చదువుల పరమార్థం చాటిచెప్పాలి

ఎక్కడ పోతే, అక్కడే వెతుక్కోవాలనే నానుడి తెలుగు నాట సుప్రసిద్ధి గాంచింది. మనం కోల్పోతున్న విలువలను మనమే పునర్జీవింప చేయాలి. రోగం ప్రాథమిక స్థాయిలో ఉండగానే చికిత్స జరగాలి. రోగం ముదిరిన తర్వాత ఔషధాలతో చికిత్స క్లిష్టతరం, కష్టసాధ్యం. పూర్వం ఒక న్యుమేనియా వైద్యుడు తన వద్దకు వచ్చిన రోగులందరినీ న్యుమేనియా రోగం లోకి దించి, చికిత్స చేసేవాడంట. అన్ని రోగాలకు ఒకటే చికిత్స అన్నట్టు గా నేడు కూడా మనమంతా మూల కారణాన్ని గుర్తించకుండా సమాజం మారాలని కోరుకోవడం విడ్డూరం.

విలువల విధ్వంసానికి కారణం నేటి మన విద్యావ్యవస్థ.  బట్టీ చదువులతో నిరంతరం కుస్తీ పడుతూ, కేవలం ఉద్యోగాల కోసమే చదువులు అన్నట్టుగా విద్యార్థుల మెదళ్ళలో విష బీజాలు నాటడం జరిగింది. ఇలాంటి చదువుల వలన సమాజం ఎలా బాగుపడుతుంది?   నడుస్తున్న సమాజంలో విలువలు నశించడానికి మూలకారణమైన విద్యావ్యవస్థను సంస్కరించాలి. చిన్న వయసు నుండే విద్యార్థుల మనసుల్లో మంచి చెడు, మానవత్వం, నీతి, న్యాయం గురించిన పాఠాలు నేర్పాలి.  ఇవన్నీ మాకెందుకులే అనే బాధ్యతా రాహిత్యాన్ని ఉపాధ్యాయులు విడనాడాలి. ప్రతీ ఉపాధ్యాయుడు తమకున్న సమయంలో కనీసం  ఐదు నిమిషాలు విద్యార్థుల్లో విలువలు పెంపొందించేందుకు కృషిచేయాలి.

దీనివలన దీర్ఘకాలంలో చక్కని ఫలితాలు వస్తాయనడంలో సందేహం లేదు.సకల సంపదల్లో ‘విద్య’ అనే సంపద అత్యంత శ్రేష్టమైనది. విద్య ద్వారా ఇతర సంపదలు వాటంతటవే ప్రాప్తిస్తాయి.విద్య ద్వారా విలువలు పెంపొందాలి. సంస్కారం లేని విద్యల వలన ప్రయోజనం శూన్యం.  నేటి చదువులు కేవలం ధనార్జన మార్గాలను చూపిస్తున్నాయే కాని నిజమైన బ్రతుకు విలువను నేర్పడం లేదు.  ఈ కారణం గానే నేటి సమాజంలో స్వార్ధం, ద్రోహం,అవినీతి, కృతఘ్నత  పెరిగి పోతున్నాయి.  ఎలా బ్రతకాలో నేర్పని చదువులు  ఏదో విధంగా బ్రతికేయమని చాటి చెబుతున్నాయి. విలువలు నేర్పని చదువుల కోసం విద్యార్థులు నానా అగచాట్లు పడుతున్నారు. ధనం చుట్టూ జనం పరుగెడుతున్నారు.

‘ధనం మూలం ఇదం జగత్‌’ అనే నానుడి వాస్తవమై మానవజీవితాలను శాసిస్తున్నది. దుష్టుడైనా, దుర్మార్గు డైనా ధనముంటే దేవుడని కొలుస్తుందీ లోకం. మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలై ఒకరికొకరు ఏమీ కానట్టుగా, ఎలాంటి ఆత్మీయతలు లేని కృత్రిమమైన సంబంధాలతో కొనసాగుతున్న నేటి జీవితాలు  మానవత్వాన్నే వెక్కిరిస్తున్నాయి. విజ్ఞానులమనుకుని విర్రవీగే విద్యావంతులు అజ్ఞాన తిమిరాంధకారంలో అలమటిస్తున్నారు. పట్టాలు ప్రతిభను ప్రసాదించడం లేదు. నేటి సమాజంలో చోటు చేసుకుంటున్న  అపసవ్య ధోరణులకు  లోపభూయిష్టమైన  విద్యావిధానమే మూలకారణం. కష్టించి పెద్ద చేసిన వారిని అవసరం తీరిన తర్వాత  కూరలో కరివేపాకులా తృణీకరిస్తున్నారు. అహంకారంతో బయటకు వెళ్లగొడుతున్నారు. మచ్చుకైనా వివేకం కానరాదు. ఇవీ  నేటి విద్యలు నేర్పుతున్న విలువలు!

