ఘనంగా నెల రోజుల పాటు రాష్ట్ర పండుగ..‘‘బోనాలు’’

  • అమ్మవారికి బోనమెత్తిన సబ్బండ వర్గాలు, సకల జనులు
  • అడుగడుగునా పర్యవేక్షణతో ఘనంగా వేడుకలను నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం
  • రాష్ట్ర దేవాదాయ శాఖ, ఇతర శాఖల కృషితో విజయవంతం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 17 : రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నెల రోజులపాటు నిర్వహించిన ఆషాడ మాస బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగి విజయవంతమయ్యాయి. అత్యంత ప్రాముఖ్యత కలిగిన బోనాల పండుగను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటిస్తూ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దం పట్టేలా  రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన బోనాల పండుగ ఉత్సవాలు ఆషాడం మాసంలో నెల రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా వైభవంగా జరిగాయి. తెలంగాణ ప్రజల ఆధ్యాత్మిక సంస్కృతికి బోనాల పండుగ ప్రతీక. ప్రకృతితో మమేకమై జీవించే వ్యవసాయ ఆధారిత సమాజ సాంప్రదాయ సామూహిక తాత్వికత, బోనాల పండుగ సందర్భంగా తెలంగాణ గడ్డమీద నుంచి ప్రపంచానికి ప్రదర్శితం అవుతుంది. భారతీయ సాంప్రదాయ సబ్బండ వర్గాల సాంస్కృతిక వేడుకగా తెలంగాణ బోనాల పండుగ ప్రత్యేకతను చాటుకుంటున్నది.

తమ ఆరోగ్యాలను కాపాడుతూ, పంటలను కాపాడుతూ, నీటి చెరువు కట్టలను కాపాడుతూ, రక్షణగా నిలుస్తూ, కష్టాలలో సుఖాలలో తమకు అండగా నిలబడే ప్రకృతి దేవతలను తరతరాలుగా కొలుస్తూ  కొనసాగుతున్న ఉత్సవాల్లో బోనాల పండుగ ప్రముఖమైంది. ప్రకృతి దేవతలైన ఎల్లమ్మ, పోచమ్మ, ముత్యాలమ్మ తదితర రూపాల్లో ఉన్న అమ్మవారికి  ఆషాడ మాసమంతా బోనాలు సమర్పిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఉత్సవాలు జరుపుకుంటారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా రాష్ట్ర ప్రజలంతా ఎంతో సంతోషంగా బోనాల పండుగను జరుపుకున్నారు.తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వాన్ని చాటేలా దేశ రాజధాని దిల్లీలో కూడా బోనాల పండుగను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. గోల్కొండ జగదాంబ మహంకాళి బోనాలతో జూన్‌ 22‌న ప్రారంభమైన బోనాల పండుగ వేడుకలు నేటితో అనగా జూలై 17న ముగిసాయి.

రాష్ట్ర వ్యాప్తంగా బోనాల పండుగను ఘనంగా జరిపేందుకు ప్రభుత్వం రూ.15 కోట్లను కేటాయించింది. హైదరాబాద్‌లోని 1073 దేవాలయాలకు, సికింద్రాబాద్‌లో 1076, రంగారెడ్డి జిల్లాలో 364, మేడ్చల్‌ ‌మల్కాజిగిరి జిల్లాలో 523….మొత్తం 3036 దేవాలయాలకు మరమ్మతులు, రంగులు, విద్యుత్‌ అలంకరణ కోసం ఈ నిధులను ఖర్చు చేశారు. అమ్మవారి బోనాల పండుగ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కల్చర్‌, ‌టూరిజం, ఐ అండ్‌ ‌పీఆర్‌, ఆర్కియాలజి, జీహెచ్‌ఎం‌సీ, సివరేజి బోర్డు, ఎలక్ట్రిక్‌, ‌దేవాదాయ శాఖ, ఆర్‌ అం‌డ్‌ ‌బి, ట్రాన్స్ ‌కో, హెచ్‌ఎం ‌డబ్ల్యు ఎస్‌ ఎస్‌ ‌బి, సివిల్‌ ‌సప్లైస్‌, ‌టిఎస్‌ ఆర్టీసి, రైల్వే, పోలీస్‌ ‌శాఖలు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా తగిన ఏర్పాట్లను చేశారు.

దేవాలయాలను చక్కగా అలంకరించారు. తెలంగాణ పోలీస్‌, ‌షీ టీమ్స్, ‌ర్యాపిడ్‌ ‌యాక్షన్‌ ‌ఫోర్స్ ‌తో కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. బోనాలు సమర్పించేందుకు మహిళా భక్తులకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా సబ్బండవర్ణాలు పెద్దఎత్తున తరలిరావడంతో అమ్మవారి ఆలయాలు కిక్కిరిసిపోయాయి. తెలంగాణ సాంప్రదాయానికి అద్దంపట్టే బోనాల జాతరతో రాష్ట్రమంతటా ఆధ్యాత్మకత ఉట్టిపడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *