హయత్ నగర్, ప్రజాతంత్ర , ఆగస్ట్ 10 : లింగోజిగూడ డివిజన్ లోని గ్రీన్ పార్క్ కాలనీలో గురువారం తీజ్ పండుగను ఘనంగా నిర్వహించారు. సేవాలాల్ అసోసియేషన్ కమిటీ ప్రత్యేక ఆహ్వానం మేరకు ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ మల్ రెడ్డి రాంరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యువతులు మొలకలబుట్ట నెత్తిపై పెట్టుకొని ఊరేగింపుగా వెళ్లడం ఈ పండుగలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. తీజ్ పండుగను సేవా బాయ దండియాడి అనే దేవత జరిపిస్తుందని, తీజ్ ఈ సందర్భంగా రాంరెడ్డి మాట్లాడుతూ.. గిరిజన తండాలలో అవివాహిత ఆడపిల్లలు ప్రత్యేకంగా జరుపుకునే పండుగ తీజ్, కాలం మారుతున్నా లంబాడీలు మాత్రం తమ సంస్కృతిని, సంప్రదాయాన్ని కాపాడుకుంటూ వస్తున్నారని కొనియాడారు. తొమ్మిది రోజులు అమ్మాయిలకు కఠిన నియమాలు ఉంటాయని ఉప్పు, కారం లేని భోజనం తినాలని, అత్యంత పవిత్రంగా ఉండాలని భక్తితో దేవతలను పూజించాలన్నారు. ఇంత గొప్పగా జరుపుకునే తీజ్‌ను ప్రభుత్వం అధికారిక పండుగగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజనులపై చూపిస్తున్న వివక్షపై, గిరిజనులను పోడు భూముల నుండి తరిమేస్తున్నారని, గిరిజన బంధు పథకం హామీని తుంగల తొక్కారని మండిపడ్డారు. గిరిజన విశ్వవిద్యాలయం సాధించడంలో, అటవీ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించడంలో కేసీఆర్ విఫలమయ్యాడని విమర్శించారు. గిరిజన ద్రోహి కేసీఆర్ అనీ, గిరిజన వ్యతిరేకి పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు . గిరిజన సంక్షేమమే కాంగ్రెస్ విధానమని, కాంగ్రెస్ ప్రభుత్వంలోనే గిరిజనుల అభివృద్ధి జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2014 మార్చి 31 నాటికి అటవీ హక్కు చట్టం, 2006 కింద గిరిజనులకు 8,09,059 ఎకరాలకు పోడు పట్టాలు పంపిణీ చేసిందని తెలిపారు. రాష్ట్రంలో ఎస్టీల జనాభా నిష్పత్తికి సమానమైన బడ్జెట్ కేటాయింపులను అందించడానికి 1975 లోనే గిరిజన “ఉప ప్రణాళిక”ను ప్రారంభించిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. 2008 నుండి ర్యాంకులతో సంబంధం లేకుండా వృత్తిపరమైన విద్యను అభ్యసిస్తున్న ఎస్టీ విద్యార్థులందరికీ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అందించిందని తెలిపారు. ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జరిగాయని అన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగరబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ ఎస్టీ సెల్ చైర్మన్ రమేష్ నాయక్, కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు శ్రీపాల్ రెడ్డి, నర్సింహా యాదవ్, వేణు యాదవ్, మంజుల రెడ్డి; బద్రీనాథ్ గుప్త, సుధీర్ రెడ్డి, నిర్వాహకులు బద్రి నాయక్, కిషన్ నాయక్, దీప్ల నాయక్, గణేష్ నాయక్, రాజు నాయక్, రాంబాబు నాయక్, వెంకట్రామ్, కుమార్, బిచ్చా , సంతోష్ తదితరులు పాల్గొన్నారు.