బంధాలనే బలహీనతలకు బందీగా మారి,జీవిత సర్వస్వం ధారబోసి,త్యాగాల యజ్ఞంలో సమిధలై వెలుగునిచ్చే ప్రమిధలై, కరిగిపోయే క్రొవ్వొత్తిలా కాంతినిచ్చి, చివరికి కొడిగట్టిన దీపంలా మిగిలితే పెంచుకున్న ఆశలన్నీ ఆవిరై, తాము పెంచిన బిడ్డలే  రెక్కలొచ్చిన పక్షుల్లా రివ్వురివ్వు మని ఎగిరిపోయి, అన్నీ తెంచుకుని, ప్రేమల నీడలో సేదతీరితే,అమృతాన్ని చిలికించే బంధాలన్నీ విషంలా అనిపించడంలో తప్పేముంది?ఎదలోతుల్లో పెనవేసుకున్న బంధాల సౌధాలన్నీ తమ కనుల ముందే పేకమేడల్లా కూలిపోతే, కనికరం కానరాని కఠిన హృదయాలన్నీ వేరేచోట ఆనందంగా  సేదతీరుతున్నాయి.అది ఆనందం కాదని, తాము సేదతీరుతున్నది రక్షించే విహంగపు రెక్కలచాటున కాదని,భక్షించే రాబంధుల రెక్కల మాటున అని గ్రహించేలోపు జీవితం తెల్లారిపోతుంది. ఉడుకురక్తం చల్లారి పోతుంది.నడవాలంటే  నీరసం, మాట్లాడాలంటే  ఆయాసం ఆవహించి,తమ స్థితులు గతులు తప్పిననాడు గతాన్ని వెనక్కి తీసుకురాక, వర్తమానంలో బ్రతకలేక, భవిష్యత్తే బరువై గమ్యం కానరాని మార్గాలకు పయనమైతే  ఆరాటమే తప్ప ఫలితం శూన్యం.

నేటి యువత దాదాపుగా ఇదే దారిలో పయనిస్తున్నది. పెద్దల సంపాదన కావాలి. వారి యోగక్షేమాలను చూడడం వారి బాధ్యతకాదా?నలుగురిలో వారిని పరిచయం చేయడం నామోషీ, అవమానకరం. వారి సంపాదనతో నిస్సిగ్గుగా జల్సాలు చేసి, పరాన్నజీవులు గా బ్రతకడం లో లేని అవమానం,మిగిలిన విషయా ల్లో కానరావడం దౌర్భాగ్యం. ‘‘చదువు రాకముందు కాకరకాయ, చదువుకున్న తర్వాత కీకరకాయ…’’ అనే సామెతను తలపిస్తూ, చదవేస్తే ఉన్నమతి పోయినట్టు ప్రవర్తించే ప్రబుద్ధుల వక్రబుద్దులు వర్ణింపశక్యంకాదు .ఇలాంటి అనుచిత ధోరణులన్నీ చదువు’కొన్న’’ విద్యాధిక యువతలో  అడుగడుగునా కానవస్తున్నాయి. నేటి మన విద్యావిధానంలో చోటుచేసుకుంటున్న విపరీత ధోరణులే యువత లో తలెత్తే ఉన్మాద చేష్ఠలకు పరాకాష్ఠ.

చదువుకున్న వారు మూర్కుల్లా  ప్రవర్తిస్తుంటే, చదువులేని వారు జ్ఞానుల్లా ప్రవర్తిస్తున్న నేపథ్యంలో మనచదువులకున్న విలువేమిటి?  పెద్దలను గౌరవించని విద్యలు బూడిదలో పోసిన పన్నీరే. అయినా చదువులు అంగట్లో అమ్ముడుపోయే సరుకుల్లా తయారైనాయి. చదువు’’కొంటే’’ చాలు చదవనక్కరలేదు. ‘‘లేనోడికి దొరకనప్పుడు, ఉన్నోడికి అరిగినప్పుడే ఆకలి..’’ అన్నట్టుగా  అప్పుడప్పుడూ వచ్చిపోయే అతిథుల్లా  మేమూ విద్యార్ధులమేనంటూ తళుక్కున మెరిసి,చటుక్కున మాయమైతే చాలు, పట్టా చేతికొస్తుంది. పట్టాలు లేని రైలులా  సమాజంలోకి దూసుకువచ్చి, మేథావుల్లా  చెలామణీ కావచ్చు. జనాలను ప్రమాదంలోకి నెట్టేయవచ్చు. డిగ్రీలు బడాయిని పెంచుతున్నాయి.

అర్ధంలేని భావాలను అసహ్యంగా పలికిస్తున్నాయి. నైతిక విలువలను చంపేస్తున్నాయి. తల్లిదండ్రుల పెంపకం కూడా సరిగా లేకపోవడం వలన ఎదిగిన పిల్లలు ఎదురుతిరుగుతున్నారు. తామేదో జ్ఞానులమైపోయామని ,చరవాణి చేతధరించి, కృత్రిమ అలంకారాలతో బడాయి పోతున్నారు. తల్లిదండ్రులు కూడా నాలుగు ఆంగ్ల పదాలను వాడి, ఫ్యాషన్లలో విహరించే పిల్లలను చూసి మురిసి పోతున్నారే గాని వారిని మూరులుగా తయారుచేస్తున్నామని గమనించలేకపోతున్నారు. సర్వం సమకూర్చిపెట్టి, అహర్నిశలూ కష్టించి, సర్వస్వం ధారబోసి  చదువులను ‘‘కొని’’ పెట్టి, సమాజానికి గుదిబండల్లా, సోమరుల్లా  తయారు చేస్తున్న వారు తల్లిదండ్రులే అని చెప్పకతప్పదు.

తాము తినకుండా తమబిడ్డలకోసం   సర్వస్వం త్యాగం చేస్తే, తల్లి దండ్రుల సంపాదనతో సకల భోగాలను అనుభవిస్తూ, కన్నవారినే భారంగా, అవమానంగా భావిస్తూ, వృద్ధాశ్రమాల్లోకి గెంటేసి, మానవత్వాన్నే మంట గలుపుతున్న సజీవ దృశ్యాలెన్నో మనకళ్ళెదుట కానవస్తున్నాయి. కలలన్నీ కల్లలైతే,కన్నీళ్ళే కనుపాపలకు శాపమైతే  బరువెక్కిన కనురెప్పలు భారంగా కనులను కప్పేస్తున్న కథలెన్నో కన్నోళ్ళను కాటికి పంపుతున్నాయి. బరువెక్కిన హృదయాలన్నీ బడబాగ్ని కి బద్ధలైతే శోకం లో కూడా ప్రేమను చూపించే గుణం పెద్దలది. విలువలు నేర్పని బడాయి చదువులకు బలయ్యేది అంతిమంగా సమాజమే. విలువలు నశించిన చదువుల  సారాంశమిదే. జ్ఞానం పెంచని చదువులతో భద్రంగా బ్రతికేస్తున్నామనే భ్రమలో బద్దకస్తులుగా తయారౌతున్న యువత ధోరణి అత్యంత ప్రమాదకరం.

పిల్లొచ్చి గుడ్డును వెక్కిరించిన చందంగా తమను పెంచిన పెద్దలను తృణీకారభావంతో ఈసడిరచుకుంటుంటే ‘‘కడివెడు గుమ్మడికాయ కత్తిపీటకు లోకువైనట్టుగా మౌనంగా రోదించడమే పెద్దల వంతు. సర్వత్రా ఇదే తంతు. ‘‘తాంబూలాలిచ్చేసాం తన్నుకు చావండి’’ అన్నట్టుగా విద్యాలయాలన్నీ విద్యార్ధుల ఆలోచనలకే అందని అత్యుత్తమ ఫలితాలనిచ్చేసి, పట్టభద్రులుగా సమాజంలోకి వదిలేస్తే వారు పట్టభద్రులు గా కాక ఉత్తభద్రులు గా తయారై విద్య అనే పదానికే ద్రోహం చేస్తున్నారు. ఈ దేశంలో పుట్టి, ఈ దేశాన్నే అవమానిస్తున్నారు.జ్ఞాన శూన్యులై – అహంకారంతో  పొగరెక్కి మంచి చెడుల విచక్షణ మరచి పోయి, సంస్కారహీనుల్లా తినడానికే బ్రతికి…తిండికోసమే చస్తూ, విలాసాల్లో తేలియాడే యువత అందించే సందేశమేమిటి?   మానవీయ కోణాన్ని వదిలేసి, అడ్డగోలు గా మాట్లాడుతూ, విధ్వంసకారుల్లా తయారై  సమాజానికి కొరకరాని కొయ్యలా తయారైన యువతను గూర్చి ఎంత చెప్పుకున్నా తక్కువే.

విద్యావిహీనుల కంటే విద్యావంతుల వలనే సమాజానికి హానికలిగే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలాంటి  అవసవ్యమైన పోకడలకు చోటివ్వకుండా చూడాలి. విద్యార్థులకు విలువల ఆధారిత పాఠ్యాంశాలు రూపొందించాలి. పట్టాలను ప్రధానం చేయడంలో తగిన మార్గనిర్ధేశకాలు ప్రవేశపెట్టాలి. దేశభక్తి,విజ్ఞానం వినయం,వివేకం రంగరించిన విద్యలకు అంకురార్పణ గావించాలి. చదువులకు చేసే ఉద్యోగాలకు సంబంధం లేని వర్తమాన విద్యావ్యవస్థలోని లోపాలను సరిదిద్దాలి. చదువుల పరమార్థం చాటిచెప్పాలి.

సుంకవల్లి సత్తిరాజు
(సామాజిక విశ్లేషకులు)
సంగాయగూడెం, దేవరపల్లి మండలం,
తూ.గో.జిల్లా, ఆంధ్రప్రదేశ్‌
9704903463

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *