస్తున్న పర్యటనలో ఆలయాల్లో దేశ ప్రజల సంక్షేమం కోసం ప్రార్థించే అవకాశం లభించిందని అన్నారు.

పర్యాటక రంగ అబివృద్ధి ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని చెబుతూ, ప్రసాద్‌ ‌పధకం ద్వారా తీసుకుంటున్న చర్యలపై కేంద్ర పర్యాటక శాఖను రాష్ట్రపతి అభినందించారు. ప్రసాద్‌ ‌పథకం ద్వారా దేవాలయాల్లో చేపడుతున్న సౌకర్యాల మెరుగుదలతో దేశ, విదేశీ యాత్రికులు తీర్థ యాత్రలకు వొచ్చే అవకాశాలు పెరుగుతాయని, దీంతో ఆధ్యాత్మిక, సాంస్కృతిక శోభ విలసిల్లుతుందని ఆమె అన్నారు. ప్రసాద్‌ ‌పథకం ఇంకా ముందుకు తీసుకువెళ్లాలని ఆమె తెలిపారు. తెలంగాణ వనవాసీ పరిషత్‌ ‌ద్వారా గిరిజన సంస్కృతీ సాంప్రదాయాల పరిరక్షణకు జరుగుతున్న కృషిని ఆమె కొనియాడారు. సమ్మక్క సారలమ్మ లాంటి జాతరలు సమాజ మూల విలువలను పటిష్టం చేస్తాయని రాష్ట్రపతి పేర్కొన్నారు. అన్ని ప్రగతి రంగాల్లోను మహిళల భాగస్వామ్యం ఉండాలని, గిరిజన మహిళల ఆర్థిక స్వావలంబన కోసం మరిన్ని చర్యలు అవసరమని పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వ ఏకలవ్య ఆదర్శ పాఠశాలలు గిరిజన, మారుమూల ప్రాంతాల విద్యార్థుల అవసరాలను తీరుస్తూ మెరుగైన విద్యను అందిస్తున్నారు. నేటి తరం విద్యార్థులు  భావి భారత పౌరులని, విద్యార్థులతోనే దేశ భవిష్యత్తు ఉంటుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసి, ఇతర ప్రాంతాల గిరిజన బాలలను ఈ కార్యక్రమంలో భాగస్వాముల్ని చేయటం పట్ల రాష్ట్రపతి సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్త్రీ శిశు, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్‌ ‌మాట్లాడుతూ…గిరిజన సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గిరిజన విద్య కోసం, గిరిజన సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణకు పలు చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ ‌తమిళి సై సౌందర రాజన్‌, ‌కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి జి. కిషన్‌ ‌రెడ్డి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ ‌కుమార్‌, ఎం‌పిలు వద్దిరాజు రవిచంద్ర, మాలోతు కవిత, భదాద్రి కొత్తగూడెం జెడ్పి చైర్మన్‌ ‌కోరం కనకయ్య, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌, ‌భద్రాచలం, పినపాక ఎమ్మెల్యేలు పోదెం వీరయ్య, ఏకలవ్య మోడల్‌ ‌రెసిడెన్షియల్‌ ‌స్కూళ్ల సెక్రటరీ రోనాల్డ్ ‌రాస్‌, ‌డిఐజీ నాగిరెడ్డి, జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌, ఎస్పీ డా. వినీత్‌, ఐటిడిఎ పీవో గౌతమ్‌ ‌పోట్రూ, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

శ్రీసీతారామచంద్రస్వామివారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము…41.38 కోట్లతో పనులకు శంఖుస్థాపన భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది మురుము కేంద్ర పర్యటన మంత్రిత్వ శాఖ ద్వారా 41.38 కోట్లతో చేపట్టనున్న పనులకు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.  అనంతరం శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్నారు. భారత రాష్ట్రపతికి సాంప్రదాయ బద్ధంగా పూర్ణ కుంభం, మేళతాళాలతో వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వాగతం పలికారు. ఆలయంలో మూల వరులకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం లక్ష్మీతాయారు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో వైదిక సిబ్బంది వేద ఆశీర్వచనం అందచేశారు. అనంతరం భదాద్రి దేవస్థానం తరపున రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్‌ ‌పట్టు వస్త్రాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ ‌తమిళి సై సౌందరాజన్‌, ‌కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి,  రాష్ట్ర మంత్రులు పువ్వాడ అజయ్‌ ‌కుమార్‌, ‌సత్యవతి రాథోడ్‌, ఎం‌పిలు, ఎంఎల్‌ఏలు, వేద పండితులు స్థలసాయి, మురళి, గోపి, ప్రధాన అర్చకులు విజయరాఘవన్‌, ‌రామస్వరూప్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *